logo

విజ్ఞాన భాండాగారాలు.. విలవిల

విజ్ఞాన భాండాగారాలుగా పేరుగాంచిన గ్రంథాలయాలకు గ్రహణం పట్టింది. నిధుల లేమి, అసౌకర్యాలు వెంటాడుతుండగా.. వాటికి సిబ్బంది కొరత తోడైంది.

Published : 01 Apr 2023 05:20 IST

ఏళ్లపాటు భర్తీకాని పోస్టులతో అవస్థలు
న్యూస్‌టుడే, గాంధీనగర్‌ (కాకినాడ)

జిల్లా కేంద్ర గ్రంథాలయంలో దినపత్రికలు చదువుతున్న పాఠకులు

విజ్ఞాన భాండాగారాలుగా పేరుగాంచిన గ్రంథాలయాలకు గ్రహణం పట్టింది. నిధుల లేమి, అసౌకర్యాలు వెంటాడుతుండగా.. వాటికి సిబ్బంది కొరత తోడైంది. పూర్తిస్థాయిలో రెగ్యులర్‌ పోస్టులు భర్తీకాకపోవడంతో పొరుగు సేవల సిబ్బంది, పార్ట్‌టైం వర్కర్లు, స్వీపర్లతో నెట్టుకు రావాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పాఠకులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సేవలు అందించలేక చతికిల పడుతున్నాయి. కొన్ని గ్రంథాలయాలను రెండు, మూడురోజులకోసారి తెరిచే పరిస్థితులు నెలకొన్నాయి.

ఇదీ  పరిస్థితి..

జిల్లా గ్రంథాలయ సంస్థను మార్చి 13, 1952లో ప్రారంభించారు. అప్పటి నుంచి సంస్థ ఆధీనంలో కాకినాడలో జిల్లా ప్రధాన గ్రంథాలయం ఉండగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 101 శాఖా, 48 గ్రామీణ గ్రంథాలయాలు ప్రారంభించారు. ప్రస్తుతం గ్రామీణ గ్రంథాలయాలు కేవలం ఆరు మాత్రమే పనిచేస్తున్నాయి. వీటికి తోడు పలు గ్రామాల్లో పుస్తక పంపిణీ కేంద్రాలను 165 ఏర్పాటు చేయగా అవన్నీ పనిచేస్తున్నాయి.

సిబ్బంది కొరత...

ఉమ్మడి జిల్లా గ్రంథాలయాల్లో ప్రభుత్వ అనుమతి ప్రకారం 204 గ్రంథాలయాధికారుల పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం రెగ్యులర్‌ ఉద్యోగులు గ్రేడ్‌ 1, 2, 3 విభాగాల్లో 65, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు 35 మంది పనిచేస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసినా సగం మంది సిబ్బంది కొరత ఉంది. జిల్లా గ్రంథాలయ సంస్థలో గతంలో కోర్టు ఉత్తర్వులతో నిలిచిపోయిన 31 ఉద్యోగాల భర్తీపై కోర్టు భర్తీకి అనుమతివ్వడంతో చర్యలు చేపడుతున్నట్లు గత ఏడాది జులైలో జరిగిన సమీక్ష సమావేశంలో ఛైర్‌పర్సన్‌ దూలం పద్మ వెల్లడించినా ఏడాదిగా ఆ దిశగా అడుగులు పడిన దాఖలాలు కనిపించలేదు.

జిల్లాలో ఇలా..

జిల్లా కేంద్ర గ్రంథాలయంతోపాటు, 31 శాఖా గ్రంథాలయాలున్నాయి. మొత్తం 40 మంది సిబ్బంది ఉన్నారు. గాంధీనగర్‌ శాఖా గ్రంథాలయంలో రికార్డు అసిస్టెంట్‌, ఆఫీస్‌ సబార్డినేట్‌ లేరు. గ్రంథాలయంలో పుస్తకాలు, ఇతర రికార్డుల నమోదుతోపాటు, పాఠకులకు పుస్తకాలు అందజేయడం, సభ్యత్వ నమోదు, పుస్తకాలు తిరిగి తీసుకోవడం, వాటిని ర్యాకుల్లో సర్థడం, దినపత్రికల ఫైలింగ్‌ వంటి పనులన్నీ గ్రంథాలయాధికారే చేయాల్సి వస్తోంది. తాళ్లరేవు, కాజులూరులకు ఒకే గ్రంథాలయాధికారి ఉండటంతో ఒక్కోచోట మూడేసి రోజులు చొప్పున పనిచేస్తున్నారు. శంఖవరంలోనూ ఇదే పరిస్థితి ఉంది. కాకినాడ నగరంలోని జగన్నాథపురంలో బాలల, శ్రీనగర్‌ శాఖా గ్రంథాలయాలు సిబ్బంది కొరత కారణంగా మూతపడ్డాయి. తుని గ్రంథాలయం గ్రేడ్‌-1 విభాగంలో ఉన్నప్పటికీ రికార్డు అసిస్టెంట్‌తో నిర్వహిస్తున్నారు. జిల్లాలో 60 వరకు పుస్తక పంపిణీ కేంద్రాలుండగా అన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయి.

ప్రభుత్వ అనుమతులకు ఎదురుచూపు

జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శాఖా గ్రంథాలయాల్లో సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమే. దీనిపై 31 పోస్టులు భర్తీచేసుకునేందుకు గతంలో ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వం నుంచి అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాం.

వి.ఎల్‌.ఎన్‌.ఎస్‌.వి.ప్రసాద్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శ

రూ.8 కోట్ల బకాయిలు..

కాకినాడలో జిల్లా గ్రంథాలయ సంస్ధ భవనం

గతంలో గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ఖాతాలో గ్రంథాలయాధికారుల జీతాలు ప్రభుత్వమే చెల్లించేది. ఈ క్రమంలో ఏటా సుమారు రూ.పదికోట్లు వరకు జీతభత్యాలుగా వచ్చేది. ప్రస్తుతం గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ విడుదల ఆపేసి, గ్రంథాలయ సెస్‌ ఆధారంగా జీతాలు తీసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రజలు చెల్లించే ఇంటి, స్థలం పన్నుల్లో రూపాయికి ఎనిమిది పైసలు గ్రంథాలయ సెస్‌గా వసూలు చేస్తున్నా వాటిని ఆయా పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, పంచాయతీలు జమ చేయక పోవడంతో రూ.8 కోట్ల మేర సెస్‌ బకాయిలు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని