logo

TTD: తిరుమల ప్రక్షాళనకు వేళాయె..!

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో పలు సమస్యలు తిష్ఠవేశాయి. దర్శనానికి దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తుండగా గత ప్రభుత్వ హయాంలో సమస్యలు పరిష్కారం కాకపోగా మరింత సంక్లిష్టంగా మారినట్లు ఆరోపణలున్నాయి.

Updated : 16 Jun 2024 10:49 IST

గత ప్రభుత్వ విధానాలు సమీక్షించడం..
సామాన్య భక్తులకు ప్రాధాన్యమివ్వడం కీలకం
న్యూస్‌టుడే, తిరుమల

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో పలు సమస్యలు తిష్ఠవేశాయి. దర్శనానికి దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తుండగా గత ప్రభుత్వ హయాంలో సమస్యలు పరిష్కారం కాకపోగా మరింత సంక్లిష్టంగా మారినట్లు ఆరోపణలున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రకటించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టే ఉన్నతాధికారులు ఆదిశగా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.

బ్రేక్‌ దర్శనంలో పాతవిధానం మేలు

శ్రీవారి బ్రేక్‌ దర్శన సమయం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు మార్పు చేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వసతిపై ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నా పరోక్షంగా సామాన్య భక్తులకు కష్టాలు తప్పడం లేదు. దీంతో శ్రీవారి దర్శనం కోసం వారాంతంలో 24 గంటలకు పైగా వేచి చూడాల్సి వస్తోంది. బ్రేక్‌ ఉదయం ఎనిమిదింటికి మొదలై శ్రీవాణి, వీఐపీ బ్రేక్, దాతలు, ఉద్యోగులు, రెఫరల్‌ బ్రేక్‌తో మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతోంది. సాధారణ భక్తులు తెల్లవారుజామున 4 నుంచి 8 గంటల్లోపు సర్వదర్శనానికి వెళ్లలేకపోతే వారు 16 గంటలకు పైగా వేచిఉండాల్సి వస్తోంది. దీంతో ఉదయం తొమ్మిదికల్లా సర్వదర్శనం ప్రారంభమైనా భక్తుల ఇబ్బందులు తొలగుతాయి.

వసతి మెరుగుపరిస్తేనే మన్నన

తిరుమలలో కేవలం 7,400 అతిథిగృహాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిద్వారా కొద్దిమందికి మాత్రమే వసతి లభిస్తోంది. మరోవైపు యాత్రికుల వసతి సముదాయం ద్వారా మరికొందరికి అవకాశం లభిస్తోంది. కొత్తగా నిర్మిస్తున్న పీఏసీ-5ను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావడంతో మరో పదివేల మందికి వసతి లభిస్తుంది. గోవిందరాజ సత్రాల నిర్మాణంపై సమీక్షించడంతోపాటు పాతవైన సుదర్శనం, కల్యాణీ వంటి వాటి స్థానంలో నూతన భవనాలను నిర్మిస్తే భక్తులకు సులువుగా వసతి లభిస్తుంది. అతిథిగృహాల విరాళ పథకం ద్వారా ఇప్పటికే 15కు పైగా అతిథిగృహాలు వీఐపీ భక్తుల కోసం నిర్మిస్తున్న తితిదే అదే తరహాలో సామాన్య భక్తుల కోసం వసతి గదులను పెంచి కరెంట్‌ బుకింగ్‌ అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.

నడకమార్గంలో దివ్యదర్శనం టోకెన్లు

శ్రీవారి ధర్మదర్శనం కోసం అలిపిరి, శ్రీవారి మెట్టుమార్గంలో గతంలోలాగా టోకెన్లు ఇవ్వాలి. ప్రస్తుతం అలిపిరి మార్గంలో వచ్చే భక్తులు భూదేవి కాంప్లెక్స్‌లోనే టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందాల్సి వస్తోంది. కొంతమంది టోకెన్లు తీసుకుని బస్సులు, వాహనాల్లో తిరుమలకు నేరుగా చేరుకుంటున్నారు. నడిచివచ్చే భక్తులకు చాలావరకు టోకెన్లు అందుబాటులో ఉండటం లేదు. గతంలోలాగా నడక మార్గంలో టోకెన్లు జారీచేస్తే నడిచి వచ్చే భక్తుల ఇబ్బందులు తొలగుతాయి.   

అన్నప్రసాదం, లడ్డూల నాణ్యతపై..

కొన్నేళ్లుగా అన్నప్రసాదం నాణ్యత, రుచిపై భక్తులు పలుమార్లు ఆందోళన చేసినా ఇంకా లోపభూయిష్టంగా ఉంటోంది. లడ్డూప్రసాదాల తయారీకి వాడే ముడిపదార్థాల్లో నెయ్యిని గతంలో కర్ణాటకకు చెందిన నందిని డెయిరీ సంస్థ అందించేది. ప్రస్తుతం ఇతరులకు కేటాయించారు. ఈ పరిస్థితుల్లో నాణ్యతకు పెద్దపీట వేసేలా అధికారులు చొరవ తీసుకోవాల్సి ఉంది. తితిదే మార్కెటింగ్‌ శాఖను, తిరుమలలో ల్యాబ్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయాలి.

వేధిస్తున్న పార్కింగ్‌ ప్రదేశాల కొరత

తిరుమలకు రోజూ ఏడు నుంచి ఎనిమిదివేల ప్రైవేటు వాహనాలు, 1200 ఆర్టీసీ బస్సులు, ఇతర ద్విచక్రవాహనాలు భారీగా వస్తుంటాయి. రద్దీ రోజురోజుకూ పెరిగిపోతూ పార్కింగ్‌ ప్రదేశాల కొరత తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. దీంతో తిరుమల వ్యాప్తంగా రోడ్లపైనే భక్తులు వాహనాలను నిలిపి  దర్శనానికి వెళ్తున్నారు. తిరుమలలో పీఏసీ-5 ప్రదేశంలో మల్టీ లెవెల్‌ పార్కింగ్‌ ఏర్పాటుచేస్తామని గతంలోని తితిదే అధికారులు ప్రతిపాదనలు చేసినా అవి బుట్టదాఖలయ్యాయి.

పారిశుద్ధ్యం మెరుగుదలకు..

శ్రీవారి దర్శనార్థం ప్రతిరోజూ 70వేల నుంచి లక్ష మంది వస్తుంటారు. ఈ నేపథ్యంలో తిరుమలలో పారిశుద్ధ్యం కీలకం. ఆర్టీసీ బస్టాండ్‌లు, నడకదారులు, రద్దీ అధికంగా ఉండే ప్రదేశాల్లో మరుగుదొడ్ల నిర్వహణ మెరుగుపరచాల్సి ఉంది. పారిశుద్ధ్య సిబ్బందితోపాటు సంబంధిత మెటీరియల్స్‌ను పెద్దయెత్తున వినియోగించాల్సి ఉంది. అతిథిగృహాల్లోని గదులను సకాలంలో శుభ్రం చేసేలా చూడటంతోపాటు పర్యవేక్షించాల్సి ఉంది.

పప్పుధాన్యాల వినియోగంతో..

శ్రీవారికి నైవేద్యం అందించేందుకు ప్రకృతి వ్యవసాయంతో పండించిన బియ్యం, పప్పుధాన్యాలను తితిదే దిట్టం కొలతల్లో వినియోగిస్తోంది. వీటిని తితిదేకు  కొంతమంది దాతలు విరాళంగా అందిస్తున్నారు. ప్రతిరోజూ శ్రీవారి నైవేద్యం, ప్రసాదాల తయారీకి 700 కిలోల బియ్యం అవసరమవుతోంది. అయితే ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన 300 కిలోల బియ్యాన్నే దిట్టంగా వాడుతున్నారు. వీటి ఖరీదు ఎక్కువ ఉండటం తోడు ఎంత కొలతలో వేస్తే అంతే వస్తుండటంతో శ్రీవారి నైవేద్య ప్రసాదం కొద్ది సమయంలోనే ఖాళీ అవుతోంది. అనంతరం చిన్న లడ్డూలను శ్రీవారి భక్తులకు ఇస్తున్నారు. సాధారణ బియ్యం, పప్పుదినుసులను అవసరమైన మేరకు అదనంగా వినియోగించుకునే వెసులుబాటుు కల్పించాలని భక్తులు సూచిస్తున్నారు.

నిరంతరం అన్నప్రసాదాలు అందించేలా..

సామాన్య భక్తులకు విరివిగా అన్నప్రసాదాలను అందించడంలో గత ప్రభుత్వంలోని అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1, 2, నారాయణగిరి షెడ్లు, బయటకు వచ్చిన క్యూలైన్‌లోని భక్తులకు నియమిత సమయంలో మాత్రమే అందించారు. గంటల తరబడి క్యూలైన్‌లో ఉన్న భక్తులు ఆందోళనలు చేసిన ఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సర్వదర్శనం భక్తులకు, ఇతర భక్తులకు నిరంతరాయంగా క్యూకాంప్లెక్స్‌లు, నారాయణగిరిషెడ్లు, క్యూలైన్‌లో అన్నప్రసాదాలను అందించేలా చొరవతీసుకోవాలి. సర్వదర్శనానికి వచ్చే భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలి.

భద్రత కట్టుదిట్టం చేయాలి

భక్తుల రక్షణ, శ్రీవారి ఆలయ భద్రతకు పోలీసుశాఖతో పాటు తితిదే విజిలెన్స్‌ శాఖలు పనిచేస్తున్నాయి. గతంలో శ్రీవారి ఆలయంపై డ్రోన్లు ఎగురవేయడం, సెల్‌ఫోన్లు తీసుకెళ్లడం, గంజాయి, మద్యం సీసాలు తీసుకురావడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. భద్రతపై డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా గతంలో క్షేత్రస్థాయి పరిశీలన జరిపి ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు. వాటి అమలు.. యాంటీ డ్రోన్‌ టెక్నాలజీ వినియోగం, సీసీ కెమెరాల నిఘాకేంద్రం ఆధునికీకరణ, ఎన్‌ఎస్‌సీ క్విక్‌ రెస్పాన్స్‌ బృందాల ఏర్పాటు, అలిపిరిలోని తితిదే తనిఖీ కేంద్రంలో అత్యాధునిక స్కానర్ల వినియోగంపై దృష్టి సారించాల్సి ఉంది.

ఇష్టారాజ్యంగా సిబ్బంది నియామకాలు

వైకాపా ప్రభుత్వ హయాంలో కొండపై తమ పెత్తనం కొనసాగేలా పెద్దఎత్తున తాత్కాలిక సిబ్బందిని స్థానిక ప్రజాప్రతినిధులు నియమించుకున్నట్లు ఆరోపణలున్నాయి. మ్యాన్‌పవర్‌ కంపెనీల నుంచి సిబ్బందిని వందల సంఖ్యలో నియమించుకోవడం తోడు డిప్యూటేషన్లపై ఇక్కడ పాగా వేసి పాలనను భ్రష్టుపంటించిన నేపథ్యంలో వీటిపై సమీక్షించాల్సిన అవసరం ఉంది.


కిలోమీటర్ల దూరం ఉంది

శ్రీవారి సర్వదర్శనానికి శ్రీవారి మెట్టుమార్గంలో వచ్చా. మధ్యలో టోకెన్లు లేకపోవడంతో సర్వదర్శనం వెళ్లమన్నారు. తిరుమల నుంచి రింగ్‌రోడ్డు మీదుగా అక్టోపస్‌ భవనం వరకు నడిచి క్యూలైన్‌లోకి వెళ్లాల్సి వచ్చింది. కొండపైకి వచ్చాక కి.మీ. దూరం నడిపించకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలి.

విజయ్, బెంగళూరు


వినతులు పరిశీలించాలి

తితిదే అధికారులు సర్వదర్శన భక్తుల వినతులు పరిశీలించి పరిష్కారం చూపాలి. శ్రీవారి సర్వదర్శనానికి వచ్చిన భక్తులు రింగ్‌రోడ్డులోని అటవీప్రాంతం గుండా చిన్నపిల్లలతో కలిసి భయం భయంగా నడవాల్సి వచ్చింది. రాత్రి సమయంలో అటవీప్రాంతం నుంచి వచ్చే జంతువులు, విషసర్పాల బారినపడితే భక్తుల పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు.

లింగేశ్వర్‌రెడ్డి, కర్నూలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని