logo

వైకాపా నేతల అండతో స్వాహాకార్యం

గత ప్రభుత్వ హయాంలో పెద్దల ఒత్తిడి మేరకు నాయుడుపేట పట్టణంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న రూ.2.50 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని వైకాపాకు చెందిన ఎన్‌ఆర్‌ఐ నేతకు తక్కువ ధరకు కట్టబెట్టేందుకు రెవెన్యూ అధికారులు సన్నాహాలు చేస్తుండగానే.. ఆయన ఆ స్థలాన్ని ఆక్రమించారు.

Updated : 11 Jul 2024 05:16 IST

రూ.2.50 కోట్ల ప్రభుత్వ స్థలం ఎన్‌ఆర్‌ఐ హస్తగతం
న్యూస్‌టుడే, నాయుడుపేట

జాతీయ రహదారి పక్కనే ఎన్‌ఆర్‌ఐకు కేటాయించిన ప్రభుత్వ స్థలం

గత ప్రభుత్వ హయాంలో పెద్దల ఒత్తిడి మేరకు నాయుడుపేట పట్టణంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న రూ.2.50 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని వైకాపాకు చెందిన ఎన్‌ఆర్‌ఐ నేతకు తక్కువ ధరకు కట్టబెట్టేందుకు రెవెన్యూ అధికారులు సన్నాహాలు చేస్తుండగానే.. ఆయన ఆ స్థలాన్ని ఆక్రమించారు.

నాయుడుపేట పట్టణానికి ఇరువైపులా జాతీయ రహదారులు ఏర్పడ్డాక ఇక్కడ భూములు, స్థలాల ధరలకు రెక్కలొచ్చాయి. అగ్రహారపేట సమీపంలో 71వ నంబరు జాతీయ రహదారి పక్కనే సర్వే నంబరు 65-7సీ1 ఎనిమిదిన్నర సెంట్ల ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది. దీనికి అవతల భాగాన వైకాపాకు చెందిన ఓ ఎన్‌ఆర్‌ఐ స్థలం ఉంది. ఆయన కన్ను ఖాళీ స్థలంపై పడింది. తన రాజకీయ పరపతి ఉపయోగించి వైకాపా ప్రభుత్వంలో శ్రీకాకుళానికి చెందిన ఓ మంత్రి ద్వారా ఖాళీగా ఉన్న స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్‌పై ఒత్తిడి తెచ్చారు. రెవెన్యూ అధికారులతో దస్త్రాలు కదిలించారు. గతంలో ఉన్న జేసీ రహదారి పక్కనే ఉన్న విలువైన భూమిని పరిశీలించాక ఇవ్వడానికి అంగీకారం తెలపకపోవడంతో తన బంధువైన నాటి తిరుపతి సమీపంలోని ఓ ఎమ్మెల్యేతో ఒత్తిడి తెచ్చి ఎనిమిదిన్నర సెంట్ల భూమికి రూ.కోటిగా విలువ నిర్ణయించారు. ఆ సొమ్ము చెల్లిస్తే భూమి ఇస్తామని అధికారులు స్పష్టం చేశారు. అంతకంటే కారుచౌకగా కొట్టేయడానికి నాటి జిల్లా ‘పెద్ద’ మంత్రితో వ్యూహం రచించారు. ఈలోగా ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో భూమి కేటాయింపు ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది.

ఒక్క రూపాయి చెల్లించకుండానే..

వైకాపా ఎన్‌ఆర్‌ఐ కన్ను పడిన ఆ భూమి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.2.50 కోట్లు ఉంటుందని అంచనా. భూమి కేటాయింపు వ్యవహారం పెండింగ్‌లో ఉండగానే ఎన్‌ఆర్‌ఐ భూమిని తన స్థలంలోకి కలుపుకొని మట్టితో చదును చేసి, చుట్టూ ప్రహరీ నిర్మించారు. చివరికి సొమ్ము చెల్లించకుండానే హస్తగతం చేసుకోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఉప తహసీల్దారు రాజేంద్రను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా నగదు చెల్లించకుంటే భూమి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని