logo

పోలవరానికి పునరంకితం

‘పోలవరం ఆంధ్రుల జీవనాడి..దీని ద్వారా నదులను అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీరివ్వాలన్న లక్ష్యంతో నిరంతరం పని చేస్తా..ప్రాజెక్టు నాకు ప్రాణంతో సమానం’ అంటూ సీఎం చంద్రబాబు ఉద్ఘాటించడంతో పోలవరానికి పూర్వవైభవం రానుందని రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

Updated : 18 Jun 2024 04:44 IST

పూర్తి చేసి ప్రతి ఎకరాకూ నీరివ్వడమే లక్ష్యం
ప్రాజెక్టు సందర్శనలో సీఎం చంద్రబాబు
అణువణువూ పరిశీలన.. అధికారులతో చర్చలు

గైడుబండ్‌ను  వీక్షిస్తున్న సీఎం చంద్రబాబు

ఈనాడు, ఏలూరు, న్యూస్‌టుడే-పోలవరం, కొయ్యలగూడెం గ్రామీణం, జంగారెడ్డిగూడెం పట్టణం: ‘పోలవరం ఆంధ్రుల జీవనాడి..దీని ద్వారా నదులను అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీరివ్వాలన్న లక్ష్యంతో నిరంతరం పని చేస్తా..ప్రాజెక్టు నాకు ప్రాణంతో సమానం’ అంటూ సీఎం చంద్రబాబు ఉద్ఘాటించడంతో పోలవరానికి పూర్వవైభవం రానుందని రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం సోమవారం పోలవరంలో మొట్టమొదటి క్షేత్ర పర్యటన చేశారు. ప్రాజెక్టును పరిశీలించి.. నిర్మాణంపై విస్తృత స్థాయిలో అధికారులతో సమీక్షించారు.

సోమవారం ఉదయం 11.45 గంటలకు ప్రాజెక్టు హిల్‌వ్యూ కొండపై ఉన్న హెలిప్యాడ్‌ వద్దకు సీఎం చేరుకున్నారు. ముందుగా ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాలను విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. అనంతరం హెలిప్యాడ్‌ వద్ద జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, తెదేపా, జనసేన నాయకులు చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. కాలినడకన కొండపై ఉన్న వేదిక వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి అక్కడి పనుల గురించి ప్రాజెక్టు సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు వివరించారు.  మధ్యాహ్నం 12.15 గంటలకు బయలుదేరి స్పిల్‌వే మీదకు 12.30 గంటలకు చేరుకున్నారు. అక్కడి పనుల గురించి ఛాయాచిత్ర ప్రదర్శన ద్వారా ఈఈ కె.బాలకృష్ణ సీఎంకు వివరించారు. అనంతరం గైడ్‌బండ్‌ వద్దకు 12.45కు చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడి పరిస్థితిపై అధికారులను ప్రశ్నించారు. గ్యాప్‌-3 వద్దకు చేరుకుని పనులను పరిశీలించారు. ఎగువ కాఫర్‌డ్యాంపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను పరిశీలించిన సీఎం అక్కడి నుంచి డయాఫ్రంవాల్‌ నిర్మాణప్రాంతంలో జరుగుతున్న ఇసుకను గట్టి పర్చే పనులను పరిశీలించారు. అధికారులను ఆరా తీశారు. అనంతరం జలవిద్యుత్తు కేంద్రం వద్ద సాగుతున్న పనులను బస్సులో నుంచే పరిశీలించి మధ్యాహ్నం 1.55 గంటలకు ప్రాజెక్టు క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.

పోలవరం ప్రాజెక్టు గేట్లను వీక్షిస్తున్న సీఎం చంద్రబాబు, చిత్రంలో మంత్రి పార్థసారథి,
ఎంపీ మహేశ్‌ యాదవ్, ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, ఆరిమిల్లి రాధాకృష్ణ, మాజీ మంత్రి జవహర్‌ తదితరులు  

ఆరా తీసి.. ప్రశ్నించి.. సుమారు నాలుగు గంటలసేపు సాగిన తన పర్యటనలో ప్రాజెక్టు నిర్మాణంలోని కీలకమైన పలుప్రాంతాలను సీఎం చంద్రబాబు నిశితంగా పరిశీలించారు. స్పిల్‌వేలో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనలో కొన్ని పనుల గురించి సమగ్ర వివరాలను పొందుపర్చకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. డయాఫ్రం వాల్‌కు జరిగిన నష్టం గురించి ఆరా తీశారు.

డయాఫ్రంవాల్‌ను పరిశీలిస్తూ..

చిగురిస్తున్న ఆశలు.. గత తెదేపా పాలనలో చంద్రబాబు 30 సార్లు పోలవరంలో పర్యటించి ప్రాజెక్టు నిర్మాణాన్ని పరుగులు పెట్టించారు. దాదాపు 100 సార్లు అధికారులతో సమీక్షలు నిర్వహించారు. అయిదేళ్ల పాలనలో 72 శాతం పనులు పూర్తి చేశారు. రైతులను, రాష్ట్ర ప్రజలను పోలవరం తీసుకొచ్చి ప్రగతిని చూపించారు. వైకాపా పాలనలో ప్రాజెక్టు పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నాయి. మళ్లీ కూటమి ప్రభుత్వం రావటంతో సోమవారం-పోలవరం కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాజెక్టు పనులు వేగవంతం చేయనున్నారు. ఈ పరిణామంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

ప్రాజెక్టు చెంత సీఎం వాహనాల శ్రేణి 

ప్రతి చోటా ఛాయాచిత్ర ప్రదర్శన.. పర్యటనలో ప్రాజెక్టుకు సంబంధించిన స్పిల్‌వే, గైడ్‌బండ్, గ్యాప్, 2, 3, డయాఫ్రం వాల్, కాఫర్‌డ్యాం ఇలా ఆరు ప్రధాన విభాగాలను చంద్రబాబు పరిశీలించారు. ఆయన వెళ్లిన ప్రతి చోటా ఆ విభాగానికి సంబంధించిన ఛాయాచిత్రాలు, డయాగ్రామ్, మ్యాపులతో అధికారులు చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రతి చోటా వాటిని తిలకించిన సీఎం అధికారులను అడిగి సందేహాలు నివృత్తి చేసుకున్నారు. 

  అధికారులతో సమీక్షిస్తున్న చంద్రబాబు, చిత్రంలో మంత్రులు రామానాయుడు, పార్థసారథి, కందుల దుర్గేశ్‌ తదితరులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు