logo

గో పోరంబోకు ‘గుట్ట’కాయ స్వాహా..!

నియోజకవర్గంలో వైకాపా ముఖ్య నేతల ‘అధికారం’ అండదండలతో భూకబ్జాదారులు పేట్రేగిపోయారు. ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా ఆక్రమించేశారు.

Published : 23 Jun 2024 02:47 IST

వైకాపా నేతల అండతో 3.65 ఎకరాల పశువుల  మేత భూమి కబ్జా
స్థానికుల ఫిర్యాదుతో వెలుగులోకి

పశువుల మేత భూమిలో ఆక్రమణలు 

కుప్పం, న్యూస్‌టుడే: నియోజకవర్గంలో వైకాపా ముఖ్య నేతల ‘అధికారం’ అండదండలతో భూకబ్జాదారులు పేట్రేగిపోయారు. ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా ఆక్రమించేశారు. శాంతిపురం మండలంలో పశువుల మేత పొరంబోకు భూమిని ఆక్రమించుకున్న తతంగం తాజాగా వెలుగు చూసింది. స్థానిక నేతల అండతో సాగించిన భూఆక్రమణ బాగోతానికి సంబంధిత అధికారులు ఇతోధికంగా తోడ్పాటును అందించినట్లు తెలుస్తోంది.
కడపల్లె పంచాయతీ పరిధిలోని తిమ్మరాజుపల్లె సమీపంలో దాదాపు 3.65 ఎకరాల పశువుల మేత బీడు భూమిపై స్థానిక నేతల కన్ను పడింది. కొంత కాలంగా రాళ్లు, గుట్టలను చదును చేసి ఆక్రమించేశారు. మూడు రోడ్ల కూడలిలో రూ.లక్షల విలువైన భూమిని కాజేసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించగా.. ఇటీవల స్థానికులు గుర్తించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. రాతి బండలను తొలగించి నిర్మాణాలు చేపట్టడానికి రాళ్లు, కంకరను సిద్దం చేసిన విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

జగనన్న కాలనీ ముసుగులో.. ఇళ్ల స్థలాల విక్రయాలు..!

గత ప్రభుత్వం చేపట్టిన జగనన్న కాలనీ ఇళ్ల పథకం స్థానికంగా వైకాపా నేతలకు కాసులను కురిపించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పశువుల మేత బీడు భూమిలో ఇళ్ల స్థలాలను ఇచ్చేశారు. కొందరికి మాత్రమే అధికారికంగా పట్టాలను ఇచ్చారు. మిగతా వారికి నాయకులే స్థలాలను కేటాయించి అందినంత వసూలు చేశారు. ఒక్కో ఇంటి స్థలానికి రూ.40 వేల వరకు దండుకున్నట్లు చెబుతున్నారు. ఇలా పదుల సంఖ్యలో అక్రమంగా ఇళ్ల స్థలాలను కేటాయించినట్లు తెలుస్తోంది.

అక్రమాలను సీఎం దృష్టికి తీసుకెళతాం..

గో పోరంబోకు భూమి ఆక్రమణతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల స్థలాలను ఇచ్చిన విషయాన్ని రెవెన్యూ అధికారులతో పాటు తెదేపా నేతల దృష్టికి తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. కడపల్లె పంచాయతీ పరిధిలో భూ అక్రమాల విషయాన్ని ఈ నెల 25న కుప్పంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించి సామాజిక అవసరాలకు వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎంకు విన్నవిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని