logo

ఏలేరు... అంతంతే నీరు

రెండో పంట సాగుకు అధికంగా నీరు విడుదల చేస్తుండడంతో మెట్ట రైతుల బాంధవి ఏలేరు రిజర్వాయర్‌లో నిల్వలు తగ్గిపోతున్నాయి.

Published : 31 Mar 2023 03:33 IST

న్యూస్‌టుడే, ఏలేశ్వరం

స్పిల్‌వే నుంచి సాగుకు జలాలు

రెండో పంట సాగుకు అధికంగా నీరు విడుదల చేస్తుండడంతో మెట్ట రైతుల బాంధవి ఏలేరు రిజర్వాయర్‌లో నిల్వలు తగ్గిపోతున్నాయి. రబీకి మరో నెల రోజులు 43 వేల ఎకరాలకు జలాలు సరఫరా చేయాల్సి ఉంది. రానున్న రోజుల్లో సాగు, తాగు జలాలకు ఇబ్బందిపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

ఏలేరు రిజర్వాయర్‌కు 86.56 మీటర్ల స్థాయిలో 24.11 టీఎంసీల జలాలను నిల్వ చేసే సామర్థ్యం ఉంది. ప్రాజెక్టులో గురువారం నాటికి 78.49 మీటర్ల ఎత్తున 11.77 టీఎంసీల జలాలు ఉన్నాయి. జలాశయంలో గతేడాది ఇదే సమయానికి 79.52 మీటర్ల స్థాయిలో 12.88 టీఎంసీల నిల్వలుండేవి. గత ఏడాదితో పోలిస్తే నిల్వలు 1.11 టీఎంసీల పరిమాణంలో తక్కువగా ఉన్నాయి.  ఏప్రిల్‌లో జల వినియోగం మరింతగా పెరుగుతుందని అధికారులు అంటున్నారు.

వంద రోజులు... వాడకం 9.39 క్యూసెక్కులు

గతేడాది డిసెంబరు 11వ తేదీ నుంచి రబీకి నీటి విడుదలను ప్రారంభించారు. అప్పట్లో ఏలేరులో 85.03 మీటర్ల స్థాయిలో 21.06 టీఎంసీల జలాలు ఉండేవి. మూడు నెలల వ్యవధిలో 9.39 టీఎంసీల జలాలను వినియోగించారు. ప్రస్తుతం నిల్వ ఉన్న 11.77 టీఎంసీల్లో ఆరు టీఎంసీలు కనిష్ఠ స్థాయిగా ప్రాజెక్టులో ఉంచాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కేవలం 5.77 టీఎంసీలతోనే మళ్లీ వర్షాలు పడేంతవరకు సరిపెట్టుకోవాల్సి ఉంటుంది.వంతుల వారీ పద్ధతితో విడుదల చేసే నీటిపై తనిఖీలు చేయాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటికీ కాలువ వ్యవస్థ పూర్తి ఆధునికీకరణకు నోచుకోకపోవడంతో నీటి ప్రవాహం సజావుగా సాగడం లేదు. జలాల విడుదలపై పూర్తి పర్యవేక్షణ ఉందని, రెండో పంటకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూస్తామని ఏఈ వి.పట్టాభి రామయ్య చౌదరి చెబుతున్నారు.

సాగునీటి విడుదల

ధవళేశ్వరం: ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ నుంచి గురువారం 6,635 క్యూసెక్కుల సాగునీరు విడుదల చేశామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు 1960, 1275, 3400 క్యూసెక్కుల చొప్పున వదిలామన్నారు. కాటన్‌ బ్యారేజీ వద్ద 7.65 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని