logo

East Godavari: కి.మీ. పరిగెత్తి.. అమ్మ ప్రాణాలు కాపాడుకుని..

అపస్మారక స్థితిలో ఉన్న తల్లిని చూసి ఆ కుమార్తె తల్లడిల్లిపోయింది. చెల్లితో పాటు కి.మీ.దూరంలోని పోలీసుస్టేషన్‌కు వెళ్లి తమ తల్లిని కాపాడాలని వేడుకుంది.

Updated : 23 Jun 2024 08:53 IST

ఇందు

గోపాలపురం, న్యూస్‌టుడే: అపస్మారక స్థితిలో ఉన్న తల్లిని చూసి ఆ కుమార్తె తల్లడిల్లిపోయింది. చెల్లితో పాటు కి.మీ.దూరంలోని పోలీసుస్టేషన్‌కు వెళ్లి తమ తల్లిని కాపాడాలని వేడుకుంది. వెంటనే పోలీసులు అప్రమత్తం అవ్వడంతో ఆ మహిళ ప్రాణాలు నిలబడ్డాయి. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని వేళ్లచింతలగూడెం గ్రామానికి చెందిన దానయ్య, లక్ష్మి భార్యాభర్తలు. కూలి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఇందు (8వ తరగతి), లాస్య (5వ తరగతి). భార్యాభర్తల మధ్య కుటుంబ కుటుంబ తగాదాలు ఉన్నాయి. శనివారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఇందు ఇంటికి వచ్చేసరికి తల్లి చీమలమందు తాగి, అపస్మారక స్థితిలో ఉంది. వెంటనే ఇందు.. ఇంటి పక్కన బడిలో చదువుతున్న చెల్లి లాస్య దగ్గరకు వెళ్లింది. ఆమెను వెంట పెట్టుకుని సుమారు కి.మీ.దూరంలో ఉన్న పోలీసుస్టేషన్‌కు పరిగెట్టుకుని వెళ్లారు. అమ్మా, నాన్న గొడవపడ్డారని, అమ్మ చీమలమందు తాగేసిందని, కాపాడాలని కోరింది. ఎస్సై సతీష్‌కుమార్‌ వెంటనే స్పందించారు. ముగ్గురు పోలీసులు వారి ఇంటికి వెళ్లారు. ఆమెను హుటాహుటిన గోపాలపురం సీహెచ్‌సీకి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెప్పారు. దానయ్యను పిలిచి కౌన్సెలింగ్‌ ఇస్తామని పోలీసులు చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని