logo

పురపాలిక కుళాయిల్లో కలుషిత జలాలు

వారంతా పేద గిరిజన విద్యార్థులు. చదువుతోనే తమ జీవితంలో వెలుగులు నిండుతాయని కోటి ఆశలతో గురుకుల పాఠశాలల్లో చేరారు.

Published : 24 Jun 2024 01:52 IST

గూడూరులో విద్యార్థుల అస్వస్థత

చెన్నూరులోని ఎస్టీ గురుకుల పాఠశాల

గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: వారంతా పేద గిరిజన విద్యార్థులు. చదువుతోనే తమ జీవితంలో వెలుగులు నిండుతాయని కోటి ఆశలతో గురుకుల పాఠశాలల్లో చేరారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఒకే కుటుంబంలా వసతి గృహాల్లో ఉంటూ చదువులు సాగిస్తున్నారు. అయితే గత ప్రభుత్వ తప్పిదాలు వారి పాలిట శాపంగా మారింది. గురుకుల పాఠశాలలో కనీస వసతులు మెరుగుపరచడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇప్పుడు అదే విద్యార్థుల పాలిట శాపంగా మారింది. కుళాయి నీరు తాగడంతో అస్వస్థతకు గురై, విరేచనాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురైయ్యారు. విద్యార్థులు క్షేమంగా ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థు భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిన ఘటన గూడూరు పురపాలక పరిధిలోని చెన్నూరు గిరిజన గురుకుల పాఠశాలలో శనివారం చోటు చేసుకుంది.

పురపాలక పైపులైను ద్వారా వచ్చే కుళాయి

గూడూరు పురపాలక సంఘం పరిధిలోని గిరిజన గురుకుల పాఠశాలలో 3 నుంచి 10వ తరగతి వరకు సుమారు 150మందిపైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. రోజులాగానే ఆర్వో ప్లాంట్‌ మరమ్మతులకు గురికావడంతో పక్కనే ఉన్న కుళాయి నీటిని తాగారు. దీంతో 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని హుటాహుటిన పట్టణంలోని ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో శనివారం రాత్రి మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. మరో ఆరుగురిని మెరుగైన చికిత్స కోసం ఆదివారం ఉదయం నెల్లూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. గత వైకాపా ప్రభుత్వ తప్పిదాల విద్యార్థుల శాపంగా మారిందని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. 15 రోజులకు ఒకసారి వాటర్‌ ట్యాంకుల్లో క్లోరినేషన్‌ చేయాల్సి ఉన్నా ఐదు సంవత్సరాలుగా ఎక్కడా క్లోరినేషన్‌ చేయకపోవడంతో విద్యార్థులతోపాటు ప్రజలు రోగాల బారినపడి, ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి పైపులైను కుళాయిలు మురుగునీటిలోనే వదిలేయడంతో పైపులైను లీకులు ద్వారా తాగునీరు కలుషితంగా మారి సరఫరా అవుతోంది. పురపాలక సంఘంలోని ప్రజలు ఆ నీటినే పట్టుకొని తాగాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుత ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ వహించి తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు.

పాఠశాలలోని ఆర్‌వో ప్లాంట్‌

విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదు

తాగునీరు తాగడంతో విద్యార్థులు అస్వస్థకు గురైయ్యారు. సరైన సమయంలో ఆసుపత్రికి తరలించడంతో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం లేదు. కొంత మందిని నెల్లూరు తరలించి మెరుగైన వైద్యసేవలు  

మదుసూదన్‌బాబు, ప్రిన్సిపల్, గురుకుల పాఠశాల, చెన్నూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని