logo

ఈ పరిసరాలకు మోక్షమెన్నడు తిరుమలేశా..?

తిరుమల నారాయణగిరి ఉద్యానవనం క్యూలైన్లలో పారిశుద్ధ్య నిర్వహణలో వైఫల్యంపై తితిదే ఈవో జె.శ్యామలరావు సంబంధిత అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీచేశారు.

Published : 22 Jun 2024 04:17 IST

క్యూలైన్ల వెంబడి వ్యర్థాల తొలగింపులో నిర్లక్ష్యం

క్యూలైన్‌ పక్కనే పోగుపడిన వ్యర్థాలు

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల నారాయణగిరి ఉద్యానవనం క్యూలైన్లలో పారిశుద్ధ్య నిర్వహణలో వైఫల్యంపై తితిదే ఈవో జె.శ్యామలరావు సంబంధిత అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. అయినా తిరుమలలో చాలా ప్రదేశాల్లో పారిశుద్ధ్య నిర్వహణను ఆరోగ్యశాఖ అలక్ష్యం చేస్తోంది. దీంతో పరిసరాల పరిశుభ్రత లోపించడంతోపాటు భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. 

శ్రీవారి ఆలయం వాహన మండపం సమీపంలో..  

దుర్వాసనతో అవస్థ

సర్వదర్శనం భక్తులు వెళ్లే క్యూలైన్ల సమీపంలోని నారాయణగిరి షెడ్లు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2 సమీపంలో వ్యర్థాలను సకాలంలో పారిశుద్ధ్య సిబ్బంది తొలగించడం లేదు. స్థానిక ఆళ్వార్‌ట్యాంక్‌ వద్ద క్యూలైన్ల పక్కనే పెద్దయెత్తున చెత్త పేరుకపోయినా తొలగించేవారు లేరు. అదేవిధంగా ఆళ్వార్‌ ట్యాంక్‌ వద్ద క్యూలైన్‌కు సమీపంలో ఉన్న మరుగుదొడ్డి మరమ్మతులకు గురై డ్రైనేజీ మురుగు నీరు బయటకు రావడంతో భక్తులు దుర్వాసనతో ఇబ్బందిపడుతున్నారు. తిరుమలలో వివిధ ప్రాంతాలు, అతిథిగృహాల వద్ద పోగుపడిన చెత్తను సకాలంలో తొలగించడం లేదు. దీంతో డస్ట్‌బిన్లు నిండి వ్యర్థాలు చుట్టూ పడుతూ దుర్వాసన వస్తోంది. 

క్యూలైన్ల పక్కన తొలగించని అన్నప్రసాదాల ప్లేట్లు

పాదరక్షల నిర్వహణలో వైఫల్యం

తిరుమల వ్యాప్తంగా పాదరక్షల నిర్వహణ కోసం పలుప్రాంతాల్లో పాదరక్షలను భద్ర పరిచేందుకు కేంద్రాలను ఏర్పాటుచేశారు. శ్రీవారి ఆలయం ఎదుట పాదరక్షల కేంద్రాలను ఏర్పాటుచేశారు. నారాయణగిరి షెడ్ల వద్ద సర్వదర్శనం భక్తులు వెళ్లే మార్గంలో పాదరక్షల భద్రపరిచే కేంద్రాన్ని తితిదే నిర్మించినా ఇప్పటికీ అది ప్రారంభం కాలేదు. దీనిపై సంబంధిత అధికారులు దృష్టిసారించి భక్తులు ఎక్కువగా సంచరించే ఆలయం, క్యూలైన్ల ప్రాంతాల్లో పాదరక్షలను భద్రపరిచే కేంద్రాలను సమర్థంగా వినియోగించుకునేలా ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని