logo

కడాకు పూర్వ వైభవం..!

శాంతిపురం, న్యూస్‌టుడే: కుప్పం ప్రాంత అభివృద్ధి సంస్థ (కడా) ప్రాజెక్టుకు పూర్వ వైభవం రానుంది. సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టించి, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ, సమీక్షలకు వేదికగా ప్రాజెక్టు పునర్‌ ప్రారంభానికి ప్రభుత్వం నిర్ణయించింది.

Updated : 11 Jul 2024 05:14 IST

ప్రాజెక్టు డైరెక్టర్, సిబ్బంది నియామకం
సీఎం ఆదేశాలతో వేగంగా కదలికలు

శాంతిపురంలోని పూర్వ కడా కార్యాలయ భవనం

శాంతిపురం, న్యూస్‌టుడే: కుప్పం ప్రాంత అభివృద్ధి సంస్థ (కడా) ప్రాజెక్టుకు పూర్వ వైభవం రానుంది. సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టించి, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ, సమీక్షలకు వేదికగా ప్రాజెక్టు పునర్‌ ప్రారంభానికి ప్రభుత్వం నిర్ణయించింది. తదనుగుణంగా ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి.

పీడీగా ఐఏఎస్‌ అధికారి

నెల్లూరు మున్సిపల్‌ కమిషనర్‌గా ఇది వరకు విధులు నిర్వర్తించిన వికాస్‌ మర్మట్‌ను కడా ప్రాజెక్టు డైరెక్టర్‌గా ప్రభుత్వ నియమించింది. 2019వ బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి ఆయన. పీడీగా త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే పనులు సాగనున్నాయని అధికారులు చెబుతున్నారు.

అభివృద్ధి, సంక్షేమం అమలులో కీలకం

కుప్పం పురపాలికతో పాటు కుప్పం, శాంతిపురం, గుడుపల్లె, రామకుప్పం మండలాల్లో ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వేగవంతంలో ‘కడా’ కీలకంగా మారనుంది. ప్రజా సమస్యల పరిష్కారానికి వారధిగా నిలవనుంది. అభివృద్ధి ప్రణాళిక రూపకల్ప, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, ఆర్‌అండ్‌బీ, నీటి పారుదల, విద్యుత్తు, గ్రామీణాభివృద్ధి, డ్వామా, అటవీ, విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యానం, పశుసంవర్ధక, హౌసింగ్, నిత్యావసరాలు, ఐసీడీఎస్‌ తదితర శాఖల తోపాటు అన్ని సంక్షేమ విభాగాల్లో కార్యక్రమాల అమలు, అధికారుల విధులు, బాధ్యతలపైౖ పర్యవేక్షణ, సమీక్షల అధికారాన్ని పీడీకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అభీష్టం మేరకు పునర్‌ ప్రారంభం కానున్న కుప్పం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో పరుగులు తీయడం ఖాయమని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మొదటగా 1995లో ఏర్పాటు

కుప్పం సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 1995లోనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. అప్పట్లో డీఆర్‌డీఏ పీడీ, సబ్‌ కలెక్టర్‌ స్థాయి అధికారులను ప్రాజెక్టు అధికారులుగా (పీఓ) కొనసాగారు. 2004 వరకు కొనసాగిన కడను కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసింది. చంద్రబాబు మూడో దఫా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తర్వాత  2014లో మళ్లీ పునరుద్ధరించారు. ఐదేళ్ల పాటు ప్రాజెక్టు అధికారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమాన్ని అమలు చేశారు. వైకాపా హయాంలో ఆ ప్రాజెక్టుకు అటకెక్కించారు. 

కార్యాలయానికి 19 మంది సిబ్బంది

కుప్పం పట్టణంలో ఏర్పాటు కానున్న కార్యాలయంలో పీడీతోపాటు 19 మంది అధికారులు, సిబ్బంది ఉండనున్నారు. అదనపు పీడీ (డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి), తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, ఇద్దరు సీనియర్‌ సహాయకులు, ఇద్దరు జూనియర్‌ సహాయకులు డిప్యుటేషన్‌పై నియమితులు కానున్నారు. ఈ ప్రక్రియ కలెక్టర్, కడా డైరెక్టర్‌ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. ఇద్దరు డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఇద్దరు పీఎంయూ సిబ్బంది, నలుగురు అటెండర్లు, ఇద్దరు కాపలాదారులు, ఇద్దరు డ్రైవర్లను పొరుగు సేవల విధానంతో ప్రభుత్వం నియమించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని