logo

YSRCP: స్వతంత్రుల ముసుగులో వైకాపా ఏజెంట్లు.. సజ్జల వ్యాఖ్యల నేపథ్యంలో విస్తృత చర్చ

ఎన్నికల రోజున అల్లర్లు సృష్టించిన వైకాపా నాయకులు.. ఓట్ల లెక్కింపు రోజూ ఇదే పంథా ఎంచుకుంటారనే అనుమానాలను ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి..

Updated : 03 Jun 2024 08:45 IST

స్వతంత్రులు, చిన్నపార్టీల అండతో ప్రవేశానికి వ్యూహం

సజ్జల వ్యాఖ్యల వెనక మర్మమిదేనా?

‘రూల్‌ కాదేమో అని వెనక్కి తగ్గేవారు కౌంటింగ్‌ ఏజెంట్లుగా వద్దు.. మన టార్గెట్‌ ఇదీ అని దృష్టిలో పెట్టుకుని దానికి అవసరమైనవి తెలుసుకోవాలి. మనవి ఒక్క ఓటు కూడా చెల్లనివిగా చేసే పరిస్థితి రాకుండా అడ్డుకునేందుకు ఏంచేయాలో చూసుకోవాలి. రూల్‌ అలా ఉంది కాబట్టి ఆప్రకారం పోదాం అని కూర్చోవద్దు. మనకు అనుకూలంగా అవతలి వాళ్ల ఆటలు సాగకుండా రూల్‌ ఎలా చూసుకోవాలి? ఎంతవరకు ఫైట్‌ చేయాలనేది నేర్చుకుందాం. కౌంటింగ్‌ ఏజెంట్‌ తనవంతు పాత్ర పోషించేలా వారి మెదడులోకి మీరు బాగా ఎక్కించాలి’.

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

న్యూస్‌టుడే, చిత్తూరు కలెక్టరేట్‌: ఎన్నికల రోజున అల్లర్లు సృష్టించిన వైకాపా నాయకులు.. ఓట్ల లెక్కింపు రోజూ ఇదే పంథా ఎంచుకుంటారనే అనుమానాలను ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి.. ఇటీవల సజ్జల చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతమిస్తున్నాయి.. లెక్కింపు కేంద్రాల్లో, బయట గొడవలకు ఆస్కారం ఉందన్న వాదన వినిపిస్తుండటంతో ఎన్నికల అధికారులు అప్రమత్తమయ్యారు.. 30 పోలీసు చట్టం, 144 సెక్షన్లు అమల్లోకి తేవడంతోపాటు.. ప్రత్యేక బలగాలనూ మోహరించారు. లెక్కింపు కేంద్రాల్లో చిన్నపాటి గొడవకు దిగినా బయటకు పంపేస్తామని ఉపేక్షించేది లేదని మాత్రం ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.

అనుమతి ఎందరికి..

మంగళవారం చిత్తూరు లోక్‌సభ, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ చిత్తూరులోని ఎస్వీసెట్‌ ప్రాంగణంలో జరగనుంది. పుంగనూరు, నగరి నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఎస్వీసెట్‌ ప్రాంగణంలోనే ఉన్న ఆర్‌కేఎం లా కళాశాలలో జరగనుంది. జీడీనెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఎస్వీ సెట్‌లో జరగనుంది.

  • సార్వత్రిక బరిలో ఉన్న ప్రతి అభ్యర్థి టేబుల్‌కు ఒకరి చొప్పున కౌంటింగ్‌ ఏజెంట్లను నియమించుకోవచ్చు. వీరికి అదనంగా ఆర్‌వో టేబుల్‌ దగ్గర ఉండేందుకు ఒక ఏజెంట్‌ను, పోస్టల్‌ బ్యాలెట్ల వద్ద పరిశీలనకు ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకోవాలి.
  • ఈవీఎం ఓట్ల లెక్కింపునకు ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటుచేస్తున్నారు. ఏడు నియోజకవర్గాలకు లెక్కిస్తే ఒక్క పార్టీకే 98 మంది ఏజెంట్లు అవసరం. పోస్టల్‌ బ్యాలెట్‌.. చిత్తూరు లోక్‌సభకు 18 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గానికి మూడు టేబుళ్లు ఏర్పాటుచేస్తున్నారు. ఇలా పరిశీలిస్తే నియోజకవర్గానికి 200 మంది చొప్పున తీసుకున్నా 1,400 మంది ఏజెంట్లు దాటొచ్చనేది అంచనా.

బలగం పెంచుకోవడానికేనా..?

కౌంటింగ్‌ కేంద్రాల్లోకి చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల తరఫున ఏజెంట్లుగా తమ నాయకులను పంపి సంఖ్యాబలం, బలగం పెంచుకునేలా వైకాపా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. కేంద్రాలకు అనుమతులతో వస్తున్న ఏజెంట్లపై ఆరాతీయాల్సింది యంత్రాంగమే. కౌంటింగ్‌ కేంద్రాల లోపల ప్రశాంతతకు ఏమాత్రం భంగం కలిగించడానికి యత్నించినా.. గొడవలకు దిగినా చర్యలు కఠినంగా ఉంటాయని ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి, ఎస్పీ హెచ్చరించారు. గొడవలు చేసే వారి విషయంలో నిర్ణయం తీసుకునే అధికారి రిటర్నింగ్‌ అధికారికి ఉందని చెబుతున్నారు.

నేర చరితులకు అనుమతిస్తారా?

పార్టీల ఏజెంట్లు ఎన్నికల కమిషన్‌ నియమావళికి బద్దులై ఉండాలని సూచించారు. 2024 సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులోనూ నేర చరితులను ఏజెంట్లుగా తిరస్కరిస్తారా? లేదంటే సడలింపు ఇచ్చి అనుమతిస్తారా? అనే చర్చ సాగుతోంది. నేరచరిత్ర ఉన్నవారిని కౌంటింగ్‌ ఏజెంట్లుగా అనుమతించరాదన్న సూచనలు ఓవైపు వినిపిస్తుంటే.. నేరచరిత్ర ఉన్న అభ్యర్థులే పోటీ చేస్తున్నప్పుడు ఆకోవకు చెందిన వారిని ఎలా ఆపగలమనే వాదన మరోవైపు వినిపిస్తోంది.. కౌంటింగ్‌కు పకడ్బందీగా ఏర్పాట్లకు చర్యలు చేపట్టిన యంత్రాంగం.. ఏజెంట్ల నియామకంలో ఎలా స్పందిస్తారో.. అన్నది ఇప్పుడు ప్రశ్న.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు