logo

ఆశల ద్వీపంలో..అడుగు ఇంకెప్పుడు?

గోదావరి వరదలకు సముద్రంలో కొట్టుకొచ్చే ఇసుక మేటలతో సహజ సిద్ధంగా 200 ఏళ్ల క్రితం ఏర్పాటైన ద్వీపం.. హోప్‌ ఐలాండ్‌. తాళ్లరేవు మండలం కోరింగ పంచాయతీ పరిధి అభయారణ్యంలో ఇదో భాగం..

Updated : 14 Jun 2024 05:35 IST

‘హోప్‌ ఐలాండ్‌’ పర్యాటకంపై తొలగని ఆంక్షలు
ఈనాడు, కాకినాడ

గోదావరి వరదలకు సముద్రంలో కొట్టుకొచ్చే ఇసుక మేటలతో సహజ సిద్ధంగా 200 ఏళ్ల క్రితం ఏర్పాటైన ద్వీపం.. హోప్‌ ఐలాండ్‌. తాళ్లరేవు మండలం కోరింగ పంచాయతీ పరిధి అభయారణ్యంలో ఇదో భాగం.. కాకినాడ నగరానికి విపత్తుల నుంచి కాపాడే రక్షణ కవచం. పర్యాటకుల మదిని దోచే ఈ సుందర ప్రాంతానికి పర్యాటకులు ఒకప్పుడు పోటెత్తేవారు. ఇప్పుడా పరిస్థితిలేదు. పర్యాటకుల ఆశలపై వైకాపా ప్రభుత్వం నీళ్లు జల్లింది. కూటమి ప్రభుత్వ హయాంలో ఈ ద్వీపానికి కళ తేవాలని సందర్శకులు కోరుతున్నారు.

హోప్‌ ఐలాండ్‌ సందర్శనకు కాకినాడ పోర్టు నుంచి 35 మంది చొప్పున పర్యాటకులతో వెళ్లేందుకు మోటరైజ్డ్‌ బోటు సౌకర్యం ఉండేది. ఆంక్షలతో దీన్ని మూలన పడేశారు. కొత్త బోటుకు రూ.50 లక్షలు మంజూరు చేయాలని.. పర్యటనకు వీలుగా అటవీశాఖ, పోర్టు అనుమతులు ఇవ్వాలని పర్యాటక శాఖ నుంచి ఏళ్ల క్రితమే వైకాపా ప్రభుత్వానికి ప్రతిపాదన వెళ్లినా పక్కన పడేసింది.

కళ తప్పిన హోప్‌ ఐలాండ్‌ తీరం 

అటవీశాఖ ప్రతిపాదనా అదేతీరు

హోప్‌ ఐలాండ్‌ ప్రాంతాన్ని 1998లో వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం పరిధిలోకి తెచ్చారు. విభిన్న జీవరాశులున్న సీఆర్‌జెడ్‌ పరిధి కావడంతో అటవీ కార్యకలాపాలు మినహా మరేవీ అనుమతించకూడదన్న నిబంధన తెరమీదకు వచ్చింది. వీటికి విఘాతం కలగకుండా తాత్కాలిక పాకలు, సేదతీరేందుకు వీలుగా వసతులతో పర్యాటకులకు అనువైన వాతావరణం సృష్టించారు. పర్యాటక ప్రాంతంపై వైకాపా పాలకులు నీళ్లు జల్లారు. ఈ ప్రాంతాన్ని సామాజిక ఆధారిత పర్యావరణ పర్యాటక ప్రాంతం (సీబీఈటీ)గా మార్చాలన్న ప్రతిపాదనకూ  మోక్షం దక్కలేదు. నిధుల లేమితో ఎకో టూరిజం ప్రతిపాదన సైతం అటకెక్కింది.


పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు
- పసుపులేటి పోశయ్య, జిల్లా పర్యాటక - సాంస్కృతిక శాఖ అధికారి

పర్యాటక ప్రాంతంగా హోప్‌ ఐలాండ్‌ను అభివృద్ధి చేయాలన్నది పర్యాటక ప్రియుల ఆకాంక్ష. ఐలాండ్‌ పర్యాటక అభివృద్ధి దిశగా ప్రణాళికలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడి పరిస్థితిపై నివేదిక ఇచ్చాం. అంతర్జాతీయ ప్రమాణాలతో పూర్తి భద్రత నడుమ ఇక్కడ బోటు నడపాల్సి ఉంది. వాటర్‌ ఫ్లీట్‌ మేనేజ్‌మెంట్, అటవీశాఖ, పోర్టు అధికారుల అనుమతులు దక్కాకే ఈ సముద్ర ప్రయాణానికి ఆస్కారం ఉంటుంది. పీపీపీ పద్ధతిలో ఈ పర్యాటక పడవ ప్రయాణాన్ని పునరద్ధరించే ఆలోచన ఉంది. అటవీశాఖ ఆధ్వర్యంలో ఎకో టూరిజంగా అభివృద్ధి చేయాలన్న ప్రణాళిక ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని