logo

కొత్త ప్రభుత్వంపైనే ప్ర‘జల’ ఆశలు

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందాన తయారైంది సాగునీటి రైతుల పరిస్థితి. వర్షాలకు జలాశయాలు నిండుకుండల్లా మారినా సాగు జలాలుగా వినియోగించుకోలేని దుర్భర పరిస్థితుల్లో ఆయకట్టు రైతులు ఆవేదనకు గురవుతున్నారు.

Updated : 23 Jun 2024 05:44 IST

జలవనరుల సద్వినియోగంతోనే రైతుల మోములో ఆనందం
ఆగిన ప్రాజెక్టులకు ప్రాధాన్యం కల్పిస్తే ప్రయోజనం

కాళంగి జలాశయానికి అనుసంధానంగా ఏర్పాటు చేసిన కుడి కాల్వ తూము వద్ద లీకేజీల నియంత్రణకు ఏర్పాటు చేసిన ఇసుక బస్తాలు (పాతచిత్రం)

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందాన తయారైంది సాగునీటి రైతుల పరిస్థితి. వర్షాలకు జలాశయాలు నిండుకుండల్లా మారినా సాగు జలాలుగా వినియోగించుకోలేని దుర్భర పరిస్థితుల్లో ఆయకట్టు రైతులు ఆవేదనకు గురవుతున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక జిల్లాలో జలాశయాల అభివృద్ధి కాగితాలకు పరిమితమైంది. ఆయకట్టు రైతులు ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి. అసంపూర్తి జలవనరుల ప్రాజెక్టులు పూర్తి చేసి నీటిని ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. తెదేపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రాజెక్టుల పనులు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. తొలి దశలో ఏయే ప్రాజెక్టులు ఎలా పూర్తి చేస్తే మేలు జరుగుతుందన్న దానిపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

న్యూస్‌టుడే, గూడూరు, శ్రీకాళహస్తి 

తెలుగుగంగ అనుసంధానంతో మేలు

జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులతో సుమారుగా 3.50 లక్షల ఎకరాలకు నీరందుతుండగా అన్ని పూర్తయితే మరో 2.19 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే అవకాశముంది. తెలుగుగంగ  కు జిల్లాలో 2.79 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనికి అనుబంధంగా ఉన్న చీలు కాలువలు- చెరువుల అనుసంధానం ఇంకా పూర్తి కాలేదు. 

సోమశిల-స్వర్ణముఖి లింకు కాలువ

దీని పరిధిలో జిల్లాలో 14 వేల ఎకరా ఆయకట్టు కాగా 97 వేల ఎకరాలు స్థిరీకరించాల్సి ఉంది. తాగునీటి అవసరాల కోసం 2.5 లక్షల మందికి 0.20 టీఎంసీల నీటిని వెంకటగిరికి, శ్రీకాళహస్తి, ఏర్పేడు మండలాలకు అందజేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుకు సుమారుగా రూ.325.24 కోట్లు నిధులు అవసరమని ప్రాథమికంగా గుర్తించారు. 

గాలేరు-నగరి

గాలేరు-నగరి సుజల స్రవంతితో జిల్లాలోని 95 వేల ఎకరాల సాగులోకి తీసుకురావాలన్నది లక్ష్యం కాగా ఐదేళ్లలో పనులు ముందుకు కదలని పరిస్థితి. ఈ ప్రాజెక్టు ద్వారా వడమాలపేట తదితర ప్రాంతాల్లో సాగునీటి అవసరాలు తీర్చే అవకాశం ఉంది. 

కాళంగి జలాశయం

ఈ జలాశయం నుంచి వచ్చే సాగునీటిని వినియోగించుకునేందుకు వీలుగా కుడి, ఎడమ కాల్వలు నిర్మించారు. కుడి కాలువ గుండా తొట్టంబేడు, బీఎన్‌కండ్రిగ మండలాలకు, ఎడమ కాలువ ద్వారా సాగునీరు అందుతోంది. తూముల వద్ద లీకేజీల నియంత్రణకు ఇసుక బస్తాలు వేయాలి. కుడి, ఎడమ కాల్వల గట్లు పూర్తిగా దెబ్బతినడం, ముళ్లకంపలు పెరిగిపోవడంతో సాగునీటి సరఫరాకు విఘాతం ఏర్పడుతోంది.

తిరువట్యం.. నిరుపయోగం:

వంద ఎంసీఎఫ్‌టీల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు ద్వారా 2 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ప్రాజెక్టుకు నాలుగు వైపులా కాలువలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. 

హంద్రీనీవా సుజల స్రవంతి-2 

చంద్రగిరి నియోజకవర్గంలోని 6,400 ఎకరాల ఆయకట్టుకు నీరందించే ప్రాజెక్టు ఇంకా పూర్తి చేయలేదు. 

మీడియం ఇరిగేషన్‌ ప్రాజెక్టుల్లో

నాలుగు ప్రాజెక్టుల్లో కాళంగి, మల్లెమడుగు, సిద్ధలగండి, స్వర్ణముఖి బ్యారేజి, స్వర్ణముఖి ఆనకట్ట సిస్టమ్‌ల నిర్వహణకు నిధులు ఇవ్వని పరిస్థితి ఉంది. ఆరణి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలి. దీని పరిధిలో 5,500 ఎకరాల ఆయకట్టు గుర్తించారు. ఏపీఎస్‌ఐడీసీ పరిధిలో 9 ప్రాజెక్టుల పనులు ఎక్కడికక్కడే ఉన్నాయి.

మైనర్‌ జలవనరుల పరిధిలో

100 ఎకరాల ఆయకట్టు పైబడిన చెరువులు 714 ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగు నీరందించే పరిస్థితి ఉంది. 100 ఎకరాల ఆయకట్టు కలిగిన 1657 చెరువుల ద్వారా 49 వేల ఎకరాలు నీరందిస్తున్నారు. వీటికి అనుసంధానంగా ఉండే పంట కాలువలకు నిర్వహణ ఐదేళ్ల గాలిలో దీపంలా మారాయి.

ఉబ్బలమడుగుదీ.. అదే పరిస్థితి

ఈ జలాశయంతో 2600 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశముంది. రైతులకు సాగునీరు అందించేందుకు అవసరమైన కాలువల ఏర్పాటు కాగితాలకే పరిమితమైంది.

ఆయకట్టు (ఎకరాల్లో) 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు