logo

వైకాపా భక్తులు ఐదేళ్లూ కుయుక్తులు

కేసులు.. దాడులు.. ప్రతిపక్ష శ్రేణులు, ప్రశ్నించే వ్యక్తులను జైళ్లకు పంపడమే లక్ష్యంగా ఐదేళ్ల వైకాపా పాలన సాగింది. ఇందులో కొందరు అధికారులు కీలక భూమిక పోషించారు. ప్రధానంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలే శిరోధార్యం, చట్టమన్నట్లు వ్యవహరించారు.

Updated : 22 Jun 2024 06:10 IST

ఆ పార్టీ నాయకుల ఆదేశాలే శిరోధార్యమన్నట్లు వ్యవహారశైలి

కేసులు.. దాడులు.. ప్రతిపక్ష శ్రేణులు, ప్రశ్నించే వ్యక్తులను జైళ్లకు పంపడమే లక్ష్యంగా ఐదేళ్ల వైకాపా పాలన సాగింది. ఇందులో కొందరు అధికారులు కీలక భూమిక పోషించారు. ప్రధానంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలే శిరోధార్యం, చట్టమన్నట్లు వ్యవహరించారు. రోజురోజుకు వారి ప్రవర్తన వివాదాస్పదమవుతున్నా ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. విపక్ష నేతలు వీరి తీరును ఎండగట్టినా తాము గొప్ప ఘనత సాధించామన్నట్లుగా పెద్దిరెడ్డికి చెప్పుకొని ఆయన వద్ద మార్కులు కొట్టేసే యత్నం చేశారు. ఈ క్రమంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. చట్టబద్ధ పాలనకు తూట్లు పొడిచారు.

ఈనాడు, చిత్తూరు

పోలింగ్‌ కేంద్రాలనే మార్చేసిన రేణుక

వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత చిత్తూరు ఆర్డీవోగా రేణుకను నియమించారు. గతంలో వెదురుకుప్పం తహసీల్దారుగా పనిచేసినప్పుడు ప్రభుత్వ భూములను వెబ్‌ ల్యాండ్‌లో నమోదు చేయడంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై విచారించేందుకు గత ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. అటువంటి ఆమెకు రెవెన్యూ డివిజన్‌ అధికారిగా పోస్టింగ్‌ ఇవ్వడంపై తీవ్ర విమర్శలొచ్చాయి. పెద్దిరెడ్డి ప్రాపకంతోనే ఆర్డీవోగా నియమించారని రెవెన్యూ వర్గాల ఆరోపణ. వైకాపా నేతల భూ ఆక్రమణలపై ఆమె ఏమాత్రం స్పందించేవారు కాదు. పూతలపట్టు నియోజకవర్గంలోని 18 పోలింగ్‌ కేంద్రాలను ఇష్టారాజ్యంగా ఆమె మార్చారు. ఆ ప్రాంతాల్లో కేవలం వైకాపాకు బలం లేదనే ఉద్దేశంతోనే ఈవిధంగా చర్యలు తీసుకున్నారు. ఆమె మూలంగా ఓటర్లు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఎటువంటి సదుపాయాలు లేని రైతు భరోసా కేంద్రాలనూ పోలింగ్‌ బూత్‌లుగా మార్చిన ఘనత ఆమెకే దక్కింది. రేణుకకు ఉన్న రాజకీయ పలుకుబడి చూసి ఉన్నతాధికారులూ మిన్నకుండిపోయారు.

తెదేపా శ్రేణులంటేనే గిట్టని రాఘవరెడ్డి

గతేడాది ఆగస్టులో పుంగనూరు అర్బన్‌ సీఐగా రాఘవరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. వచ్చినప్పటి నుంచీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై స్వామిభక్తి చూపుతూనే ఉన్నారు. 2023 ఆగస్టు 4న పుంగనూరు మండలం భీమగానిపల్లె కూడలి వద్ద జరిగిన అల్లర్లను సాకుగా చూపి నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి చల్లా బాబుతోపాటు దాదాపు 70 మందిపై రౌడీషీట్‌ తెరవాలని డీఎస్పీకి ప్రతిపాదనలు పంపారు. తెదేపా శ్రేణుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకు అడుగడుగునా యత్నించారు. జనవరి 12న భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధినేత రామచంద్ర యాదవ్‌ పుంగనూరు మండలం చదళ్ల వద్ద తలపెట్టిన ధర్మపోరాట సభకు ఆటంకాలు కలిగించారు. ఆ పార్టీ శ్రేణులపై జులుం ప్రదర్శించారు. పెద్దిరెడ్డి స్వగ్రామం సదుం మండలం యర్రాతివారిపల్లెలో ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రచారానికి వెళ్లిన బీసీవైపీ కార్యకర్తలపై వైకాపా నాయకులు దాడి చేశారు. ఈ సమయంలో పది మంది బీసీవైపీ కార్యకర్తలను ఆసుపత్రికి తీసుకెళతానంటూ చెప్పి అరెస్టు చేసి మూడు రోజులు నిర్బంధించారు. అంతకుముందు ఫిబ్రవరిలో కార్యకర్తలకు ఇచ్చేందుకు అన్ని బిల్లులతో తెచ్చిన గోడ గడియారాలను సీఐ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకున్నారు. ఇల్లు అద్దెకు ఇచ్చిన వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.

పెద్దిరెడ్డికి భక్తుడిలా మారుతి

సదుం ఎస్సైగా పనిచేసిన మారుతి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భక్తుడిలా ఉండేవారనే ఆరోపణలున్నాయి. ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే, వైకాపా నాయకులు చెప్పింది తూచా తప్పకుండా పాటించేవారు. తెలుగుదేశం నాయకులు ఈ మండలంలో ప్రచారం చేయాలని చూస్తే సరైన భద్రత కూడా ఇచ్చేవారు కాదు. ఏప్రిల్‌ 29న సదుం మండలం యర్రాతివారిపల్లెలో బీసీవైపీ అధినేత రామచంద్ర యాదవ్‌ ప్రచారానికి వెళితే ఆయన్ను, ఆ పార్టీ కార్యకర్తలను వెంటాడి వైకాపా శ్రేణులు దాడి చేశాయి. సదుం స్టేషన్‌ ఎదుటే ప్రచార రథానికి నిప్పుపెట్టాయి. ఈ నేపథ్యంలో సరిగ్గా పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు ఆయనపై సస్పెన్షన్‌ వేటు పడింది.

ఒకవైపే.. మహేశ్వరరెడ్డి చూపు 

పలమనేరు డీఎస్పీగా ఈ ఏడాది ఫిబ్రవరిలో మహేశ్వరరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మే 7న ఎన్నికల సంఘం ఆయనపై వేటు వేసింది. డీఎస్పీగా వచ్చినప్పటి నుంచి కేవలం వైకాపా నాయకుల ఫిర్యాదులపైనే ఆయన స్పందించేవారు. ప్రతిపక్షాలు శాంతియుతంగా సభలు, సమావేశాలు నిర్వహించాలన్నా అనుమతులు ఇవ్వడంలో తాత్సారం చేశారు. పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దౌర్జన్యాలకు దిగినా పట్టించుకునేవారు కాదు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత కూడా ఏప్రిల్‌ 17న పుంగనూరులో హేమాద్రి అనే తెదేపా కార్యకర్తను వైకాపా నేత నాగభూషణం అనుచరులు కిడ్నాప్‌ చేసేందుకు యత్నించినా బాధ్యులపై డీఎస్పీ చర్యలు తీసుకోవాల్సి ఉన్నా స్పందించలేదు. అడుగడుగునా వైకాపా నేతలకు వత్తాసు పలికారు. చివరకు పెద్దిరెడ్డి సొంత ఊరు యర్రాతివారిపల్లెలో బీసీవైపీ కార్యకర్తలపై వైకాపా శ్రేణులు చేసిన దాడికి డీఎస్పీని బాధ్యుడిగా చేస్తూ ఎన్నికల సంఘం వేటు వేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని