logo

ఇదే సత్యం

అది జాతీయ రహదారి ఆనుకుని ఉన్న ఎస్టీల భూమి. దానిపై కన్నుపడ్డ వైకాపా నేత ఏకంగా స్వాహా చేసేశారు. రూ.ఐదు కోట్ల భూమి కాజేసే ప్రయత్నం చేసిన ఆయన ఎట్టకేలకు దొరికిపోయారు.

Published : 24 Jun 2024 02:01 IST

రూ.5 కోట్ల ఎస్టీల భూమికి టెండర్‌
రికార్డులు తారుమారు చేయించిన కామిరెడ్డి
ఆపై పొర్లుకట్ట మట్టితో చదును చేయించిన వైనం

మట్టి తోలి చదును చేసిన భూమి ఇదే

అది జాతీయ రహదారి ఆనుకుని ఉన్న ఎస్టీల భూమి. దానిపై కన్నుపడ్డ వైకాపా నేత ఏకంగా స్వాహా చేసేశారు. రూ.ఐదు కోట్ల భూమి కాజేసే ప్రయత్నం చేసిన ఆయన ఎట్టకేలకు దొరికిపోయారు. అధికారంతో చలామణి చేసి ఏకంగా భూ రికార్డులు తారుమారు చేయించారు. ఇందుకు కొందరు అధికారులు సహకరించడంతో అంతా చకచకా పని కానిచ్చేశారు. దీనిని బేరం పెట్టి చదును చేయించడానికి ఏకంగా స్వర్ణముఖి పొర్లుకట్ట మట్టి తవ్వి తరలించారు. ఇలా అధికారులను మభ్యపెట్టిన ఆయన ప్రభుత్వ భూమిలో పాగా వేశారు. తాజాగా ఈ విషయాలు స.హ.చట్టంతో వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారాయి.

న్యూస్‌టుడే, పెళ్లకూరు  

వారసత్వంగా సంక్రమించినట్లు రాయించి

పెళ్లకూరు మండలం చిల్లకూరు రెవెన్యూ సర్వే నంబర్‌ 3లో 184.77 ఎకరాల మేత పోరంబోకు భూమి ఉంది. ఇందులోంచి వేరుచేసిన 248.4 సర్వే నంబర్‌లోని 1.29 ఎకరాలకుగాను పుల్లూరు పెదవెంకటయ్యకు 1985లో దరఖాస్తు పట్టా అందించారు. ఇతను ఏళ్లుగా వరిపంట పండించారు. ఈక్రమంలో సదరు భూమికి ఎసరుపెట్టిన మాజీ ఎన్‌డీసీసీబీ ఛైర్మన్‌ సత్యనారాయణరెడ్డి తన సమీప బంధువు వేణుగోపాల్‌రెడ్డి పేరుతో రికార్డుల్లో తారుమారు చేయించారు.

తిరుపతి వ్యాపారికి బేరం

ఎన్నికల వేళ దీనిని తిరుపతికి చెందిన ఓ స్థిరాస్తి వ్యాపారికి బేరం పెట్టారు. ఇక్కడ 800 అంకణాల భూమి కాగా అంకణం రూ.60 వేల లెక్కన అమ్మకం పెట్టారు. దీనిని చదును చేయించి మరింత ధరకు విక్రయించడానికి స్వర్ణముఖి కరకట్ట నుంచి మట్టి తరలించి సొమ్ము చేసుకున్నారు. స్థానికులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి నిరుపేదలకు పట్టాలివ్వాలని కోరుతున్నారు.

కట్ట మట్టి తవ్వేసిన ప్రాంతం

కేసు నమోదుకు సిద్ధం

పొర్లుకట్ట తవ్వి తరలించిన కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిపై కేసు పెట్టడానికి జలవనరుల శాఖ సిద్ధమవుతోంది. గతంలో ఇక్కడ బోర్డు పెట్టిన తర్వాత కూడా మట్టి తవ్వకాలు చేయడం, బెదిరింపులకు దిగడం తదనంతర పరిణామాలను వివరిస్తూ నివేదిక సిద్ధం చేసిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. దీనిపై తెదేపా నేతలు ఉన్నతాధికారులకు గతంలో ఫిర్యాదులు చేసిన పరిస్థితి కాగా తెదేపా అధికారంలోకి రావడంతో అధికారులు ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు. తవ్వకాలు లెక్కలేసి వాస్తవ పరిస్థితుల నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది.

స్థానికులను భయభ్రాంతులకు గురిచేసి

చిల్లకూరు వడ్డిపాళెం సమీపంలోని 10 ఏళ్ల కిందట నిర్మించిన స్వర్ణముఖి పొర్లుకట్ట మట్టిని తరలించి భూమిని చదును చేయించారు. అడ్డుకున్న స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. సీఎంవో పేరు వాడుకుని చెలరేగిపోయి రెండు కి.మీ కట్ట మాయం చేశారు. దీని విలువ రూ.25 లక్షలు ఉన్నట్లు అధికారుల అంచనా.

దీనిపై తహసీల్దార్‌ ప్రసాద్‌రావుని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా భూమి ఎస్టీలకు కేటాయించిందని తెలియజేశారు. ఉన్నతాధికారుల సూచనతో స్వాధీనం చేసుకుంటామని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని