logo

నాణ్యత డొల్ల.. రోడ్డు గుల్ల

రహదారి మరమ్మతులు నాణ్యంగా చేపడితే సుమారు ఏడాది పాటైనా ఉండాలి.. ఇక్కడేమో పనులు చేపట్టిన ఆర్నెల్లకే రోడ్డు మళ్లీ గుంతలమయంగా మారింది.. నాణ్యత లోపం కొట్టొచ్చినట్లు తేటతెల్లమవుతోంది..

Published : 24 Jun 2024 02:14 IST

రూ.లక్షలు రోడ్డు పాలు

పెనుమూరు-నేండ్రగుంట మార్గంలో ఏర్పడిన గుంత

పెనుమూరు, న్యూస్‌టుడే: రహదారి మరమ్మతులు నాణ్యంగా చేపడితే సుమారు ఏడాది పాటైనా ఉండాలి.. ఇక్కడేమో పనులు చేపట్టిన ఆర్నెల్లకే రోడ్డు మళ్లీ గుంతలమయంగా మారింది.. నాణ్యత లోపం కొట్టొచ్చినట్లు తేటతెల్లమవుతోంది.. ఎక్కడైతే మరమ్మతు చేశారో అదే స్థలంలో మళ్లీ గుంతలు ఏర్పడి రోడ్డు ప్రమాదకరంగా మారింది.. ఈ పరిస్థితి పెనుమూరు-నేండ్రగుంట మార్గంలో చోటుచేసుకుంది.

పెనుమూరు-నేండ్రగుంట మార్గం 11 కి.మీ. ఉంది. ఇందులో ఆరు కి.మీ.. అంటే పాకాల మండలం వడ్డేపల్లె ఉన్నత పాఠశాల వరకు చిత్తూరు ర.భ.శాఖ పరిధిలోకి వస్తుంది. దీని మరమ్మతులకు అధికారులు గతేడాది రూ.5 లక్షలతో పనులు ప్రారంభించారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు తొలగించారు. రహదారిలో గుంతలు ఉన్న చోట తారు, కంకర మిశ్రమంతో మరమ్మతులు చేపట్టారు. ఆయా పనులు చురుగ్గా సాగాయి. అయితే వడ్డేపల్లెలో గుంతలు పూడ్చకుండా అలానే వదిలేశారు. దీంతో ఈ మార్గం ఆ ప్రాంతంలో చాలావరకు అధ్వానంగా మారింది.

ప్రయాణికులకు శాపం..

రహదారి మరమ్మతుల్లో ప్రమాణాలు పాటించకపోవడం ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. ప్రస్తుతం కురుస్తున్న తేలికపాటి వర్షాలకే మరమ్మతులు దెబ్బతిన్నాయంటే పనుల్లో నాణ్యత ఏపాటిదో ఇట్టే అర్థం అవుతుంది. పనుల నిర్వహణ సమయంలో పర్యవేక్షణ లోపంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రయాణికులు విమర్శిస్తున్నారు.

మరమ్మతులు చేయిస్తాం

పెనుమూరు-నేండ్రగుంట మార్గంలో ఇటీవల మరమ్మతులు చేపట్టాం. ప్రస్తుతం వర్షాలకు గుంతలు ఏర్పడి ఉంటే పరిశీలిస్తాం. మళ్లీ మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపి నిధులు రాగానే పూర్తిస్థాయిలో మరమ్మతు చేయించి ఇబ్బంది లేకుండా చూస్తాం.

దస్తగిరి, డీఈఈ, ర.భ.శాఖ చిత్తూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని