logo

ఇదో రకం గోల్‌మాల్‌

తమకు తెలియకుండా తమ భూములపై వీఆర్వో ఇచ్చిన కౌలుకార్డులతో నర్సిపూడి చైతన్యగోదావరి గ్రామీణ బ్యాంకులో కొందరు వ్యక్తులు రైతు రుణాలు పొందడంపై గురువారం స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 14 Jun 2024 04:46 IST

రైతులకు తెలియకుండానే కౌలు కార్డులతో రుణాలు  
నర్సిపూడిలో వెలుగు చూసిన బాగోతం

వివరిస్తున్న బాధిత రైతులు

ఆలమూరు, న్యూస్‌టుడే: తమకు తెలియకుండా తమ భూములపై వీఆర్వో ఇచ్చిన కౌలుకార్డులతో నర్సిపూడి చైతన్యగోదావరి గ్రామీణ బ్యాంకులో కొందరు వ్యక్తులు రైతు రుణాలు పొందడంపై గురువారం స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి కొందరి వివరాలే బయటకు వచ్చాయని విచారణ జరిపితే మరిన్ని వివరాలు బయటకు వస్తాయన్నారు. రైతులు వాసిరెడ్డి వీరవెంకట సత్యనారాయణ, రావిపాటి నాగేంద్రకుమార్‌ చెప్పిన వివరాల ప్రకారం... గతంలో గ్రామ వీఆర్వోగా పనిచేసిన దారా సుదర్శన్, వీఆర్‌ఏతో కలిసి రైతులైన తమ అనుమతి లేకుండా, కనీసం ఏ విధమైన సమాచారం ఇవ్వకుండా తమ భూములపై 2019 జూన్‌ నుంచి 2022 జూన్‌ వరకు కౌలురైతు రుణ కార్డులను పలువురుకి మంజూరు చేసినట్లు తెలిపారు. వారు ఆ కార్డులతో స్థానిక చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో రుణం పొందారని, తరువాత ఆ రుణాలను వారు తిరిగి చెల్లించలేదన్నారు. తాము ఈ సంవత్సరం తమ   1 బీ ఫారాలను తీసుకుని సొసైటీలో రుణం మంజూరుకు అప్లై చేసుకోగా తమకు ఇదివరకే గ్రామీణ బ్యాంకులో రుణం మంజూరైనట్లు  ఆన్‌లైన్‌లో రావడంతో అవాక్కయ్యామన్నారు. గతవారం రైతులు బ్యాంకుకు వెళ్లి వివరాలు అడగడంతో తమ భూములపై కౌలుదారులకు రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారన్నారు. కౌలుదారులకు తాము ఎటువంటి కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వలేదని చెప్పి.. ఎవరెవరు రుణాలు తీసుకున్నారో తెలిపాలని ఫిర్యాదు చేశామన్నారు. బ్యాంకు అధికారులు ఈ వివరాలు బయటకు ఇవ్వలేమంటున్నారని, దీని వెనుక తప్పు జరగకపోయి ఉంటే వివరాలివ్వడానికి ఇబ్బందేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై ‘న్యూస్‌టుడే’ తహసీల్దారును వివరణ అడుగగా సదరు వివరాలేవీ తమ దృష్టికి రాలేదని, ఈ అంశంపై ఫిర్యాదు వస్తే సమగ్ర విచారణ జరిపిస్తామని తెలిపారు.


బ్యాంకు అధికారులు వివరాలివ్వడం లేదు
- రావిపాటి నాగేంద్రకుమార్, రైతు, నర్సిపూడి

మా తల్లి రావిపాటి లక్ష్మికి చెందిన భూమిపై ఎవరో వ్యక్తి రూ.2లక్షల రుణం తీసుకున్నారు. దీనిపై బ్యాంకు అధికారులను వివరాలడిగితే బయటకు ఇవ్వడం కుదరదని అంటున్నారు. దీనిపై తగిన విచారణ జరగాలి


రూ.4 లక్షలు తీసుకున్నారు..
- వాసిరెడ్డి వీరవెంకట సత్యనారాయణ, రైతు, నర్సిపూడి 

నా భూమిపై రూ.నాలుగు లక్షల రుణం అంబేడ్కర్‌ రైతు సంఘం వారు తీసుకున్నట్లు తెలిసింది. నా సంతకం కానీ, నా అనుమతి లేకుండా కౌలు రుణమంజూరు కార్డు జారీ అయినట్లు తెలిసింది. బ్యాంకుకు వచ్చి వివరాలు అడుగుతుంటే అధికారులు బయటకు తెలపలేమంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు