logo

పారితోషికం ఖరారు.. ఒకరోజు తఖరారు..!

సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించిన తమకు రెమ్యూనరేషన్‌(పారితోషికం), టీఏ, డీఏ చెల్లింపుల్లో అన్యాయం జరిగిందని సిబ్బంది వాపోతున్నారు.

Updated : 18 May 2024 04:13 IST

13న మగసానితిప్పకు గోదావరిలో పడవపై వెళ్తున్న సిబ్బంది

న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్‌: సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించిన తమకు రెమ్యూనరేషన్‌(పారితోషికం), టీఏ, డీఏ చెల్లింపుల్లో అన్యాయం జరిగిందని సిబ్బంది వాపోతున్నారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి మారుమూల పల్లెలకు వెళ్లి సక్రమంగా ఎన్నికలను పూర్తి చేసినా తమ పట్ల రిటర్నింగ్‌ అధికారులు చిన్నచూపే చూశారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల సిబ్బందికి పోలింగ్‌ కేంద్రాల్లో వసతుల కల్పన, భోజనం, అల్పాహారం, స్నాక్స్‌ సమకూర్చేందుకు బీఎల్వోలకు పూర్తి స్థాయిలో చెల్లింపు చేయలేదని వారూ మండిపడుతున్నారు.

జిల్లాలో ఇలా..

జిల్లావ్యాప్తంగా 1,644 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు మొత్తం అన్నిరకాల అధికారులు కలిపి 11,853 మందిని నియమించారు. కానీ వీరిలో పీవో, ఏపీవోలకు ఒకలా, ఓపీవోలకు మరో విధంగా రెమ్యూనరేషన్‌ అందించారు. పీవో, ఏపీవోలకు రోజుకు రూ.350 చొప్పున ఆరు రోజులకు రూ.2,100 పారితోషికం అందించాలి. కానీ అయిదు రోజులకు మాత్రమే రూ.1,750 ఇచ్చి ఒక రోజు కోత పెట్టారంటూ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. పోలింగ్‌ ముగిసిన రోజు అర్ధరాత్రి వరకు ఎన్నికల విధుల్లోనే ఉన్నారు. కొన్నిచోట్ల మరుసటి రోజు తెల్లవారిన తరువాత కూడా సామగ్రి అధికారులకు అందజేసిన తరువాత ఇళ్లకు  చేరుకున్నారు.

పోలింగ్‌ రోజే నగదు

పోలింగ్‌ రోజున రూట్‌ ఆఫీసర్లు సాయంత్రంలోగా వారి పరిధిలోని పోలింగ్‌ కేంద్రాల్లో చెల్లింపులు చేశారు. ఆ రోజు రాత్రి విధుల్లో ఉన్న విషయాన్ని అధికారులు పరిగణనలోకి తీసుకోలేదని సిబ్బంది వాపోతున్నారు.  డా.బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో పీవో, ఏపీవోలకు రూ.1,750, ఓపీవోలకు రూ.1,000 చొప్పున ఇచ్చారు. కాకినాడ జిల్లాలో పీవో, ఏపీవోలకు రూ.2,100 ఇచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ వ్యత్యాసం ఏంటని ఉద్యోగులు, సంఘాల నాయకులు అభ్యంతరం చెబుతున్నారు.

బీఎల్వోలకు చెల్లింపుల్లోనూ..

ఒక్కో కేంద్రం వద్ద ఏర్పాట్లు, ఎన్నికల సిబ్బందికి భోజనాలు, ఇతర వసతుల కల్పనకు ఎన్నికల సంఘం రూ.8 వేలు కేటాయించింది. ఈ మొత్తంలో జిల్లావ్యాప్తంగా బీఎల్వోలకు రూ.5 వేలకు మించి ఇవ్వలేదు. పంచాయతీల నుంచి షామియానా, విద్యుత్తు సౌకర్యం వంటివి కల్పించారు.  మరోవైపు ఎస్‌ఎస్‌టీ, ఎఫ్‌ఎస్‌టీ బృందాలకు ఇప్పటివరకు పైసా చెల్లించలేదు.

అధికారుల దృష్టికి..

ఈ సమస్యను ఉపాధ్యాయ సంఘాలవారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. విషయం బయటకు వెల్ల్లడించొద్దని, ఆరో రోజుకు కూడా చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇతర ఉద్యోగ సంఘాలూ ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇస్తామంటున్నాయి.

జిల్లాలో విధుల వివరాలు

పీవోలు: 1,911
ఏపీవోలు: 1,934
సూక్ష్మ పరిశీలకులు: 517
జీపీవోలు: 7,491

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని