logo

యథాస్థానంలో మోరంపూడి పైవంతెన శిలాఫలకం

రాజమహేంద్రవరం గ్రామీణంలోని మోరంపూడి పైవంతెనకు సంబంధించిన పాత శిలాఫలకాలను మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు నేతృత్వంలో గురువారం యథాస్థానంలో ఏర్పాటు చేశారు.

Published : 14 Jun 2024 04:27 IST

శిలాఫలకాల వద్ద ఎమ్మెల్యే శ్రీనివాస్‌ తదితరులు

టి.నగర్, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం గ్రామీణంలోని మోరంపూడి పైవంతెనకు సంబంధించిన పాత శిలాఫలకాలను మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు నేతృత్వంలో గురువారం యథాస్థానంలో ఏర్పాటు చేశారు. ఇటీవల వీటిని కొంతమంది ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాతవాటిని తిరిగి అదే స్థానంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ మాట్లాడుతూ గత ఎంపీ మురళీమోహన్‌ హయాంలో వేసిన శిలాఫలకాన్ని పక్కన పారేయడంతో తమ పార్టీకి చెందిన కార్యకర్తలకు బాధ కలిగి పగులగొట్టారన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి రెండు శిలాఫలకాలను సొంత డబ్బులతో మళ్లీ ఏర్పాటు చేశామన్నారు. మాజీ ఎంపీ భరత్‌కు సంస్కారం లేదన్నారు. తన విషయంలో సుబ్రహ్మణ్య మైదానంలో చెప్పు చూపించారన్నారు. ఆయన చేసినది అభివృద్ధి కాదని, కేవలం అవినీతి కోసమే పనులు చేపట్టడం జరిగిందన్నారు. అందుకే ప్రజలు అంగీకరించలేదన్నారు. బాలికల హాస్టల్‌ వద్ద ఈట్‌స్ట్రీట్‌ ఏర్పాటు చేసి అరాచకాలకు తెరతీశారన్నారు. బ్లేడ్, గంజాయి బ్యాచ్‌లను పెంచి పోషిస్తూ సాంస్కృతిక రాజధానికి మచ్చ తీసుకొచ్చారన్నారు. సిటీప్లానింగ్‌ విభాగంలో ఆయన వెనుక ఉన్న అనుచరులు ఎంత అవినీతికి పాల్పడ్డారో చిట్టా బయటకు తీస్తామన్నారు. ఆవ భూముల విషయంలో అవినీతిని బయట పెడతామన్నారు. జనసేన నగర ఇన్‌ఛార్జి అత్తి సత్యనారాయణ మాట్లాడుతూ అధికారాన్ని అడ్డుపెట్టుకొని భరత్‌ చేసిన మోసాలను ప్రజలు మర్చిపోరన్నారు. అర్బన్‌ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన నగర ఇన్‌ఛార్జి అత్తి సత్యనారాయణ, నగర తెదేపా అధ్యక్షుడు రెడ్డి మణేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని