logo

కువైట్‌ అగ్నిప్రమాదం.. జిల్లావాసులు ఇద్దరి మృతి

మంచి వేతనం లభిస్తుందని.. కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవచ్చని.. కోటి ఆశలతో కువైట్‌ వెళ్లారు. నా అనే వాళ్లందర్నీ వదిలి ఎడారి దేశానికి వెళ్తే.. అక్కడే అసువులు బాయడంతో వారి కుటుంబాల్లో అంతులేని ఆవేదన మిగిలింది.

Published : 14 Jun 2024 05:06 IST

సత్యనారాయణ, ఈశ్వరుడు (పాత చిత్రాలు)

పెరవలి: మంచి వేతనం లభిస్తుందని.. కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవచ్చని.. కోటి ఆశలతో కువైట్‌ వెళ్లారు. నా అనే వాళ్లందర్నీ వదిలి ఎడారి దేశానికి వెళ్తే.. అక్కడే అసువులు బాయడంతో వారి కుటుంబాల్లో అంతులేని ఆవేదన మిగిలింది. కువైట్‌లో భారతీయ కార్మికులు నివాసముండే బహుళఅంతస్తుల భవనంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో పెరవలి మండలానికి చెందిన ఇద్దరు మృత్యువాతపడ్డారు. దీంతో ఆ గ్రామాల్లో తీరని విషాదం నెలకొంది. పెరవలి పోలీసులు గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. 

12 ఏళ్ల క్రితం వెళ్లారు.. పెరవలి మండలం ఖండవల్లి గ్రామానికి చెందిన మొల్లేటి ముక్తేశ్వరరావు, రాఘవులు భార్యాభర్తలు. వీరు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. వీరి రెండో కుమారుడు సత్యనారాయణ(38)కు సుమారు 20 ఏళ్ల క్రితం అనంతలక్ష్మితో వివాహమైంది. వీరికి 19 ఏళ్ల కుమారుడు వెంకటసాయి ఉన్నాడు. కాగా ఉపాధి నిమిత్తం సత్యనారాయణ.. 12 ఏళ్ల క్రితం కువైట్‌ వెళ్లిపోయారు. అప్పటినుంచి అక్కడే ఓ సూపర్‌మార్కెట్‌లో సహాయకుడిగా పనిచేస్తున్నారు. వచ్చే జీతంతో తాను జీవిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. రెండు, మూడేళ్లకు వచ్చి వెళ్తుంటారు. ఇటీవలే సొంతింటి గృహప్రవేశానికి వచ్చి వెళ్లారు. ఇప్పుడు తిరిగిరాని లోకాలకు వెళ్లారని తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

పదేళ్ల క్రితం.. పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామానికి చెందిన నారాయణరావు, సీతామహాలక్ష్మి దంపతుల కుమారుడు మీసాల ఈశ్వరుడు (40) కూడా ఈ ప్రమాదంలో చనిపోయారు. ఈయన పెద్దగా చదువుకోలేదు. స్థానికంగా వ్యవసాయ కూలీగా చేసేవారు. పదేళ్ల క్రితం కువైట్‌ వెళ్లారు. అప్పటి నుంచి అక్కడే ఓ సూపర్‌మార్కెట్‌లో పనిచేస్తున్నారు. భార్య చిట్టికాసులు, కుమారుడు సాయి మణికంఠ, కుమార్తె కోమలి కృష్ణకుమారి ఉన్నారు. ఇంటిపెద్దను కోల్పోవడంతో ఆ ఇంట తీరని విషాదం నెలకొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని