logo

మీ సహకారం ఇక చాలు!

సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో నామినేటెడ్‌ పోస్టులు రద్దు చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కొందరు తమ పదవుల నుంచి తప్పుకోగా మిగిలిన వారు మిన్నకుండిపోయారు.

Published : 14 Jun 2024 05:11 IST

సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో నామినేటెడ్‌ పోస్టులు రద్దు చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కొందరు తమ పదవుల నుంచి తప్పుకోగా మిగిలిన వారు మిన్నకుండిపోయారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన గడువు ముగియడంతో వారిని తప్పించేందుకు సహకార శాఖ అధికారులు తగిన చర్యలకు ఉపక్రమించారు. 

న్యూస్‌టుడే, సీతానగరం: తూర్పుగోదావరి జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(సింగిల్‌ విండో) నాన్‌ అఫీషియల్‌ పర్సన్‌ ఇన్‌ఛార్జి త్రిసభ్య కమిటీల గడువు ఈ ఏడాది జులై నెలాఖరుకు ముగియనుంది. జిల్లా మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌)ల సెవెన్‌మెన్‌ కమిటీలకు వచ్చేనెల 17తో నామినేటెడ్‌ పదవీకాలం పూర్తవనుంది. గత వైకాపా ప్రభుత్వం కమిటీల పేరిట వారికే పదవులు అంటగట్టి ఆరు నెలలకోసారి పొడిగిస్తూ పాలకవర్గాల ఊసే లేకుండా చేసింది.


వైకాపా అయితేనే రుణాలు!

వైకాపా 2019లో అధికారంలోకి వచ్చినప్పుటి నుంచి సహకార పరపతి సంఘాలు ఆ పార్టీ చేతుల్లోకి వెళ్లడంతో చిన్న, సన్నకారు రైతులంతా పడరాని పాట్లు పడ్డారు. త్రీమెన్‌ కమిటీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించాయి. గతంలో సహకార పరపతి పొందాలంటే రైతులు సంబంధిత సీఈవోకు అవసరమైన దస్త్రాలు ఇస్తే సరిపోయేది. వాటిని సరిచూసుకుని కేంద్ర సహకార బ్యాంకు ద్వారా రుణాలు అందించేవారు. గత ఐదేళ్లుగా రుణాలు తీసుకోవాలంటే వైకాపా ముద్ర పడితేనే త్రీమెన్‌ కమిటీలు అంగీకరించేవి. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రం వరకు వారి పాలన నిండిపోవడంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో సొసైటీల సీఈవోలు ఉండిపోయారు. పార్టీలతో సంబంధం లేకుండా రుణాలు ఇవ్వాలని రాజానగరం నియోజకవర్గానికి చెందిన ఒకరిద్దరు సీఈవోలు నోరు విప్పితే త్రీమెన్‌ కమిటీల నుంచి వారికి బెదిరింపులు తప్పలేదు. ఆ కమిటీలు చెప్పిన వారికే సహకార బ్యాంకు ద్వారా పంట రుణాలిచ్చారు. దీంతో అందులో ఉండేందుకు ఆ పార్టీలో పోటీ పెరిగింది. ఆరు నెలలకోసారి మారే పదవులు తమకు ఇవ్వకపోతే పార్టీ మారతామనే ధోరణిలో ద్వితీయ శ్రేణి నాయకత్వాలు ఉండేవి.


ఎన్నికలకు వెళ్లకుండానే!

సహకార పరపతి సంఘాల పాలకవర్గాలకు 2018 లోనే గడువు ముగిసింది. 2019లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అప్పటి తెదేపా ప్రభుత్వం ఏడాది కాలం అఫీషియల్‌ పర్సన్‌ ఇన్‌ఛార్జులను నియమించింది. ఆ తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం ఎన్నికల జోలికి వెళ్లకుండా త్రిసభ్య కమిటీలు, డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు సెవెన్‌మెన్‌ కమిటీలను నియమించింది. వాటి గడువును ప్రతి ఆరు నెలలకోసారి పొడిగించుకుంటూ వచ్చింది. వైకాపా వారే త్రీమెన్‌ సభ్యులుగా ఉండడం వల్ల సొసైటీలకు సంబంధించిన కొంత నగదును సైతం సొంత పనులకు ఉపయోగించకునే పరిస్థితులు ఉండేవంటున్నారు. ఆడిట్‌ సమయంలో సర్దుబాటు చేస్తామంటూ సీఈవోలపై ఒత్తిళ్లు చేయడంతో ఉద్యోగులు బిక్కు బిక్కుమంటూనే ఐదేళ్లు గడిపారు. 


ఎట్టకేలకు కొందరు రాజీనామా

ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు నామినేటెడ్‌ పోస్టుల్లో ఉన్నవారంతా ఆయా సొసైటీల సీఈవోలకు రాజీనామా పత్రాలు ఇవ్వాలని సహకార శాఖ అధికారులు ఆదేశాలిచ్చారు. 9వ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో 10వ తేదీ వరకు రాజీనామా పత్రాలు తీసుకున్నారు. రాజమహేంద్రవరం, కొవ్వూరు డివిజన్ల పరిధిలో 107 సొసైటీలకు గాను గడువు ముగిసే సరికి 94 మంది మాత్రమే రాజీనామాలు చేశారు. సమయం ముగిసినా వీరు తప్పుకోకపోవడంపై ఆ శాఖ అధికారులు కన్నెర్ర చేశారు. 


రెండ్రోజుల్లో నియామకం

జిల్లావ్యాప్తంగా డీసీసీబీ, డీసీఎంఎస్‌లతో పాటు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు అఫీషియల్‌ పర్సన్‌ ఇన్‌ఛార్జులను రెండు రోజుల్లో నియమించేలా ఉత్తర్వులు జారీ చేసినట్లు డీసీవో శ్రీరాములు నాయుడు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. ప్రభుత్వం నుంచి జీవో వచ్చిన తర్వాతనే త్రీమెన్, సెవెన్‌మెన్‌ కమిటీలు ఉంటాయన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని