logo

కోతలు మొదలైనా.. ధర పెరగలే..!

జిల్లాలోని పలు మండలాల్లో గత నాలుగు రోజులుగా వర్షాలు వీడనే లేదు.. దీంతో మామిడి తోటల్లో తేమ అధికం కావడంతో రైతులు మామిడి కాయల కోతలు నిలిపివేశారు..

Published : 22 Jun 2024 04:13 IST

తోతాపురి టన్ను రూ.27 వేలు 
వెలవెలబోయిన క్రయవిక్రయాలు 

బంగారుపాళ్యం, న్యూస్‌టుడే: జిల్లాలోని పలు మండలాల్లో గత నాలుగు రోజులుగా వర్షాలు వీడనే లేదు.. దీంతో మామిడి తోటల్లో తేమ అధికం కావడంతో రైతులు మామిడి కాయల కోతలు నిలిపివేశారు.. తాజాగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి కాసింత తెరపించడంతో ఎంతో ఆశతో రైతులు కాయలు కోసి యార్డులకు తరలించారు.. ఫలితంగా టన్నుకు రూ.వెయ్యి ధర అదనంగా పెరగడంతో ఆనోటా ఈనోటా విని సాయంత్రానికి భారీగానే కాయలు విక్రయాలకు తీసుకొచ్చారు.

వాస్తవానికి ఏటా ఈ సమయానికి జిల్లాలోని 50 శాతం పైగా పంట దిగుబడి వస్తుంది. వారం రోజుల క్రితం ధర పతనం కావడంతో రైతులు మామిడి కోతలు నిలిపేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో నాలుగు రోజులుగా బహిరంగ మార్కెట్‌లో అంతంత మాత్రంగా ఉన్న తోతాపురి కాయల ధర టన్ను శుక్రవారం రూ.27 వేలు పలికింది. పెరిగిన ధర రైతులకు కాస్త ఊరట ఇచ్చినా కాయల కోతలు పూర్తిస్థాయిలో చేపట్టలేని పరిస్థితి. మరోవైపు అధిక తేమ కారణంగా తోటలో కలుపు ఎక్కువై తెగుళ్లు సోకుతాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు తగ్గితే పంట పూర్తిగా కోసేయాలని భావిస్తున్నారు. కాసింత ధర పెరగడంతో స్థానిక మార్కెట్‌ యార్డులో సుమారు వంద టన్నుల కాయలు అమ్మకానికి వచ్చాయి. ర్యాంపు, మండీ వ్యాపారులు టన్ను రూ.27 వేలకు కొనుగోలు చేశారు. వారం రోజులుగా ధర లేక మార్కెట్‌యార్డు, ర్యాంపులు అమ్మకాలు లేక వెలవెలబోయాయి. లారీలకు లోడు కాలేదు. తోతాపురికి రూ.30 వేలు చెల్లించాలని రైతులు డిమాండు చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు కలెక్టర్‌ సహా ఉద్యాన అధికారులు గిట్టుబాటు ధర కల్పించాలని ఆదేశించినా ఆలకించిన నాడడే కరవయ్యాడు. 

గుజ్జు పరిశ్రమలకు తరలించండి.. 

రైతులు తోతాపురి కాయలను పండ్లగుజ్జు పరిశ్రమల నిర్వాహకులు.. బహిరంగ మార్కెట్‌లోకన్నా.. టన్నుకు రూ.వెయ్యికి అదనంగా కొనుగోలు చేస్తారని ఉద్యానశాఖ అధికారులు తెలిపారు. రైతులు పండ్లగుజ్జు పరిశ్రమలకు కాయలు తరలిస్తే లాభదాయకంగా ఉంటుందని పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని