logo

ఇక చేపల వేట షురూ..!

బంగాళాఖాతం తూర్పు తీరంలో వేట సాగించేందుకు మత్స్యకారులు సన్నద్ధమవుతున్నారు. 61 రోజుల నిషేధ సమయం నేటి అర్ధరాత్రితో ముగియనుంది.

Published : 14 Jun 2024 04:56 IST

నేటి అర్ధరాత్రితో నిషేధం తొలగింపు

అల్లవరం మండలం ఓడలరేవు వద్ద మర పడవలు సిద్ధం చేసుకుంటున్న మత్స్యకారులు

న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్‌: బంగాళాఖాతం తూర్పు తీరంలో వేట సాగించేందుకు మత్స్యకారులు సన్నద్ధమవుతున్నారు. 61 రోజుల నిషేధ సమయం నేటి అర్ధరాత్రితో ముగియనుంది. దీంతో గంగపుత్రుల బోట్లు సముద్రంలోకి కదలనున్నాయి. ఏటా ఏప్రిల్‌ 14 నుంచి జూన్‌ 14వ తేదీ అర్ధరాత్రి వరకు సముద్ర జలాల్లో చేపలవేట నిషేధం అమలవుతుంది. ఈ సమయంలో మత్స్యసంపద తన సంతతిని వృద్ధి చేసుకునే రోజులుగా పరిగణించి ప్రభుత్వం నిషేధం అమలు చేస్తోంది. నిషేధకాలం అనంతరం వేటాడేవారికి దండిగా మత్స్య సంపద లభిస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

సముద్రంలోకి వెళ్లకుండా పటిష్ట నిఘా 

వేట నిషేధ సమయంలో మత్స్యకారులెవరూ సముద్రంలోకి వేటకు వెళ్లకుండా అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. వేట నిషేధం అమల్లో ఉండగా సముద్రంలో మర బోట్ల ద్వారా వేట సాగిస్తే బోటు అనుమతులు, ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు, ఇతర పథకాలు రద్దు చేస్తామని అధికారులు గట్టిగా చెప్పడంతో ఎవరూ వేటకు వెళ్లేందుకు సాహసించలేదు. దీంతో జిల్లాలో పూర్తి స్థాయిలో వేట నిషేధం అమలైంది. నేటి అర్ధరాత్రి నుంచి నిషేధం తొలగిపోనున్న నేపథ్యంలో తీర ప్రాంత గ్రామాల్లో మత్స్యకారులు తిరిగి తెప్పలు, వలలు, ఇంజిన్లు, బోట్లను వేటకు సిద్ధం చేసుకుంటున్నారు.

జిల్లాలో  ఇలా..

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లావ్యాప్తంగా 94 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది. జిల్లాలో ఏడు చోట్ల మత్స్యకారులు తమ బోట్లను నిలుపుదల చేసుకునేందుకు అనువైన స్థలాలున్నాయి. 9 తీర ప్రాంత మండలాల్లో సుమారు 40 వరకు మత్స్యకార గ్రామాలు ఉండగా వాటిలో 80 వేలమంది వరకు మత్స్యకారులు నివాసం ఉంటున్నారు. వీరిలో మూడొంతుల మందికి వేటే జీవనాధారం. జిల్లావ్యాప్తంగా 1,900 బోట్లపై సుమారు 12 వేలమంది వేట సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కోనసీమ పరిధిలోని సముద్ర జలాల్లో స్థానిక మత్స్యకారులే కాకుండా విశాఖ, నక్కపల్లి, నెల్లూరు తదితర ప్రాంతాల నుంచి వచ్చేవారు అంతర్వేది, ఓడలరేవు జెట్టీల నుంచి సముద్రంలోకి వేటకు వెళతారు. వేట నిషేధం ప్రారంభంలో తమ బోట్లను వారు ఇక్కడే సురక్షిత ప్రాంతాల్లో నిలిపిఉంచారు. నిషేధ గడువు ముగుస్తుండటంతో రెండు రోజులు క్రితమేవారు తిరిగి ఇక్కడికి చేరుకుని బోట్లను సిద్ధం చేసుకుంటున్నారు.

అర్హులకు మత్స్యకార భరోసా

సముద్రంలో వేట నిషేధ సమయంలో బోట్ల ద్వారా వేట సాగించేవారికి ప్రభుత్వం పరిహారంగా ఒక్కో మత్స్యకారుడికి రూ.10 వేల ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ సంవత్సరం సార్వత్రిక ఎన్నికల నియమావళి అమల్లో ఉండటంతో ఇప్పటివరకు అర్హులైన వారికి మత్స్యకార భరోసా సొమ్ము అందలేదు. జిల్లాలో సుమారు 1900 బోట్లు వేట సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వీటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న 11,867 మందిని అర్హులుగా గుర్తించారు. కానీ వీటిలో కొన్ని బోట్లు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో కొందరిని అనర్హులుగా పేర్కొన్నారు. రాయితీ డీజిల్‌కు ప్రభుత్వం అందించిన కార్డులను సక్రమంగా వినియోగించని బోట్లను పథకం లబ్ధి పొందేందుకు అర్హత లేనివిగా నిర్ణయించారు. దీంతో జిల్లా మొత్తం మీద 10 వేల మంది మత్స్యకారులకు భరోసా సొమ్ము అందనున్నట్లు అధికారులు తెలిపారు.


జాబితా సిద్ధం చేస్తున్నాం
- శ్రీనివాస్, జిల్లా మత్స్యశాఖ అధికారి 

నేటి అర్ధరాత్రితో సముద్రంలో వేట నిషేధం ముగుస్తుంది. ఈ సమయంలో మత్స్యకారులకు అందించే భరోసాకు అర్హులైనవారి పేర్లతో జాబితాలు సిద్ధం చేస్తున్నాం. ఎన్నికల నియమావళి అమల్లో ఉండటంతో ఈ ప్రక్రియ కొంతమేర ఆలస్యమైంది. త్వరలోనే వారికి నిధులు అందుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని