logo

చంద్రన్న సంతకం.. జనమంత సంబరం

అన్నార్తుల ఆకలి తీర్చేలా.. అవ్వాతాతల మోములో ఆనందం రెట్టింపు అయ్యేలా.. అవకాశాలు యువత అందిపుచ్చుకునేలా.. ఆందోళన కలిగించిన భూ హక్కు చట్టం నుంచి ఊపిరి పీల్చుకునేలా.. సీఎం చంద్రబాబు చేసిన అయిదు సంతకాలతో ఉమ్మడి జిల్లావాసుల్లో కొత్త ఆశలు చిగురించాయి.

Published : 14 Jun 2024 05:28 IST

అయిదు హామీలు నెరవేర్చే చర్యలతో వెల్లివిరిసిన ఆనందం 
సీఎం నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలో రూ.కోట్లలో లబ్ధి
ఈనాడు, కాకినాడ, రాజమహేంద్రవరం

అన్నార్తుల ఆకలి తీర్చేలా.. అవ్వాతాతల మోములో ఆనందం రెట్టింపు అయ్యేలా.. అవకాశాలు యువత అందిపుచ్చుకునేలా.. ఆందోళన కలిగించిన భూ హక్కు చట్టం నుంచి ఊపిరి పీల్చుకునేలా.. సీఎం చంద్రబాబు చేసిన అయిదు సంతకాలతో ఉమ్మడి జిల్లావాసుల్లో కొత్త ఆశలు చిగురించాయి.  ప్రజల కష్టాలు తెలుసు.. సంపద సృష్టించడం తెలుసు.. సమస్యల పరిష్కారానికి మార్గాలూ తెలుసు.. అందుకే తెదేపా అధినేత చంద్రబాబు ఎన్నికల వేళ స్పష్టమైన హామీలు ఇచ్చారు. చారిత్రక విజయం అందుకున్నాక.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే కీలకమైన అయిదు దస్త్రాలపై సంతకాలు చేసి ప్రజల్లో ఆనందం నింపారు. 


డీఎస్సీతో జోష్‌

జిల్లాలో  1,600 నుంచి 1,800 పోస్టుల భర్తీ అయ్యే అవకాశం. జగన్‌ జమానాలో 106 పోస్టులకే పరిమితమైన డీఎస్సీ ప్రకటన

న్నికల హామీల్లో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీపై తొలి సంతకం చేస్తానన్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారు. 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ఫైల్‌పై సంతకం చేసి నిరుద్యోగులకు వరమిచ్చారు. 2018లో అప్పటి తెదేపా ప్రభుత్వ హయాంలో డీఎస్సీ నియామకాలు చేపట్టారు. వైకాపా ప్రభుత్వం అయిదేళ్లు నాన్చి అరకొర పోస్టులతో ప్రకటన ఇచ్చి నిరుద్యోగుల ఆశలపై నీళ్లుచల్లింది.

గన్‌ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 6,100 పోస్టులతో ప్రకటించిన కంటితుడుపు డీఎస్సీ ఇచ్చారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలకు 392 పోస్టులు కేటాయించగా సెకెండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎస్‌జీటీ) పోస్టులు 108 మాత్రమే ఉండగా వీటిలో గిరిజన ప్రాంతానికి చెందిన ఖాళీలే అధికం. జగన్‌ ఏటా డీఎస్పీ ప్రకటిస్తారనే ఉద్దేశంతో అయిదేళ్లుగా అభ్యర్థులు శిక్షణ కేంద్రాలకు వెళ్తూ, వసతి గృహాల్లో ఉంటూ రూ.లక్షల్లో ఖర్చు చేసి సిద్ధపడితే వారి ఆశలపై నీళ్లు చల్లారు. సిలబస్‌పైనా స్పష్టత ఇవ్వకపోవడంతో అంతా తీవ్ర గందరగోళానికి గురయ్యారు.
రాష్ట్రంలో 16,317 పోస్టులతో చంద్రబాబు మెగా డీఎస్సీ ప్రకటనకు సిద్ధమవడంతో ఉమ్మడి జిల్లాలో డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సుమారు 50 వేల నుంచి 60 వేల మంది అభ్యర్థులు ఉపాధ్యాయ నియామక పరీక్షకు సిద్ధమవుతున్నారు. వీరందరిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని డీఎస్సీ శిక్షణ సంస్థల వద్ద సందడి  వాతావారణం నెలకొంది.


అడ్డగోలు చట్టానికి అడ్డుకట్ట

కాకినాడ జిల్లాలో  1.37 లక్షల హెకార్లు. తూర్పుగోదావరి జిల్లాలో 1.51 లక్షల హెకార్లు... అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో  1.34 లక్షల హెక్టార్లు సాగు భూములు ఉన్నాయి. వైకాపా ప్రభుత్వం  తెచ్చిన చట్టం అమలైతే ఉన్న భూములూ కోల్పోవాల్సి వస్తుందన్న రైతుల భయాందోళనకు కూటమి ప్రభుత్వ నిర్ణయంతో తెరపడినట్లే.

ఆంధ్రప్రదేశ్‌ భూ యాజమాన్య హక్కు చట్టం(ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌- 2023)ను గతేడాది అక్టోబర్‌ 31 నుంచి వైకాపా ప్రభుత్వం అమల్లోకి తెస్తూ.. 512 జీవోను జారీచేసింది. ఈ చట్టంతో భూ యజమానులు, కొనుగోలుదారులు భూమి హక్కులపై భరోసా కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురయ్యిందనే ఆందోళన వ్యక్తమయ్యింది.  ఉమ్మడి జిల్లాలో 1,685 గ్రామాల్లో 2.70 లక్షల ఎకరాల్లో సర్వే చేయాలని వైకాపా ప్రభుత్వం నిర్ణయించి దశల వారీ ప్రక్రియ ప్రారంభించింది. ఈ క్రమంలోనే పలు అభ్యంతరాలు తెరమీదకు వచ్చినా పరిష్కారం చూపలేదు. భూముల రీసర్వే పూర్తయితే ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారీతిన వైకాపా నాయకులు భూ హక్కులను హరిస్తారన్న ఆందోళన సర్వత్రా వ్యక్తయ్యింది. అధికారంలోకి వస్తే వివాదాస్పద చట్టాన్ని రద్దుచేస్తామని కూటమి అగ్రనేతలు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ భరోసా ఇచ్చారు. తాజాగా ఈ దస్త్రంపై చంద్రబాబు సంతకం చేశారు.


అన్న క్యాంటీన్‌.. పేదోడికి పట్టెడన్నం

ఉమ్మడి జిల్లాలో 54 లక్షల మంది జనాభా ఉన్నారు. వీరిలో పూటగడవని పేదలెందరో. ముఖ్యమంత్రి చంద్రబాబు తాజా నిర్ణయంతో అన్న క్యాంటీన్లు తెరుచుకుంటే తక్కువ ధరకే వేలాదిమంది ఆకలి తీరుతుంది.

న్న క్యాంటీన్లను తెదేపా ప్రభుత్వం 2018లో ఏర్పాటుచేసింది. రూ.5కే అల్పాహారం, భోజనం అందించే ఈ ఆహార శాలలు   పేదల ఆకలి తీర్చాయి. దుకాణాల్లో పనిచేసే చిరుద్యోగులు, పోటీపరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులు.. చిన్నచిన్న పనులు చేసుకునే కార్మికులు.. అన్న క్యాంటీన్లను ఆశ్రయంచేవారు. తెదేపా ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించి లక్షల మంది ఆకలి తీర్చిన ఈ క్యాంటీన్లను వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కక్షకట్టి 2019 ఆగస్టు 1న మూసేసింది.  కాకినాడలో అయిదు, రాజమహేంద్రవరంలో మూడు, తుని, పిఠాపురం, పెద్దాపురం,   ఏలేశ్వరం, సామర్లకోట, ముమ్మిడివరం, రామచంద్రపురం, మండపేట, నిడదవోలు, కొవ్వూరులలో ఒక్కొక్క క్యాంటీన్‌ అప్పట్లో నడిచేవి. 


నవతరానికి నైపుణ్యం

ఉమ్మడి జిల్లాలో 17 లక్షల మంది యువత ఉన్నారు. వీరంతా నైపుణ్యాలు పెంచుకుంటే ఉద్యోగాలకు, ఉపాధికి ఢోకా ఉండదు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో 32,129 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. 

మ్మడి జిల్లాలో వనరులు, అవకాశాలకు కొదవలేదు. ఇక్కడి వనరులకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తే లక్షల మంది యువత జీవితాలకు భరోసా దక్కినట్లే. ఉమ్మడి జిల్లాలో పదో తరగతి పూర్తిచేసిన వారు ఏటా 60 వేల నుంచి 70 వేల మంది ఉంటున్నారు. డిగ్రీ, వృత్తివిద్య, విశ్వవిద్యాలయాలు, ఇంజిజినీరింగ్, వైద్య కళాశాలల్లో చదువు పూర్తిచేసినవారు.. వివిధ పోస్టులకు తర్ఫీదు పొందుతున్నవారు వేల సంఖ్యలో ఉన్నారు. వీరిలో చాలా మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కకపోవడానికి నైపుణ్య లేమి ప్రధాన కారణం. వీరిలో నైపుణ్యాలు గుర్తించి తగిన శిక్షణ ఇప్పించడం ద్వారా నిరుద్యోగులను తగ్గించాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఎన్నికల హామీలో భాగంగా ఈ దస్త్రంపైనా సీఎం చంద్రబాబు సంతకం చేశారు. దీంతో నిరుద్యోగ యువత భవితకు భరోసా దక్కినట్లయ్యింది.


పింఛను పెరిగింది.. మోము మురిసింది

ఉమ్మడి జిల్లాలో 7.68 లక్షల మంది పింఛనుదారులు అదనపు లబ్ధి పొందనున్నారు.. కాకినాడ జిల్లాలోని 620 సచివాలయాల పరిధిలో 2,80,662 మంది, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 515 సచివాలయాల పరిధిలో 2,44,772 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 512 సచివాలయాల పరిధిలో 2,43,077 మంది పింఛనుదారులు ఉన్నారు. 

వైకాపా ప్రభుత్వం ఎన్నికల ముందు వృద్ధులు, అభాగ్యులకు పింఛను ఇవ్వడానికి నానా తిప్పలు పెట్టింది. అభాగ్యుల అవస్థలకు కూటమి ప్రభుత్వంలో తెరపడినట్లే. ఇంటికే తెచ్చి పింఛను సొమ్ము ఇచ్చే ఏర్పాటు చేయడం.. ఎన్నికల హామీలో భాగంగా పెంచిన పింఛను సొమ్ము చేతికి అందుతుందన్న కబురు లబ్ధిదారుల్లో ఆనందాన్ని నింపుతోంది. వృద్ధులు, వింతంతువులు, ఒంటరి మహిళలు, తదితరులకు  ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు రూ.వెయ్యి చొప్పున, జులై నెల పింఛను రూ.4 వేలు కలిపి.. మొత్తం రూ.7 వేలు జులై 1న అందజేస్తారు. దివ్యాంగులకు ఇదివరకు రూ.3వేలు పింఛను అందితే ఇకపై రూ.6 వేలు అందనుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని