logo

Tirupati: పోలీసుల ‘అధికార పక్ష’పాతం.. ప్రతిపక్ష నాయకులే లక్ష్యంగా బైండోవర్లు

ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల అనంతరం ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం కన్నెర్ర చేసింది.

Published : 01 Jun 2024 07:24 IST

 వైకాపా నేతలను విస్మరిస్తున్న పోలీసు శాఖ
ఈనాడు-తిరుపతి, న్యూస్‌టుడే బృందం

ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల అనంతరం ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం కన్నెర్ర చేసింది. పోలీసు అధికారులతోపాటు కలెక్టర్లపై చర్యలు తీసుకుంది. కౌంటింగ్‌ సందర్భంగా ఘర్షణలు జరిగే అవకాశం ఉండటంతో పలు పార్టీ నేతలను బైండోవర్‌ చేస్తున్నారు. ఇక్కడా పోలీసు అధికారులు వైకాపా నేతలకు అంటకాగుతూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. తెదేపాతోపాటు ప్రతిపక్ష పార్టీల వారిని బైండోవర్‌ చేస్తున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. పెద్ద కేసుల్లో నిందితులైన వారిని సైతం పోలీసు అధికారులు వదిలిపెట్టి ప్రతిపక్ష పార్టీల వారిని బైండోవర్‌ పేరుతో స్టేషన్‌కు పిలిపించి, తహసీల్దార్‌ ఎదుట హాజరు పరుస్తున్నారు.

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి పోలీసులు జిల్లా వ్యాప్తంగా 621 మందిని బైండోవర్‌ చేశారు. తాజాగా 57 మందిపై రౌడీషీటు తెరిచినట్లు స్పష్టం చేస్తున్నారు. ఇది కేవలం కంటితుడుపు చర్యేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి పరిశీలిస్తే వైకాపా నేతలు బరితెగిస్తున్నారు.

చంద్రగిరిలో వరుస ఘటనలు

నామినేషన్‌ దాఖలు సమయంలోనే ఏకంగా తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్దనే వైకాపా మూకలు తెదేపా శ్రేణులపై రాళ్లదాడికి పాల్పడ్డారు. ఎన్నికల రోజు సైతం బ్రాహ్మణకాల్వలో పోలింగ్‌ కేంద్రం వద్ద చంద్రగిరి వైకాపా అభ్యర్థి మోహిత్‌రెడ్డి తెదేపా ఏజెంట్లపై విరుచుకుపడ్డారు. ఎన్నిక పూర్తయిన రోజు రాత్రి రామిరెడ్డిపల్లె, కూచువారిపల్లెల్లోని పల్లెలపై పడి కర్రలతో దాడులకు తెగబడ్డారు. ఆ తర్వాత ఇటు స్ట్రాంగ్‌ రూం వద్ద చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపైన హత్యాయత్నానికి ప్రయత్నించారు. అక్కడ కూచివారిపల్లె, రామిరెడ్డిపల్లెలో పెద్ద సంఖ్యలో వైకాపా శ్రేణులు కర్రలు పట్టుకుని దాడులు చేసి బీభత్సం సృష్టించారు. అటువంటి పరిస్థితుల్లో జిల్లా వ్యాప్తంగా కేవలం 57 మందిపైనే రౌడీషీట్లు తెరిచి పోలీసులు చేతులు దులుపుకొన్నారన్న విమర్శలున్నాయి. దాడులకు తెగబడిన వారిని గుర్తించి వారందరిపైనా రౌడీషీట్లు తెరవాల్సి ఉంది.

కీలక వైకాపా నేతలను తప్పించి..

ఎన్నికల ప్రక్రియ పూర్తయే వరకు(లెక్కింపు) వారిని జిల్లా పరిధిలో లేకుండా శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. వీటిని విస్మరించి కేవలం వైకాపా నేతలు చెప్పినట్లుగా వారి పార్టీకి చెందిన కొందరిపై కేసులు పెట్టించి, ముఖ్యమైన వ్యక్తుల పేర్లు లేకుండా చేశారన్న ఆరోపణలున్నాయి. వీరి పేర్లను పక్కన పెట్టించడం ద్వారా ఓట్ల లెక్కింపు రోజున ఆయా వ్యక్తులతో అల్లర్లు సృష్టించే ప్రమాదం ఉందన్న ఆరోపణలున్నాయి.

 నాయుడుపేట, గూడూరు పోలీసు సబ్‌ డివిజన్‌ పరిధిలో ఇలాంటి బైండోవర్‌ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ విషయంలో స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. భూవివాదాలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీ వారు పోలీసు ఠాణాకు వస్తే బైండోవర్‌ కింద చూపిస్తున్నారు.

మందలించినా మార్పు లేక..

నాయుడుపేట పోలీసు సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఇద్దరు ఎస్సైలు వైకాపా నేతలకు అంటకాగుతూ ప్రతిపక్ష పార్టీల వారిని బైండోవర్‌ చేస్తున్నారు. దీంతోపాటు ముందస్తుగానే అధికారపార్టీ నేతలకు సమాచారం సైతం చేరవేస్తున్నారు. వారి కనుసన్నల్లోనే ఆయన విధులు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీనిపై సంబంధిత ఎన్నికల అధికారులు సైతం ఆయన్ను సుతిమెత్తగా మందలించినట్లు సమాచారం. అయినా పనితీరులో మార్పు రాలేదు. ఈ విషయయాన్ని ఎస్పీ దృష్టికి కూడా అధికారులు తీసుకుపోయినట్లు తెలిసింది.

గూడూరు పోలీసు సబ్‌ డివిజన్‌ పరిధిలోని చిల్లకూరు మండలంలో తెదేపా సానుభూతిపరులపై బైండోవర్‌ కేసులు నమోదు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇదే తరహాలోనే గూడూరు మండలం, వెంకటగిరి తదితర పోలీసు స్టేషన్ల పరిధిలోనూ బైండోవర్‌ పేరుతో కేసులు నమోదు చేస్తున్నారు. ఇందులో అమాయకులు సైతం బలవుతున్నారు. వైకాపా నేతలు దర్జాగా బయట తిరుగుతుంటే.. అమాయకులైన ప్రతిపక్ష పార్టీ వారు మాత్రం బైండోవర్‌ పేరుతో పోలీసు ఠాణాలు, తహసీల్దార్‌ కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారు.

పదేళ్లను పరిశీలిస్తే..

గత పదేళ్ల చరిత్ర తీసుకుంటే వైకాపాకు చెందిన నేతలు అనేకమంది పోలింగ్‌కు ముందు ఆ తర్వాత పెద్ద ఎత్తున దౌర్జన్యాలకు పాల్పడిన సందర్భాలున్నాయి. అయితే తాము అందరినీ సమానంగా చూస్తున్నామని ప్రజలను నమ్మించేందుకు పోలీసులు ఇరు పార్టీల నేతలపై సమానంగా బైండోవర్, రౌడీషీట్లు తెరుస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఇది కేవలం అధికార పార్టీకి లాభం చేకూర్చేలా ఉందన్న విమర్శలున్నాయి. ఇప్పటికైనా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని బైండోవర్‌తోపాటు రౌడీషీట్లను తెరవడం ద్వారా ప్రజల్లో పోలీసులపై విశ్వాసం కల్పించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు