logo

నామరూపాల్లేని చిన్న నీటి వనరులు

జలవనరులను వైకాపా గద్దలు విధ్వంసం చేశాయి. మట్టి తవ్వకాలతో కొందరు రూ.కోట్లు గడించగా మరికొందరు ఆక్రమించి స్వాహా చేశారు.

Updated : 24 Jun 2024 06:06 IST

ఐదేళ్లూ వైకాపా నేతల విధ్వంసం
ముంపు సమస్యలు తోడు రైతులకు శాపం

కుప్పం చెరువులో కొనసాగుతున్న అక్రమ తవ్వకాలు

జలవనరులను వైకాపా గద్దలు విధ్వంసం చేశాయి. మట్టి తవ్వకాలతో కొందరు రూ.కోట్లు గడించగా మరికొందరు ఆక్రమించి స్వాహా చేశారు. వనరుల దోపిడీని అధికారులు కళ్లప్పగించి చూస్తూ ఉండిపోవడంతో చెరువులు చాలాచోట్ల కనమరుగైన దుస్థితి. ఉన్నచోట్ల భారీగా గుంతలు తీయడం.. విచ్చలవిడి మట్టి తవ్వకాలు వెరసి నీటిని నిల్వచేసి సరఫరా చేసే పరిస్థితుల్లో లేవు. వందల సంఖ్యలో ఉన్న ఆక్రమణలను జలవనరులు, రెవెన్యూ, సర్వేశాఖల ఉమ్మడి సర్వేలో నిర్ధారించి సంరక్షణ చర్యలు తక్షణమే చేపట్టాలని రైతన్నలు విన్నవిస్తున్నారు.

న్యూస్‌టుడే, కుప్పం, గూడూరు, చంద్రగిరి

పురపాలికల్లో రూపులేని వైనం

తిరుపతి నగరపాలిక చట్టుపక్కల పెద్దఎత్తున చెరువులు ఉండగా ఎక్కడా వర్షంనీరు చేరే పరిస్థితి లేదు. స్థిరాస్తి వ్యాపారులకు మేలుచేసేలా వర్షంనీరు చెరువులకు చేరకుండా మళ్లిస్తూ క్రమంగా పూడ్చివేస్తున్నారు. ఇక్కడి గొలుసుకట్టు విధానం ఎప్పుడో కనుమరుగైంది. కుప్పం పురపాలిక పరిధిలోని తోటపేట చెరువులో విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు చేసిన వైకాపా నేతలు దీనిని ఏకంగా ఆక్రమించేశారు. ఇక్కడ రూ.కోట్లలో విలువైన భూములు కాగా ఇక్కడ ఏర్పాటు చేసిన బోర్డు తొలగించేశారు. గూడూరు, నాయుడుపేట, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో ఇదేతీరు కొనసాగుతోంది. నాయుడుపేట పరిధిలోని చెరువుల్లో స్థిరాస్తి నిర్మాణాలు పెద్దఎత్తున సాగుతున్నాయి.

  • తిరుచానూరు- తిరుపతి మార్గంలోని శిల్పారామం సమీపంలోని తిరుచానూరు పెద్ద చెరువును తుడా ప్రైవేటు సంస్థకు కట్టబెట్టింది. తుడాకు చెందిన స్థలాన్ని కాకుండా ఏకంగా చెరువును కేటాయించారు. భారీ యంత్రాలు, టిప్పర్లతో చెరువును పూడ్చి వేయడంపై అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి.
  • తిరుపతి గ్రామీణ మండలం పరిధిలోని 24 చెరువులు జాడేలేని పరిస్థితి. మూలపల్లి చెరువు పరిధిలో ఆరు ఎకరాలు ఆక్రమణకు గురైంది. మైనర్‌ ఇరిగేషన్‌ చెరువులు పది ఉండగా వీటి పరిధిలో కొద్దికొద్దిగా ఆక్రమించేశారు. ఆయకట్టు 968 హెక్టార్లు కాగా ప్రస్తుతం ఎకరాలో పంట వేసే పరిస్థితి లేదు.
  • రాష్ట్రంలోనే అత్యధికంగా చెరువులున్న జిల్లాలో ఉమ్మడి చిత్తూరు ఒకటి. ఇక్కడ 6,886 చిన్న నీటిపారుదల వనరులుండగా ఆయకట్టు సుమారు 1,54,173.12 హెక్టార్లలో విస్తరించి ఉంది.
  • ఐదేళ్లూ మట్టి పూడికతీత పేరిట వాటిలో చొరబడ్డారు. అటు జాతీయ రహదారులు ఇటు పరిశ్రమల అవసరాల పేరిట విధ్వంసం చేస్తూ వచ్చిన వైకాపా నేతలు ఐదేళ్లలో రూ.కోట్లు వెనకేసుకున్నారు. అనుమతులు ఇచ్చిన అధికారులు వాటి పర్యవేక్షణ మరిచిపోయారు. ఏ మేరకు తవ్వకాలు చేశారన్న నిఘా పెట్టలేదు. వారిని అడిగే పరిస్థితి లేకపోవడంతో గోరంత అనుమతులతో పలుచోట్ల ఏకంగా చెరువు కట్టలూ తవ్వి తరలించేశారు.

కట్టపై కన్నేసి..

దుర్గసముద్రం పంచాయతీలో కట్టను చదును చేసిన దృశ్యం

తిరుపతి (గ్రామీణ) : తిరుపతి గ్రామీణ మండలం దుర్గసముద్రం పంచాయతీలో మంచినీళ్ల గుంట చెరువు సర్వే నం.60/1లో ఉంది. వర్షాలకు సమీప కొండల్లోని నీరు చేరేది. ప్రస్తుతం మూడెకరాలు మిగలగా దానిపైనా వైకాపా నాయకుడి కన్నుపడింది. ఎన్నికల సమయంలో కట్టను చదును చేసి సుమారు 200 అంకణాలు స్వాధీనం చేసుకోగా అందులోని తుమ్మ చెట్లను నరికి విక్రయించేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ అంకణం విలువ రూ.30 వేలు ఉండగా రూ.అరకోటి స్థలాన్ని కబ్జా చేశాడు.

కాలువ గట్లూ కొల్లగొట్టారు

పెళ్లకూరు మండలం తెలుగుగంగ ఏడో చీలు కాలువ వెంబడి రూ.కోట్ల విలువైన మట్టి తరలించి వైకాపా నేతలు సొమ్ము చేసుకున్నారు. ఈ కాలువ 15 కి.మీ విస్తరించి ఉండగా రోసనూరు తదితర ప్రాంతాల్లో కి.మీ. కొద్దీ తవ్వేశారు. ఇక్కడి స్థానికల అధికారులకూ పెద్దఎత్తున ముడుపులు అందినట్లు ఆరోపణలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని