logo

సహకార రుణాలకు.. సాదాబైనామా మెలిక

సహకార సంఘాల్లో అయినవారికి రుణాలు ఇస్తూ.. కానివారిని దూరం పెడుతున్న దుస్థితి నెలకొంది. త్రిసభ్య కమిటీల పేరుతో వైకాపా నేతలు కొంతమందికే రుణాలు కట్టబెట్టారు. అనవసరమైన కొర్రీలు పెడుతూ అర్హులకు దీర్ఘకాలిక రుణాలు దూరం చేశారు.

Updated : 11 Jul 2024 05:11 IST

అయిన వారికి మంజూరు.. కాదంటే తిరస్కరణ
త్రిసభ్య కమిటీల పేరుతో ఇష్టారాజ్యం
ఇదీ ఎన్‌డీసీసీబీ ఎల్‌టీ రుణాల పంపిణీ తీరు
న్యూస్‌టుడే, గూడూరు, కోట, వెంకటగి
రి

సహకార సంఘాల్లో అయినవారికి రుణాలు ఇస్తూ.. కానివారిని దూరం పెడుతున్న దుస్థితి నెలకొంది. త్రిసభ్య కమిటీల పేరుతో వైకాపా నేతలు కొంతమందికే రుణాలు కట్టబెట్టారు. అనవసరమైన కొర్రీలు పెడుతూ అర్హులకు దీర్ఘకాలిక రుణాలు దూరం చేశారు. ఇందులోనూ తమవారికి అర్హతలు పక్కన పెట్టి ఇతరులకు దూరం చేసిన తీరు కళ్లకు కడుతోంది. వైకాపా ప్రభుత్వంలో 2022లో జీవో 661 ద్వారా 2021 అక్టోబర్‌కు ముందువరకు అగ్రిమెంట్లకు హక్కులు కల్పించారు. వీటిద్వారా సంక్రమించిన పట్టాదారు పుస్తకాలకు రుణాల కొర్రీలు పెడుతున్నారు.

జిల్లాలో 60 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. వీటి పరిధిలో ఏటా రూ.354.22 కోట్ల రుణాలు అందజేస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన సాదాబైనామా దస్త్రాలకు పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులకు రుణాలు ఇవ్వడానికి కొర్రీలు పెడుతున్నారు. కాదంటే ఉన్నతాధికారులకు లేఖలు రాస్తామని వాస్తవాలు దాచి కాళ్లరిగేలా తిప్పుతున్నారు. ఈ వ్యవహారం ఎక్కువగా నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో జరిగింది. ఐదేళ్లలో అయినవారికే పెద్దపీట వేయడం.. వారి రుణాలు రికవరీ కాకున్నా నోటీసులు, కోర్టులకు తీసుకెళ్లడంలో జాప్యం చేస్తున్నారు.

తహసీల్దార్‌ ఇచ్చిన ధ్రువ పత్రం

మామూళ్లు ముందే చెల్లించాలి

ఇక్కడ రుణం తీసుకోవడానికి ముందే మామూళ్లు చెల్లించాల్సి వస్తోందన్నది రైతుల ఆవేదన. వాస్తవానికి రుణంలో 12 శాతం ఇక్కడే షేర్‌ క్యాపిటల్‌ కింద వసూలు చేస్తారు. ఇదేక్రమంలో మామూళ్ల లెక్కలేసి చెబుతున్నారు. వీటిల్లో పాలకులతోపాటు అధికారుల లెక్కలుంటున్నాయి. ఇలా మరో 5 శాతం దీని కింద ఇవ్వాల్సి వస్తోంది. ఇలా తీసుకునే క్రమంలో చాకచక్యం ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలు ఎక్కువగా గూడూరు, సూళ్లూరుపేట రెవెన్యూ డివిజన్లలో జరిగాయి.

పునబాకకి చెందిన రైతు పట్టాదారు పుస్తకం

రుణ వసూలుకు కోర్టుకెక్కడానికి జాప్యం

అయినవారికి రుణాలు ఇచ్చిన సోసైటీలు మొండిబాకీల విషయంలో మెత్తగా వ్యవహరించారు. ఇలా బాకీల వసూల కోసం భూములపై కోర్టులను ఆశ్రయించాల్సి ఉన్నా పట్టించుకోని దుస్థితి ఉంది. ఇలా ఐదేళ్లలో మొండిబాకీలు పెరిగిపోయాయి. ఇదే క్రమంలో నకిలీ రుణాల వసూలు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన పరిస్థితి ఉంది. గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల్లో రూ.150 కోట్ల మేర ఏటా రుణాలు ఇస్తున్న పరిస్థితి కాగా ఇక్కడే పేరుకున్న బకాయిలు ఉన్నాయి. కొన్నిచోట్ల నకిలీ రుణాలు బయట పడినా వారి జోలికి వెళ్లని పరిస్థితులు వెలుగుచూశాయి. అయినా త్రీమెన్‌ కమిటీలు పట్టించుకోలేదు.


సాదాబైనామాలకు ఇవ్వడంలేదు

దీర్ఘకాలిక రుణాలు ఇవ్వడానికి సాదాబైనామాలకు వీలు లేదు. వీటికి బ్యాంకుల్లో తాకట్టుకు కుదరడం లేదు. దీనిపై ప్రభుత్వానికి లేఖ రాసి అనుమతి తీసుకుంటాం.

దయాకర్‌రెడ్డి, డీజీఎం, ఎన్‌డీసీసీబీ


ఒకే రకమైన పట్టాదారు పాసుపుస్తకం.. దక్కని రుణభాగ్యం

పెళ్లకూరు మండలం చిల్లకూరు సహకార సంఘంలో సాదాబైనామా పట్టాదారు పాసుపుస్తకం కలిగిన ఓ వ్యక్తికి రూ.8 లక్షల రుణం ఇచ్చారు. ఇదే మండలం పునబాక గ్రామానికి చెందిన రైతు శివకి రుణం ఇవ్వడానికి అనేక వంకలు పెడుతున్నారు. ఇదే మండలంలో వందల సంఖ్యలో వైకాపా అనుయాయులకు రుణాలు ఇచ్చినా.. అర్హత ఉండీ ఇతర పార్టీల వారికి ఇవ్వని పరిస్థితులున్నాయి. ఈ క్రమంలో అర్హులైన అనేక మంది రైతులు పెట్టుబడికి       సొమ్ములేక అల్లాడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని