logo

ఇదేమి దందా.. గోవిందా!

గత వైకాపా ప్రభుత్వంలో తితిదేలో దర్శన టికెట్ల విషయంలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఒకే చరవాణిని వినియోగించి భారీ మొత్తంలో వివిధ ఆర్జిత సేవా/ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు పొందుతున్నట్లు తితిదే ఈవో ఐటీ విభాగం సమీక్షల్లో శ్యామలరావు గుర్తించారు.

Updated : 11 Jul 2024 05:15 IST

శ్రీవారి దర్శన టికెట్లలో భారీ అక్రమాలు
తితిదే ఈవో సమీక్షల్లో గుర్తింపు
అడ్డుకట్ట వేయని ఐటీ విభాగం.. అరికట్టేందుకు చర్యలు

ఈనాడు-తిరుపతి: గత వైకాపా ప్రభుత్వంలో తితిదేలో దర్శన టికెట్ల విషయంలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఒకే చరవాణిని వినియోగించి భారీ మొత్తంలో వివిధ ఆర్జిత సేవా/ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు పొందుతున్నట్లు తితిదే ఈవో ఐటీ విభాగం సమీక్షల్లో శ్యామలరావు గుర్తించారు. గత ఏడాదిలో అత్యధికంగా ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు నమోదు చేసిన 100 మందిని పరిగణలోకి తీసుకున్నారు. ఒక వ్యక్తి ఏకంగా 43 సార్లు ఒకే చరవాణి ద్వారా నమోదు చేశాడు. చివరి వ్యక్తి(100వ వ్యక్తి) 34 సార్లు నమోదు చేసుకున్నట్లు తేలింది. వీటిని దళారులు ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఆన్‌లైన్‌ విధానంలో తొలి వంద జాబితాను పరిశీలిస్తే.. ఒక చరవాణి ద్వారా 807 సార్లు గదులను బుక్‌ చేసుకున్నారు. చివరి వ్యక్తి(100వ వ్యక్తి) 28 సార్లు తీసుకున్నారు. ఒకే ఈ-మెయిల్‌ ఐడీ ద్వారా అత్యధికంగా నమోదు చేసుకున్న వంద మందిని పరిశీలిస్తే ఎక్కువగా 926 సార్లు గదులు తీసుకున్నారు. ఆన్‌లైన్‌లో అత్యధికంగా ఒకరు 1279 సార్లు ఆర్జిత సేవా టికెట్లు బుక్‌ చేసుకున్నాడు. వంద మందిలో చివరి వ్యక్తి 86 సార్లు చేశాడు. కొందరికి లబ్ధి చేకూర్చేందుకే అధికారులు వీటిని చూసీచూడనట్లు వ్యవహరించారు. వీటిపై విచారణకు ప్రస్తుత అధికారులు సిద్ధమవుతున్నారు.

ఫేషియల్‌ రికగ్నిషన్‌ ఏర్పాటుకు సన్నద్ధత

ఒక వ్యక్తి పేరుతో ఆన్‌లైన్‌లో టికెట్లు నమోదు చేసుకుంటూ ఉంటే మరో వ్యక్తి అదే టికెటు తీసుకుని దర్శనానికి వస్తున్నట్లు గుర్తించారు. దీన్ని అరికట్టేందుకు ఫేషియల్‌ రికగ్నిషన్‌ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఆధార్‌ సర్వీసుల అనుసంధానం కోరుతూ సంబంధిత శాఖకు ఈవో లేఖ రాయగా వారు సానుకూలంగా స్పందించారు. మరోవైపు తిరుపతిలో స్లాటెడ్‌ సర్వదర్శనం టికెట్లు తీసుకుని కొందరు దళారులు ఇతరులకు కట్టబెడుతున్న విషయమై కూడా ప్రత్యేక దృష్టిసారించారు.

ఏఐను వినియోగించుకునే ఆలోచన

ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ను సమర్థంగా వినియోగించుకునేందుకు తితిదే ఈవో ఆలోచన చేస్తున్నారు. ఆర్టిఫీషియల్‌ ఎనేబుల్డ్‌ కెమెరాల ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. వీటి ద్వారా ఎవరి టికెట్‌పై ఎవరు వచ్చారని గుర్తించేందుకు ఆస్కారం ఉంటుంది. రానున్న రోజుల్లో దర్శన టికెట్ల విషయంలో అక్రమాలను పూర్తిస్థాయిలో నిరోధించవచ్చని భావిస్తున్నారు.

సీఎం చెప్పినట్లు ప్రక్షాళనకు శ్రీకారం

తితిదేను ప్రక్షాళన చేసి సామాన్య భక్తులకు మెరుగైన దర్శన, వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన దానికి అనుగుణంగా ప్రస్తుత అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. తితిదే ఈవో శ్యామలరావు ఇప్పటికే తగిన మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా అక్రమాలకు అడ్డుకట్ట వేసి, ఐటీ విభాగం బలోపేతానికి తొలుత చర్యలు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని