logo

తిరువణ్ణామలై వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదం

పౌర్ణమి గడియల్లో కొండ చుట్టూ తిరిగి ఆది దేవుడిని దర్శిస్తే మంచి జరుగుతుందని భావించిన ఆ కుటుంబాలలో విషాదం మిగిలింది.

Published : 23 Jun 2024 02:24 IST

ఇద్దరి మృతి.. నలుగురికి తీవ్ర గాయాలు

మునెమ్మ (పాత చిత్రం) 

తిరుపతి(నేరవిభాగం), న్యూస్‌టుడే: పౌర్ణమి గడియల్లో కొండ చుట్టూ తిరిగి ఆది దేవుడిని దర్శిస్తే మంచి జరుగుతుందని భావించిన ఆ కుటుంబాలలో విషాదం మిగిలింది. తిరువణ్ణామలై నుంచి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురైన నాలుగు కుటుంబాలలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. తిరుపతిలోని వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు ‘నెల నెలా పౌర్ణమికి తిరుమన్నామలైకు వెళతారే.. ఆఖరికి ఆ దేవుడి చెంతకే చేరారా’ని విలపించారు. తిరుపతి రెడ్డిగుంటకు చెందిన కె.గోపాల్, సతీమణి మునెమ్మ(27)కు ఇద్దరు కుమారులు. మునెమ్మ టిఫిన్‌ సెంటర్‌ నడుపుతుండగా.. గోపాల్‌ పెయింటింగ్‌ పనులకు వెళతారు. కుమారులు వికాస్, ధనుష్‌లను ప్రాథమిక పాఠశాలలో చదివిస్తున్నారు. ప్రతి పౌర్ణమికి తిరువన్నామలై ఆలయానికి వెళ్లి దర్శించుకుని వస్తుంటారు. అందులో భాగంగా అదే ప్రాంతానికి చెందిన నిర్మల, ఆమె కుమార్తె లలితతోపాటు సుబ్బారెడ్డి నగర్‌కు చెందిన సహచర పెయింటర్లు ఆదినారాయణ, రుషినాగ, కావిలి నాయుడు, జ్యోతి, జగన్‌(17)లు ఓ ట్యాక్సీ మాట్లాడుకుని వెళ్లారు. శుక్రవారం ఉదయం తిరుపతి నుంచి బయలుదేరి కాణిపాకం, గోల్డెన్‌ టెంపుల్‌ ఆలయాలు దర్శించుకుని తిరువణ్ణామలై చేరుకున్నారు. గిరి ప్రదక్షిణ చేసుకుని శనివారం తెల్లవారుజామున 5 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. డ్రైవర్‌ రియాజ్‌ నిద్రమత్తు కారణంగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అక్కడికక్కడే మునెమ్మ, జగన్‌ మృతి చెందారు. మిగిలిన నలుగురు తీవ్ర గాయాలకు గురై అక్కడే చికిత్స పొందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని