logo

చిగురిస్తున్న ఆశలు..

క్రీడారంగంపై వైకాపా ప్రభుత్వ చిత్తశుద్ధి లేమికి మినీ స్టేడియం నిర్మాణం ఓ ఉదాహరణ.. క్రీడాకారుల సాధన కోసం 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వంలో చిత్తూరు నియోజకవర్గానికి మంజూరైన మినీ స్టేడియం పనుల్ని వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసింది..

Published : 24 Jun 2024 01:56 IST

మినీస్టేడియం నిర్మాణంపై చోద్యం
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం

మినీ స్టేడియం

  • క్రీడారంగానికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నాం.. గ్రామగ్రామాన క్రీడాకారులను తీర్చిదిద్దాలి.. ఇందుకు అవసరమైన స్టేడియాలు నిర్మించడమేకాక అవసరమైన వసతులు కల్పిస్తాం.. తదనుగుణంగా గ్రామాలు, వార్డుల పరిధిలో క్రీడా సంబరాలు నిర్వహిస్తున్నాం.. విజేతలు అందరికీ బహుమతులు అందించి ప్రోత్సహిస్తాం.. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అందుకే ఆడుదాం ఆంధ్ర తీసుకొచ్చాం.’    -ఇదీ గత సీఎం జగన్‌ పలుచోట్ల బహిరంగ సభల్లో చెప్పిన మాటలు.
  • క్రీడారంగాభివృద్ధి కోసం నిజంగా శ్రద్ధ వహించి ఉంటే.. తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మించ తలచిన మినీ స్టేడియాలను వైకాప ప్రభుత్వం పూర్తిచేసేది. కనీసం వాటివైపు కన్నెత్తి చూడనేలేదు. వాటిని పట్టించుకోకనే ఐదేళ్లూ పూర్తయ్యాయి. ఫలితంగా ఆయా స్టేడియంల నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది.

ఇదీ నేడు క్షేత్రస్థాయిలో నెలకొన్న దుస్థితి.

న్యూస్‌టుడే, చిత్తూరు(క్రీడలు): క్రీడారంగంపై వైకాపా ప్రభుత్వ చిత్తశుద్ధి లేమికి మినీ స్టేడియం నిర్మాణం ఓ ఉదాహరణ.. క్రీడాకారుల సాధన కోసం 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వంలో చిత్తూరు నియోజకవర్గానికి మంజూరైన మినీ స్టేడియం పనుల్ని వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసింది.. ఒక్క అడుగూ ముందుకు వేయనీకుండా ఐదేళ్ల పాలనా పూర్తిచేసుకుంది.. మళ్లీ ఇప్పుడు తెదేపా అధికారంలోకి రావడంతో మినీ స్టేడియం నిర్మాణంపై క్రీడాకారుల్లో కొత్తగా ఆశలు చిగురిస్తున్నాయి.. ఈ ప్రభుత్వంలో పనులు పూర్తిచేస్తే చిత్తూరు నగరం సహా పరిసర ప్రాంత క్రీడాకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని క్రీడా లోకం ఆకాంక్షిస్తోంది.

రూ.2.10 కోట్లు మంజూరు..

తెదేపా ప్రభుత్వ హయాంలో నియోజకవర్గానికో మినీ స్టేడియం మంజూరైంది. రూ.2.10 కోట్లతో స్టేడియాన్ని నిర్మించేలా నిధుల్ని కేటాయించారు. చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి సంతపేటలోని పీఎన్‌సీ నగరపాలకోన్నత పాఠశాల మైదానాన్ని ఎంపిక చేశారు. సదరు స్థలాన్ని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థకు అప్పగిస్తూ నివేదిక సమర్పించింది. వైకాపా ప్రభుత్వం వచ్చాక.. మొదట రీటెండరింగ్‌ అన్నారు. తర్వాత అప్పగించిన స్థలాన్ని రద్దు చేశారు. ఆ తర్వాత ఎక్కడా చడీచప్పుడు లేదు. ఇక అంతే. దాని గురించి కనీసం ఆలకించన నాథుడే కరవయ్యారు. ఫలితంగా ఈ క్రీడాకారుల అవస్థలు చెప్పనలవికావు. అందుబాటులో ఉన్న పాఠశాలలు, కళాశాలల్లోని మైదానాలనే వారు వినియోగించుకుంటున్నారు. అక్కడున్న అరకొర సౌకర్యాలతో నెట్టుకొస్తున్నారు.

మినీ స్టేడియంలో సౌకర్యాలిలా..

  • మినీ స్టేడియం కోసం 5 ఎకరాల స్థలం అవసరం.
  • ఈ స్టేడియంలో ఒక ఇండోర్‌ షటిల్‌ బ్యాడ్మింటన్‌ కోర్ట్, వ్యాయామశాల, డార్మిటరీ, వాకింగ్‌ ట్రాక్, కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్‌/వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటుచేస్తారు.
  • ఆటగాళ్లకు క్రీడా శిక్షణ అందిస్తారు.
  • మినీ స్టేడియం నిర్మాణం పూర్తయితే క్రీడాకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
  • స్థానికంగా ఉన్న యువతకు క్రీడా సౌకర్యాల్ని సద్వినియోగం చేసుకునే అవకాశం లభిస్తుంది.
  • మినీ స్టేడియం నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని