logo

అవును.. అక్రమాల్లో.. ఆయన పాత్ర నిజమే

వైకాపా హయాంలో జిల్లా ప్రజాపరిషత్‌లో ఓ వెలుగు వెలిగిన పూర్వ సీఈవో ప్రభాకరరెడ్డి బాగోతాలు ఇటీవల జరిగిన విచారణలో ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి.

Published : 24 Jun 2024 02:19 IST

ఉద్యోగులను వేధించారన్న ఆరోపణలకూ బలం
జడ్పీ పూర్వ సీఈవో ప్రభాకరరెడ్డిపై కలెక్టర్‌ నివేదిక  

ప్రభాకరరెడ్డి  

ఈనాడు, చిత్తూరు- న్యూస్‌టుడే, చిత్తూరు గ్రామీణ జడ్పీ: వైకాపా హయాంలో జిల్లా ప్రజాపరిషత్‌లో ఓ వెలుగు వెలిగిన పూర్వ సీఈవో ప్రభాకరరెడ్డి బాగోతాలు ఇటీవల జరిగిన విచారణలో ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. అప్పటి మంత్రి పెద్దిరెడ్డి అడుగులకు మడుగులొత్తి పోస్టింగ్‌ పొందిన ఆయన స్వామిభక్తి చాటుకున్నారు. వైకాపా నేతలు ఏంచెప్పినా జీ హుజూర్‌ అన్నారు. తెలుగుదేశం నాయకుల ఆర్థిక మూలాలు దెబ్బతీసేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. న్యాయంగా రావాల్సిన బిల్లులు రాకుండా అడ్డుకున్నారు.

  • చిత్తూరు గ్రామీణ మండలం చెర్లోపల్లికి చెందిన తెదేపా నేత కాండ్ర రమేష్‌ నాయుడు ఆయన అవినీతి, అక్రమాలు, జడ్పీలో జరిగిన ఉల్లంఘనలపై చట్టబద్ధంగా పోరాటం చేస్తే పోలీసుల ద్వారానూ ఇబ్బందులు పెట్టించారు. జడ్పీ దరిదాపుల్లోకి ప్రతిపక్ష నాయకులు రాకుండా కట్టడి చేశారు. ఉద్యోగులు, సిబ్బందిని షోకాజ్‌లు, సస్పెన్షన్లతో భయపెట్టించారు.
  • ప్రభుత్వం మారిన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, జడ్పీ మాజీ ఛైర్మన్‌ గీర్వాణి చంద్రప్రకాష్, కాండ్ర రమేష్‌ నాయుడు తదితరులు.. జడ్పీలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారించాలని ప్రస్తుత జడ్పీ సీఈవో గ్లోరియా, కలెక్టర్‌ షన్మోహన్‌కు మరోసారి ఫిర్యాదు చేశారు. వీటన్నింటిపై సీఈవో గ్లోరియా సమగ్రంగా విచారించి పాలనాధికారికి నివేదిక ఇవ్వగా ఆయన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌కు ఇటీవల వివరాలు పంపారు. ఆరోపణల్లో వాస్తవాలున్నాయని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

టీ, బిస్కెట్లకే రూ.35.61 లక్షలు

జిల్లా ప్రజాపరిషత్‌లో సమావేశాలు నిర్వహించిన ప్రతిసారీ ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చుపెట్టారు. టీ, బిస్కెట్లు, నీళ్ల బాటిళ్లు, స్నాక్స్, డ్రైప్రూట్లకు ప్రతి సమావేశంలోనూ రూ.2 లక్షలకుపైగానే వెచ్చించారని వెల్లడైంది. ఈ ఏడాది జనవరి 23న జరిపిన సమావేశానికి ఏకంగా రూ.7,45,194 వ్యయమయిందని పేర్కొన్నారు. ఇలా ఏడు సమావేశాలకు ఏకంగా రూ.35.61 లక్షలయిందని బిల్లులు చేసుకున్నారు. జనరల్‌ ఫండ్‌ నుంచి ఇటువంటి ఖర్చులకు 15 శాతమే వినియోగించాల్సి ఉన్నా నిబంధనలు ఉల్లంఘించారని విచారణలో తేల్చారు.  

ప్రభాకరరెడ్డిపై విచారణ నివేదికలు, వాటి ఆధారాలు తీసుకుని సోమవారం కమిషనర్‌ కన్నబాబు ఎదుట హాజరయ్యేందుకు డిప్యూటీ సీఈవో ఆదిశేషారెడ్డి, ఇతర అధికారులు విజయవాడ వెళ్లారు. కమిషనర్‌ ఎదుట జడ్పీ సీఈవో హాజరు కావాలని ఉత్తర్వులున్నా సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన నేపథ్యంలో ఆమెకు బదులు..  డిప్యూటీ  సీఈవో వెళ్లారు.

ప్రత్యేక మరమ్మతులకు రూ.15 లక్షలు

పంచాయతీరాజ్‌ కమిషనర్‌కు కలెక్టర్‌ నివేదించిన వివరాలు ఇలా.. జడ్పీ క్వార్టర్‌- 1 ప్రత్యేక మరమ్మతులు అంటూ పూర్వపు సీఈవో ప్రభాకరరెడ్డి రూ.15 లక్షలు మంజూరు చేశారు. నామినేషన్‌ ప్రాతిపదికన పనులు కట్టబెట్టేందుకు ఈ నిధులను మూడు భాగాలుగా విభజించారు. 2022 సెప్టెంబరులో మరమ్మతులకు అనుమతులు ఇవ్వగా ఇప్పటివరకు పూర్తి కాలేదు. ఏడాదిన్నర దాటినా పనులు కొలిక్కి రాకపోవడం వెనుక ఆంతర్యమేంటో ప్రభాకరరెడ్డికే తెలియాలి. అప్పట్లోనే ఇందుకు సంబంధించి నిధులు మంజూరు చేయడం గమనార్హం. జడ్పీ కార్యాలయంలో రూ.4.65 లక్షలతో సీసీ కెమెరాలు బిగించేందుకు ఆమోదం తెలిపారు. ప్రభాకరరెడ్డికి సీసీగా పనిచేసిన ఎన్‌.సురేంద్రరెడ్డి చరవాణి ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించారని విచారణలో తేలింది. వీటి ఆధారంగా జడ్పీ సిబ్బందిని పలు రకాలుగా వేధించారని ప్రస్ఫుటమైంది.

ఇంక్రిమెంట్లు, సెలవులు ఇవ్వకుండా..

మరోవైపు ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు ఉదయం నుంచి సాయంత్రం వరకే విధులు నిర్వర్తించేవారు. జడ్పీ కార్యాలయంలోని కొందరు ఉద్యోగులు, సిబ్బందిని అర్ధరాత్రి వరకు ఉద్దేశపూర్వకంగా ఉంచి వేధించారు. ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా అవస్థలకు గురిచేశారు. సర్వీసు రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించలేదు. ఎటువంటి తప్పు చేయకున్నా కొందరిని సస్పెండ్‌ చేశారు. జీతాలు నిలిపేశారు. అత్యవసర సమయాల్లోనూ సెలవులు మంజూరు చేయని దుస్థితి జడ్పీలో కొనసాగింది. సత్యవేడు ఎంపీడీవోగా పనిచేసిన బాలగణేష్, గుడుపల్లె ఎంపీడీవోగా ఉన్న శ్రీనివాసన్‌కు పోస్టింగ్‌లు ఇవ్వకుండా ఇక్కట్లకు గురిచేశారు. ఈ మనోవేదనతోనే తదనంతర కాలంలో వారిద్దరూ మరణించారని నివేదికలో ప్రస్తావించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని