logo

పుస్తకాలు లేకుండానే తరగతులు.. పస్తులతోనే పాఠాలు

విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు అందించి వారికి అధ్యాపకులతో బోధన చేయిస్తేనే మంచి ఫలితాలు రాబట్టగలం. అంతర్జాతీయ ప్రమాణాలంటూ గడిచిన అయిదేళ్లుగా ఊదరగొట్టేసిన వైకాపా ప్రభుత్వం

Published : 14 Jun 2024 05:02 IST

ఇదీ ఇంటర్‌ విద్యార్థుల పరిస్థితి 
కొత్త ప్రభుత్వంపైనే ఆశలు 

న్యూస్‌టుడే, సీతానగరం: విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు అందించి వారికి అధ్యాపకులతో బోధన చేయిస్తేనే మంచి ఫలితాలు రాబట్టగలం. అంతర్జాతీయ ప్రమాణాలంటూ గడిచిన అయిదేళ్లుగా ఊదరగొట్టేసిన వైకాపా ప్రభుత్వం ఇంటర్‌ చదివే పిల్లలకు పుస్తకాలు చేతిలో పెట్టకుండా పరీక్షలు నిర్వహించేది. సబ్జెక్టులు తప్పితే మాకేంటి అన్నట్లు వ్యవహరించేది. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైంది. ఎంతో ఉత్సాహంతో కళాశాలలకు వస్తున్న విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఈ ఏడాది సైతం గత ప్రభుత్వం పుస్తకాలు ముద్రణ చేయలేదు. ప్రవేశాలు పొందే సమయంలోనే ఇంటర్‌ పుస్తకాలు బయట కొనుక్కోవాలని చెబుతున్నారు. పేదవర్గాలకు చెందిన వారంతా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రభుత్వ కళాశాలల్లోనే చేరడం వల్ల పుస్తకాలు పెట్టుబడి ఖర్చు భారంగా మారిందంటున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు తగ్గుతున్నా గత ప్రభుత్వం పట్టించులేదు.

ప్రచురణ జరుగుతోందంటూ కాలయాపన..

2019 వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు అప్పటి తెదేపా ప్రభుత్వం ఇంటర్‌ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను ప్రవేశం రోజునే ఉచితంగా అందించేది. ఆర్ట్స్, సైన్సు, వృత్తి విద్యాకోర్సులకు సంబంధించిన అన్ని పాఠ్యపుస్తకాలను ముందుగానే ప్రచురించి ఆయా కళాశాలలు ఇచ్చిన ఇండెంట్‌ ప్రకారం సరఫరా చేసేవారు. ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఉండేది. దూర ప్రాంతాల నుంచి వచ్చినవారంతా కళాశాలలోనే భోజనం చేసేవారు. 2020 నుంచి వైకాపా ప్రభుత్వం పాఠ్యపుస్తకాల ముద్రణ నిలిపివేయడంతోపాటు మధ్యాహ్న భోజన పథకం రద్దు చేసింది. పుస్తకాల ముద్రణకు అవసరమైన రూ.22 కోట్లు లేవని చెబుతూ వచ్చింది. విద్యార్థులు పాఠ్యపుస్తకాలపై ఆందోళన చేపడితే తితిదే ఆధ్వర్యంలో పుస్తకాలు ముద్రణ జరుగుతుందంటూ కాలయాపన చేస్తూ పాలన ముగించిందే తప్ప ఒక్క పాఠ్యపుస్తకం కూడా పేద విద్యార్థికి అందించలేకపోయారు. 

ఆంగ్ల మాధ్యమం పేరిట ఆర్భాటం..

ప్రభుత్వ కళాశాలల్లో తెలుగు మాద్యమంలో ఉండే విద్యార్థులకు పుస్తకాలు లేకుండానే ఆంగ్లమాధ్యమంటూ ప్రవేశాలు ఇవ్వడంతో వీరంతా పుస్తకాలు ఎలా ఉంటాయో చూడకుండానే ఇంటర్‌ చదివేశారు. గడిచిన నాలుగేళ్లుగా ఏటా ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులు అధిక సంఖ్యలో పరీక్షలు తప్పుతూనే ఉన్నారు. అయినా దీనిపై ఎటువంటి అధ్యయనాలు లేకుండా పోయాయి. 2020 నుంచి ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ కళాశాలలకు 2.78 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరమనే ఇండెంట్‌ను పంపిస్తూనే ఉన్నారు. అవన్నీ బుట్టదాఖలు చేయడంతోపాటు పాతపుస్తకాలను సర్దుబాటు చేయాలనే ఆదేశాలతో నోరుమెదపలేని పరిస్థితుల్లో అధ్యాపకులు ఉండిపోయారు. చాలా కళాశాలల్లో పూర్వ విద్యార్థుల నుంచి పుస్తకాలను సేకరించి అధ్యాపకులు సర్దుబాటు చేశారు. చిరిగిన పుస్తకాలను అతికించి వాటినే బోధనకు ఉపయోగించారు. జిరాక్సులూ తీయించారు. కొన్నిచోట్ల కళాశాలల్లోనే గ్రంథాలయాల్లో పుస్తకాలను ఉంచి ఉదయం, సాయంత్రం తిరగేయించారు. బయట కొనాలంటే ఒక్కో గ్రూపునకు సంబంధించి రూ.3,000 నుంచి రూ.4,500 వరకు ఖర్చవుతుంది. ప్రభుత్వ కళాశాలల్లో ఆర్థికస్థోమత కలిగిన కొద్దిమంది విద్యార్థులు కొనుగోలు చేసిన వాటినే మిగతా విద్యార్థులు తిరగేసేవారు. కార్పొరోట్, ప్రైవేటు కళాశాలల్లో అయితే ఆయా యాజమాన్యాలకు చెల్లించే ఫీజుల్లోనే వీటిని అందిస్తున్నారు. 


అధ్యాపకుల వద్దనున్న పాఠ్యపుస్తకాలతో బోధన

2014-2019 మధ్యకాలంలో ఇంటర్‌ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పాఠ్యపుస్తకాలతోపాటు మధ్యాహ్నం భోజనం అందించిన తెదేపా ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడంపై విద్యార్థులు, అధ్యాపకులు సమస్యలు పరిష్కారమవుతాయని కోటి ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా పాఠ్యపుస్తకాల ముద్రణకు కొంత సమయం పట్టడం వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టి సారించాలని వీరంతా కోరుతున్నారు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరంలో సుమారుగా 52,536 మంది విద్యార్థులు ఉంటే ప్రథమ సంవత్సరంలో 50వేలకు పైగా ప్రవేశాలు ఉంటాయనే అంచనాలో అధికారులు ఉన్నారు. ప్రస్తుతం అధ్యాపకుల వద్ద ఉన్న పాఠ్యపుస్తకం ఆధారంగానే విద్యార్థులకు బోధన జరుగుతోంది.  


కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది..
- జె.వి.వి.ఎస్‌.సుబ్రహ్మణ్యం, డీఐఈవో

ఈ ఏడాది కూడా గత ప్రభుత్వం ఇంటర్‌ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు సరఫరా చేయలేదు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభించాం. పాత పుస్తకాలనే కొంతమందిక సర్దుబాటు చేయించాం. పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం అమలు తదిరత వాటిపై కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని