logo

తీర్మానం పంచాయతీలో.. పనులు చిత్తూరు నగరంలో

జిల్లా పరిషత్తు నిధులు ఇతర పనులకు మళ్లించి దుర్వినియోగం చేసిన జడ్పీ పూర్వపు సీఈవో ప్రభాకరరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ..

Published : 23 Jun 2024 02:19 IST

పూర్వ సీఈవో అక్రమాలపై మరో ఫిర్యాదు

చిత్తూరు జడ్పీ, న్యూస్‌టుడే: జిల్లా పరిషత్తు నిధులు ఇతర పనులకు మళ్లించి దుర్వినియోగం చేసిన జడ్పీ పూర్వపు సీఈవో ప్రభాకరరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. తెదేపా నేత కాడ్ర రమేష్‌ నాయుడు శనివారం.. ప్రస్తుత సీఈవో గ్లోరియాకు ఫిర్యాదు చేశారు. ఏయే పనులకు జడ్పీ నిధులు మళ్లించారనే అంశాలను ఆ ఫిర్యాదులో ఆయన సమగ్రంగా పేర్కొన్నారు. చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప.. చిత్తూరు నగరంలో కార్యాలయ ఏర్పాటుకు అవసరమైన ఫర్నిచర్‌ తదితరాలకు జడ్పీ నిధులు లక్షలాది రూపాయలు వినియోగించారని, ఇది పూర్తిగా అధికార దుర్వినియోగమేనన్నారు. తిరుపతి జిల్లా పేరూరులోని వకుళామాత ఆలయానికి పలుమార్లు రూ.10 లక్షల చొప్పున, స్థానిక రెవెన్యూ, ఎన్జీవో హోం భవనాల మరమ్మతులకు, గ్రామాల్లో డ్రిల్‌ చేయాల్సిన తాగునీటి బోర్లను మామిడితోటలో వేసినట్లు చూపి  భారీగా దుర్వినియోగం చేశారని ఆరోపించారు. యాదమరి మండలంలో పనులు చేసేందుకు తీర్మానాలు చేసి అక్కడ చేపట్టకుండా ఏకంగా చిత్తూరు కార్పొరేషన్‌ పరిధిలో పనులు చేపట్టారని, తన అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారన్నారు. నాటి వైకాపా ప్రజాప్రతినిధుల అండతో ఇష్టానుసారంగా ఆయన చెలరేగి పోయి ప్రజాధనాన్ని వృథా చేశాడని ధ్వజమెత్తారు. సీఈవో ఛాంబర్‌ ఆధునికీకరణకు రూ.25 లక్షలు ఖర్చు చేశారన్నారు. నిధుల దుర్వినియోగంపై ఇప్పటికే పలు విచారణలు పూర్తయ్యాయని, తాజా అంశాలపైనా విచారణ చేపట్టి అతడిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని రమేష్‌నాయుడు.. సీఈవో గ్లోరియాకు విన్నవించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని