logo

YS Jagan: వేళ్లన్నీ జగన్, సీఎంవో వైపే..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూటమి ప్రభంజనానికి వైకాపా అయిదేళ్ల పాలనలో చేసిన సహజవనరుల దోపిడీ, విధ్వంసం, నిర్లక్ష్యం, కక్షసాధింపు చర్యలు ప్రధాన కారణంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Updated : 07 Jun 2024 07:12 IST

వైకాపా ఘోర పరాజయంతో అభ్యర్థుల ఆక్రోశం
అయిదేళ్ల విధ్వంసాన్ని మర్చిపోని ప్రజలు

ప్రభుత్వంలో ఉన్న ధనుంజయరెడ్డి లాంటి కొందరు పనికిమాలిన అధికారులు, నమ్మిన కోటరీ.. వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. అటువంటి అధికారుల మాయలో జగన్‌ ఇరుకున్నారు. సమస్యలు పరిష్కరించాలని సీఎంవో వద్దకు వెళ్తే కొందరు అధికారుల నుంచి స్పందన లభించే పరిస్థితి లేకుండా పోయింది.

- ఇదీ బుధవారం విలేకరుల సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా వైకాపా అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆక్రోశం. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయిన అభ్యర్థులందరూ దాదాపు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నా బయటకు చెప్పేందుకు సంకోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూటమి ప్రభంజనానికి వైకాపా అయిదేళ్ల పాలనలో చేసిన సహజవనరుల దోపిడీ, విధ్వంసం, నిర్లక్ష్యం, కక్షసాధింపు చర్యలు ప్రధాన కారణంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే తప్పుడు కేసుల్లో ఇరికించడం జరిగింది. సంక్షేమ పథకాలు ఇస్తున్నాం.. ఏం చేసినా జనం పట్టించుకోరన్న భావనే కొంప ముంచిందనే వాదన వినిపిస్తోంది. నేతలు మాత్రం తప్పంతా సీఎంవో(సీఎం పేషీ), వాళ్లను నమ్మిన జగన్‌దే అంటూ వేళ్లన్నీ అటువైపే చూపిస్తున్నాయి.  

ఈనాడు, రాజమహేంద్రవరం


అంతులేని ఇసుక, మట్టి దోపిడీ..

ఉమ్మడి జిల్లాలో సహజవనరులైన ఇసుక, మట్టిని అధికారపార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల కనుసన్నల్లో యథేచ్ఛగా దోపిడీ చేశారు. జాతీయ హరిత ట్రైబ్యునల్, హైకోర్టు ఆదేశించినా ఇసుక తవ్వకాల్లో నిబంధనలకు తిలోదకాలిచ్చారు. నాయకులకు తలొగ్గి కలెక్టర్లు సైతం న్యాయస్థానాలకు తప్పుడు నివేదికలు ఇచ్చారు. పెద్దాపురం, జగ్గంపేట, గోపాలపురం, మండపేట నియోజకవర్గాల పరిధిలో కొండలను కరిగించారు. పోలవరం కాలువల మట్టిని సైతం వదలకుండా దోచుకున్నారు.


యువతకు అన్యాయం చేసి..

ఏటా జాబ్‌ క్యాలెండర్, మెగా డీఎస్సీ, కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీ చేస్తామని ప్రతిపక్ష నాయకుడిగా హామీ ఇచ్చిన జగన్‌ ఏఒక్క నోటిఫికేషన్‌ అమలు చేయలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో పథకాలకే తప్ప ఉద్యోగాల భర్తీ, ఉపాధి అవకాశాల ప్రస్తావన లేకపోవడంతో యువతలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 3 లక్షల మంది ఉద్యోగాల కోసం చూస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి, పరిశ్రమలు వస్తాయని, తొలిసంతకం మెగా డీఎస్సీపై పెడతామని భరోసా ఇచ్చి యువతను ఆలోచింపజేసేలా చేశారు.  


కనిపించని అభివృద్ధి జాడలు..

రాజానగరం-కాకినాడ, వేమగిరి-కాకినాడతో పాటు కీలకమైన రోడ్లు అధ్వానంగా మారాయి. రాజమహేంద్రవరం, కాకినాడ తదితర ప్రధాన నగరాల్లో ఆడంబరాలకు ప్రాధాన్యం ఇచ్చిన అధికారులు, పాలకలు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంపై దృష్టి సారించలేదు. సాధారణ నిధులతో రంగులు, డివైడర్లు నిర్మాణానికి కేటాయించారే తప్ప కాలువలు, రోడ్ల నిర్మాణాన్ని విస్మరించారు. ఓ మాదిరి వర్షానికే ముంపు బారిన పడుతున్న నగరాలను ఆ సమస్య నుంచి విముక్తి కల్పించలేకపోయారు.


విపత్తుల సమయంలో..

గోదావరి వరదలు వచ్చినప్పుడు చేపట్టాల్సిన సహాయక చర్యలు విషయంలోనూ సమర్థంగా సేవలందించలేదు. గత వరదల సమయంలో కొన్ని గ్రామాలు వరదలో చిక్కుకుంటే రెండ్రోజుల వరకు నిత్యావసరాలు ఇవ్వలేదు. ప్రకృతి విపత్తుల సమయంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రభుత్వంతో పాటు దళారులు కొందరు మిల్లర్లతో కుమ్మక్కై అన్నదాతను మోసం చేశారు. తడిచిన ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన మిల్లులకు తరలించాలని ముఖ్యమంత్రి ఆదేశించినా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. దీంతో ధాన్యంతో పాటు మిల్లర్లకు ఎదురు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.


ప్రజలకు, క్యాడర్‌కు మధ]్య దూరం..

కార్యకర్తలు నేరుగా ప్రజలు, లబ్ద్ధిదారులను కలవకుండా వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి తీవ్ర తప్పిదం చేశారన్న వాదన ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఎన్నికల కమిషన్‌ వాలంటీర్లను పక్కన పెట్టడంతో ఏ కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరిందో స్థానిక నాయకులకు తెలియకపోవడం, సచివాలయాల్లో ఏం జరుగుతుందో సర్పంచులకు తెలియకపోవడం వల్ల ప్రజలకు, కార్యకర్తలకు పూడ్చలేని అగాధం ఏర్పడింది. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి నిధులు, విధులు లేకుండా చేయడం, బిల్లులు చెల్లించకపోవడంతో కార్యకర్తలు తీవ్ర నైరాశ్యానికి గురయ్యారు.


పనిచేయని సెంటిమెంట్‌ అస్త్రం

ఎన్నికల ప్రచారంలో వైకాపా నాయకులు పలుచోట్ల సెంటిమెంట్‌ అస్త్రం ప్రకటించినా పెద్దగా ఫలితమివ్వలేదు. 2019 ఎన్నికల సయమంలో కోరుకొండ దేవాలయం సమీపంలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్‌ వచ్చి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారని.. విజయం సాధించామని ఆ పార్టీ
నాయకులు భావించారు. అదే సెంటిమెంట్‌తో 2024లో ఇరుకు ప్రాంతమైనా అదే చోట సీఎంతో సభ నిర్వహించినా... అక్కడ కూటమి అభ్యర్థికి 34 వేల మెజార్టీతో ప్రజలు పట్టం కట్టారు. పి.గన్నవరం నియోజకవర్గంలోనూ అదే సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి జగన్‌తో అంబాజీపేటలో ఎన్నికల సభ నిర్వహించారు. అక్కడా ప్రజలు వైకాపాను ఆదరించలేదు.


బాదుడే.. బాదుడు

తొమ్మిది దఫాలు విద్యుత్తు ఛార్జీలు పెంచారు. ట్రూఅప్‌ ఛార్జీల పేరిట అదనపు బాదుడు వేశారు. నెలకు రూ.200 బిల్లు చెల్లించే వినియోగదారుడు రూ.600 చెల్లించాల్సి వస్తోంది. ఆర్టీసీ ఛార్జీలు దండిగా పెంచారు. చెత్త, ఆస్తి పన్నులు వేస్తూ ప్రతి విషయంలోనూ ప్రజలకు ఊహించిన షాక్‌లు ఇచ్చారు.


కార్మికుల పొట్ట కొట్టి..

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది కార్మికులుంటే వారిలో 2 లక్షల మంది భవననిర్మాణ రంగానికి చెందినవారున్నారు. కార్మికుల సంక్షేమ బోర్డును జగన్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేసి, ప్రయోజనాలు అందకుండా చేసింది. ఈవిధంగా జిల్లాలో సుమారు 5 కోట్ల మందికి చెల్లించాల్సిన క్లైముల మొత్తం ఉంది. కొవిడ్‌ సమయంలో ప్రతిఒక్కరికీ రూ.10 వేలు చొప్పున ఇస్తామని నమ్మించి ఇవ్వకుండా మోసం చేశారు. సామాన్యులకు ఇసుక అందకపోవడం, ధర ఆకాశానికి చేరయడంతో నిర్మాణ రంగం కుదేలవ్వడంతో లక్షల మంది పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది.


అధికారులు తప్పుదోవ పట్టించారట..

ప్రజల సమస్యలు పరిష్కరించాలని సీఎంవోకు వెళ్తే అక్కడ ఉన్న కొందరు అధికారులే ముఖ్యమంత్రిలా ఫీలై.. ఎమ్మెల్యేలను కనీసం లెక్కచేయని పరిస్థితి ఏర్పడిందని తూర్పుగోదావరి జిల్లా వైకాపా అధ్యక్షుడు జక్కంపూడి రాజా తాజాగా ఆరోపించారు. వైకాపా పాలనలతో ఎమ్మెల్యేలకే ఆ పరిస్థితి ఉంటే సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. దీర్ఘకాలిక సమస్యలపై ఇచ్చిన హామీలు స్థానిక ఎమ్మెల్యేలు నెరవేర్చకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందనే వాదన ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని