logo

అమ్మా.. నన్ను క్షమించు

‘అమ్మా.. నన్ను క్షమించు. నా స్నేహితుడు శ్రీను.. వాళ్ల మావయ్య మోసం చేశాడు. రూ.35 లక్షలు ఇవ్వాలి.

Published : 16 Jun 2024 06:29 IST

వ్యాపారంలో మోసం చేశారంటూ యువకుడి బలవన్మరణం

శ్రీకాంత్‌ (పాతచిత్రం) 
రాజమహేంద్రవరం నేరవార్తలు: ‘అమ్మా.. నన్ను క్షమించు. నా స్నేహితుడు శ్రీను.. వాళ్ల మావయ్య మోసం చేశాడు. రూ.35 లక్షలు ఇవ్వాలి. రెండున్నరేళ్లుగా ఇవ్వట్లేదు. ఏం చేయాలో తెలియక, ఇలా చేస్తున్నా’ అంటూ ఓ యువకుడు లేఖ రాసి ఉరేసుకున్నాడు. డబ్బులు లేకపోతే సంపాదించుకోవచ్చు, నువ్వు వెళ్లిపోతే ఎలా.. అంటూ విగతజీవిగా ఉన్న కుమారుడిని చూసి ఆ కన్నతల్లి కన్నీరుమున్నీరు అయింది. సీఐ వి.సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు.. ఆల్కాట్‌తోట ప్రాంతానికి చెందిన గండూరి రేణుకాదేవి రాజమహేంద్రవరం రైల్వే ఎలక్ట్రికల్‌ మెయింటైనెన్స్‌ విభాగంలో అధికారిగా పనిచేస్తున్నారు. భర్త వెంకటేశ్వరరావు 15 ఏళ్ల కిందటే అనారోగ్యంతో మృతిచెందారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శ్రీకాంత్‌(30) తల్లితోనే ఉంటున్నారు. రెండో కొడుకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు.

శ్రీకాంత్‌ రాజమహేంద్రవరంలో కర్రి సూర్యనారాయణరెడ్డికి చెందిన పెట్రోల్‌ బంకులో కొంతకాలం మేనేజర్‌గా పనిచేశాడు. చిన్ననాటి స్నేహితుడు తాడి శ్రీనివాసరెడ్డి ద్వారానే అతని వద్ద పనికి కుదిరాడు. స్నేహితుల్దిరు కలసి జాతీయ రహదారిపైన, నగరంలోని పెట్రోల్, డీజిల్‌ లేక నిలిచిపోయిన వాహనదారులు ఫోన్‌ చేస్తే ఆయిల్‌ ఇచ్చే వ్యాపారాన్ని 2020లో ప్రారంభించారు. రెండేళ్లు వ్యాపారం సక్రమంగా సాగింది. లాభాలు వచ్చాయి. ఆ తర్వాత సూర్యనారాయణరెడ్డి కూడా అందులో భాగస్వామిగా చేరారు. పెట్టుబడి తాను పెడతానని, మీరు వ్యాపారం చేస్తే చాలని ఆ ఇద్దరితో అన్నారు. రెండేళ్ల లాభాన్ని తన వద్దే ఉంచమని, అంతా ఒకేసారి ఇస్తానని నమ్మబలికాడు. 2023 వరకు వారిద్దరూ అతడితో కలసి వ్యాపారం చేశారు. అప్పటి లెక్కల ప్రకారం.. ఇద్దరికీ చెరో రూ.35 లక్షలు ఇవ్వాల్సి ఉంది.

తన లాభాన్ని ఇవ్వమని శ్రీకాంత్‌ అడిగాడు. అదిగో.. ఇదిగో.. అంటూ సూర్యనారాయణరెడ్డి చెప్పడమే కానీ ఇవ్వలేదు. దీంతో శ్రీకాంత్‌ ఆ వ్యాపారం నుంచి తప్పుకొన్నాడు. రెండున్నరేళ్లుగా ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈనెల 14న రాత్రి ఇంటికెళ్లి తల్లి వద్ద కన్నీరు పెట్టుకున్నాడు. పెద్ద మొత్తంలో డబ్బు రావాలని, వస్తే తమ్ముడితో వ్యాపారం చేస్తానని అన్నాడు. శనివారం ఉదయం తల్లి విధులకు వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న శ్రీకాంత్‌ స్నేహితుడు శ్రీనుకు ఫోన్‌ చేసి తాను చనిపోతున్నట్లు చెప్పాడు. అతడు వచ్చేసరికి చీరతో ఫ్యానుకు ఉరేసుకున్నాడు. మృతుడు రాసిన లేఖను ఘటన స్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు