logo

పెద్దిరెడ్డీ.. పరిహారం ఎప్పుడిస్తారు?

గత ఐదేళ్లలో జిల్లాపైనే కాదు.. రాయలసీమ వ్యాప్తంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెత్తనం చెలాయించారు. జగన్‌ ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ ఆయన మాటకు ఎదురే లేదు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గాన్ని అక్రమాలు, అరాచకాలకు కేంద్ర బిందువుగా మార్చుకున్నారు.

Updated : 11 Jul 2024 05:11 IST

మాజీ మంత్రికి నేతిగుట్లపల్లి
రిజర్వాయర్‌ నిర్వాసితుల ప్రశ్న
రైతుల భూములు లాక్కుని కూలీలుగా మార్చిన వైనం

ఈనాడు, చిత్తూరు: గత ఐదేళ్లలో జిల్లాపైనే కాదు.. రాయలసీమ వ్యాప్తంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెత్తనం చెలాయించారు. జగన్‌ ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ ఆయన మాటకు ఎదురే లేదు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గాన్ని అక్రమాలు, అరాచకాలకు కేంద్ర బిందువుగా మార్చుకున్నారు. ఆయన కుటుంబానికి చెందిన పీఎల్‌ఆర్‌ ప్రాజెక్ట్స్‌ సంస్థ ప్రయోజనాలే పరమావధిగా ఆయన పాలన సాగించారు. అందులో భాగంగానే పుంగనూరు మండలం నేతిగుట్లపల్లిలో రిజర్వాయర్‌ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతులు సాధించారు. దాదాపు 80 శాతం పనులు చేసినా ఇప్పటికీ ఒక్క రైతుకూ పరిహారం అందించలేదంటే పెద్దిరెడ్డి ఎంత నిరంకుశంగా వ్యవహరించారో ఇట్టే అర్థమవుతోంది. నిర్వాసితులు మరోసారి వైకాపాకు ఓటేస్తేనే పరిహారం ఇస్తామని ఎన్నికల సమయంలో ఆ పార్టీ నాయకులు హామీ ఇచ్చారు. తాము ఓట్లు వేసి ఆయనను గెలిపించామని.. డబ్బులు ఎప్పుడిప్పిస్తారని శాసనసభ్యుడిని బాధితులు ప్రశ్నిస్తున్నారు.

పుంగనూరు మండలం నేతిగుట్లపల్లిలో ఒక టీఎంసీ సామర్థ్యంతో రూ.717.80 కోట్లతో బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి 2020 సెప్టెంబరు 2న వైకాపా ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. ఉప గుత్తేదారుగా మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి చెందిన పీఎల్‌ఆర్‌ ప్రాజెక్ట్స్‌ సంస్థ వ్యవహరించింది. చిన్న చెరువుగా ఉన్న ప్రాంతంలో జలాశయం కట్టేందుకు పనులు ప్రారంభించింది. నిర్మాణం మొదలుకాక ముందే ఎన్ని గ్రామాలు, ఇళ్లు, ఎంత భూమి ముంపునకు గురవుతుంది? అనే వివరాలు తెలుసుకునేందుకు సర్వే చేయాలి. ఇళ్లు కోల్పోయే నిర్వాసితులకు పునరావాసం ఎక్కడ కల్పిస్తారో స్పష్టంగా తెలియజేయాలి. ఇవేవీ చేయకుండానే గ్రామస్థులను బెదిరించి, దౌర్జన్యానికి దిగి సింహభాగం పనులు చేశారు.


871 ఎకరాలు పోతున్నా పట్టని ‘పెద్దాయన’

నేతిగుట్లపల్లి రిజర్వాయర్‌ (పాతచిత్రం) జిల్లాలోని వైకాపా నేతలు మాజీ మంత్రి పెద్దిరెడ్డిని ‘పెద్దాయన’గా పిలుస్తుంటారు. సొంత నియోజకవర్గంలోని రైతులనే ముంచేసి రూపాయి పరిహారం ఇవ్వని ఆయన్ను ఎలా పెద్దమనిషిగా సంబోధిస్తారని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. రిజర్వాయర్‌ నిర్మాణంలో నేతిగుట్లపల్లి, దిగువ చింతవారిపల్లి, ఆవులవారిపల్లి, అరంట్లపల్లి, కమ్మవారిపల్లిలో 871 ఎకరాల వ్యవసాయ భూమి, 39 నివాసాలు ముంపునకు గురవుతున్నాయి. స్థానికులు ఎప్పుడైనా వైకాపా నేతలను పరిహారం గురించి గట్టిగా ప్రశ్నిస్తే ఈరోజు, రేపంటూ సమాధానం దాటవేస్తూ వచ్చారు. ఇలా దాదాపు మూడున్నరేళ్లు గడిపేశారు.


పోలింగ్‌ కేంద్రాల్లోని సీసీ కెమెరాలతో చూస్తున్నారంటూ..

సార్వత్రిక ఎన్నికల్లో ముంపు బాధితులు వైకాపాకు ఓటు వేయరని స్థానిక నాయకులు అంచనాకు వచ్చారు. ఈ క్రమంలో బెదిరింపులకు దిగారు. పెద్దిరెడ్డికి ఓటు వేస్తే ఎన్నికల తర్వాత పరిహారం అందుతుందని చెప్పారు. పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయని.. ఎవరెవరు ఓటు వేశారు? వేయలేదో ఆయన చూస్తారని ప్రచారంలో పేర్కొన్నారు. ఫలితంగానే ఈ గ్రామాలన్నింటిలో కలిపి మాజీ మంత్రికి దాదాపు వెయ్యి ఓట్ల ఆధిక్యం వచ్చింది. తాము ఓటు వేసి మాట నిలబెట్టుకున్నామని.. ఇప్పుడు ఆయన పరిహారం ఇప్పించి హామీ నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తున్నారు.


ఓటు వేయాలని బెదిరించారు

మా అన్నదమ్ములు ముగ్గురికి 12 ఎకరాల పొలం ఉంది. అందులో 19 బోర్లు వేశాం. చివరికి 1,100- 1,300 అడుగుల లోతులో నాలుగు బోర్లు పడ్డాయి. మామిడి, కొబ్బరి చెట్లు ఉన్నాయి. పంట చేతికి అందే సమయంలో ప్రాజెక్టు కట్టేందుకు భూములివ్వాలని వైకాపా నాయకులు దౌర్జన్యం చేశారు. బోర్లు, పెట్టుబడులకు కలిపి రూ.40 లక్షల అప్పు చేశాం. ఇప్పుడు మాకు సెంటు భూమి కూడా లేదు. ఇంటిపైన  రూ.2 లక్షలు రుణం తీసుకున్నాం. అది చెల్లించలేని పరిస్థితి రావడంతో ఫైనాన్స్‌ సంస్థ ప్రతినిధులు తాళం వేసేందుకు వచ్చారు. కూలీనాలీ చేసుకుని బిడ్డలను పోషించుకుంటున్నాం. ఎన్నికల్లో పెద్దిరెడ్డికే ఓటు వేయాలని వైకాపా నేతలు బెదిరించారు. పరిహారం అందకుంటే మాకు ఆత్మహత్యే శరణ్యం. ఎమ్మెల్యే స్పందించి రైతులకు న్యాయం చేయాలి.

బాలకృష్ణ, నేతిగుట్లపల్లి  


బెంగళూరు వలస పోతున్నాం

నేతిగుట్లపల్లిలో నాకు, మా తమ్ముడికి కలిపి పది ఎకరాల భూమి ఉంది. రిజర్వాయర్‌ కట్ట నిర్మించేందుకు మా భూమి లాక్కున్నారు. ఇప్పటివరకు ఒక్క రూపాయి పరిహారం ఇవ్వలేదు. బతుకుదెరువు కోసం ఇప్పుడు అన్నదాతలంతా బెంగళూరు వలస వెళ్తున్నాం. రిజర్వాయర్‌ నిర్మించేటప్పుడు అభ్యంతరం చెప్పేందుకు వస్తే మమ్మల్ని అడ్డుకున్నారు. పెద్దిరెడ్డి స్వార్థ ప్రయోజనాల కోసమే జలాశయం పనులు చేపట్టారు.

వెంకటరమణ, నిర్వాసిత రైతు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని