logo

మార్కెట్‌ కమిటీల కుర్చీలు ఖాళీ

గత ప్రభుత్వ హయాంలో మార్కెటింగ్‌ కమిటీలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయి. ఎక్కడా రైతులకు సరైన సౌకర్యాలు కల్పించలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. వీటి పదవీకాలం ముగిసిన తర్వాత త్రిమెన్‌ కమిటీలను నియమించారు.

Published : 14 Jun 2024 04:32 IST

కొత్త ప్రభుత్వంలో భర్తీకి మార్గం సుగమం
న్యూస్‌టుడే, గాంధీనగర్‌(కాకినాడ)

జిల్లా మార్కెటింగ్‌ శాఖ ఏడీ కార్యాలయం, కరప మార్కెట్‌ కమిటీ కార్యాలయం

త ప్రభుత్వ హయాంలో మార్కెటింగ్‌ కమిటీలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయి. ఎక్కడా రైతులకు సరైన సౌకర్యాలు కల్పించలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. వీటి పదవీకాలం ముగిసిన తర్వాత త్రిమెన్‌ కమిటీలను నియమించారు. వాటి గడువూ పెంచుతూ వచ్చారు. వీటిలో కొన్ని కమిటీల పదవీకాలం ముగిసింది. ప్రభుత్వం మారిన నేపథ్యంలో కొందరు రాజీనామాలు చేశారు.  

తప్పక రాజీనామా చేసి..

కాకినాడ జిల్లాలో తొమ్మిది మార్కెట్‌ కమిటీలు ఉన్నాయి. కాకినాడ, కరప, కాకినాడ రూరల్, సామర్లకోట, పెద్దాపురం, జగ్గంపేట, తుని, పిఠాపురం, ప్రత్తిపాడుల్లో వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఉన్నాయి. వీటిల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే నాటికే ఏడు కమిటీలు ఖాళీ అయ్యాయి. కాకినాడ మార్కెట్‌ కమిటీ ఏడాది పదవి గడువు మంగళవారంతో పూర్తయింది. పిఠాపురం మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌గా వైకాపాకు చెందిన ఛైర్మన్‌ మొగలి విమల బుధవారం రాజీనామా చేశారు. వచ్చేనెల 4 వరకు ఆమె పదవీ కాలం ఉండగా.. చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారంతో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పదవుల్లో ఉన్నవారు రాజీనామా చేయాల్సి వచ్చింది.

సంస్కరణలకు శ్రీకారం చుడతారా...

మార్కెటింగ్‌ కమిటీల్లో ఛైర్మన్‌తో కలిపి 19 మందిని నియమిస్తారు. వైకాపా అధికారంలో ఉన్న అయిదేళ్ల కాలంలో జిల్లాలోని మార్కెటింగ్‌ కమిటీలన్నీ వైకాపా సానుభూతిపరులు, నాయకులతో నిండిపోయి రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయి. ఒక్కో కమిటీలో నలుగురు ప్రభుత్వ అధికారులు ఉంటారు. వీరిలో మార్కెటింగ్‌ ఏడీ, జిల్లా అగ్రికల్చర్‌ లేదా, హార్టీకల్చర్‌ ఏడీ, పీఏసీఎస్‌ సభ్యుడు, మున్సిపల్‌ లేకుంటే పంచాయతీ అధికారి ఉంటారు. వీరితోపాటు ముగ్గురు వర్తకులు, వ్యాపారులతో కలిపి 11 మందిని కమిటీలో ఎన్నుకుంటారు. వీటితోపాటు గౌరవాధ్యక్షుడిగా స్థానిక ఎమ్మెల్యే కొనసాగుతారు. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు వ్యతిరేకంగా కేవలం పార్టీ నాయకులను మాత్రమే కమిటీ సభ్యులుగా నియమించారు. దీంతో వారు అంతగా రైతు సంక్షేమాన్ని పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలోనైనా రైతు సంక్షేమం, గిట్టుబాటు ధర కల్పన, పండిన పంటను దాచుకునే అవకాశం కల్పిస్తారని రైతులు ఆశతో ఎదురు చూస్తున్నారు. మార్కెటింగ్‌ శాఖలో పలు సంస్కరణలకు శ్రీకారం చుడతారని భావిస్తున్నారు.

రైతుబజార్లు ఏవీ..?

వీటి ప్రధాన విధులతో పాటు మార్కెటింగ్‌ శాఖ ఆధీనంలోని జిల్లా వ్యాప్తంగా కొత్త రైతుబజార్ల నిర్మాణాలూ ముందుకు సాగలేదు. ప్రారంభించిన పనులనూ పూర్తి చేయలేదు. దీంతో ఇటు రైతులకు, అటు వినియోగదారులకు నష్టం జరిగింది. కొత్త ప్రభుత్వం కొలువు దీరిన వేళ గత ప్రభుత్వ హయాంలోని మార్కెటింగ్‌ కమిటీలు రద్దవ్వడంతో చంద్రబాబు పాలనలో రైతులతోపాటు, మార్కెటింగ్‌ శాఖ కళకళలాడే అవకాశం ఉందని ఆశలు రేకెత్తుతున్నాయి.


ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణయం..
-కేఆర్‌ఆర్‌ నాగేశ్వరరావు, వ్యవసాయ వాణిజ్య, మార్కెటింగ్‌ అధికారి 

కొత్త ప్రభుత్వం కొలువు తీరిన నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా కొత్త మార్కెటింగ్‌ కమిటీలకు నామినేషన్‌ పద్ధతిపై నియామకాలు జరుగుతాయి. గతంలో అసంపూర్తిగా నిలిచిన రైతుబజార్ల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని