logo

వైకాపా బడాయి.. రైతన్నకు బకాయి..

అన్నదాతలకు సాగుకోసం అవసరమైన అన్ని వసతులు కల్పించామని, వారు పండించిన ప్రతి గింజకు మద్దతు ధర కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గొప్పలు చెప్పిన వైకాపా సర్కారు రైతులు అమ్మిన ధాన్యానికి సొమ్ము చెల్లించకుండా కాలయాపన చేసి చాపచుట్టేసింది.

Published : 18 Jun 2024 04:18 IST

అల్లవరంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్న సిబ్బంది

అన్నదాతలకు సాగుకోసం అవసరమైన అన్ని వసతులు కల్పించామని, వారు పండించిన ప్రతి గింజకు మద్దతు ధర కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గొప్పలు చెప్పిన వైకాపా సర్కారు రైతులు అమ్మిన ధాన్యానికి సొమ్ము చెల్లించకుండా కాలయాపన చేసి చాపచుట్టేసింది. దీంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం అమ్మిన తమకు సొమ్ము అందక ఖరీఫ్‌ పంటకు పెట్టుబడి దొరక్క.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే పలుచోట్ల ఖరీఫ్‌ పనులు ఊపందుకోగా సొమ్మురాని కొంతమంది కౌలు రైతులు నిరాశగా చేలవైపు బేలచూపులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. 

న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్‌: జిల్లాలోని 22 మండలాల పరిధిలో 2023-24 రబీ సీజన్‌కు సంబంధించి 1.69 లక్షల ఎకరాల్లో 1.07 లక్షల మంది రైతులు వరి సాగు చేశారు. సుమారు 7.74 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. బహిరంగ మార్కెట్‌లో అమ్మకాలు సాగించగా పోను.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా 2.26 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. అధికారులు కేవలం  1.62 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే సేకరించి మమ అనిపించేశారు. సేకరించిన ధాన్యం విలువ రూ.355.84 కోట్లుకాగా ఇప్పటివరకు రైతులకు కేవలం రూ.84.74 కోట్లు మాత్రమే చెల్లించి వైకాపా ప్రభుత్వం చేతులెత్తేసింది. ఇంకా జిల్లాలో సుమారు 23 వేల మంది అన్నదాతలకు రూ.271.37 కోట్ల ధాన్యం సొమ్ము చెల్లించాల్సి ఉంది. వైకాపా ప్రభుత్వం ఏప్రిల్‌ 25వ తేదీ వరకు అరకొరగా కొంత మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేసింది. తరువాత నుంచి నిధుల విడుదలను పూర్తిగా నిలుపుదల చేసింది.

ముందుకు సాగని ఖరీఫ్‌ పనులు..

ధాన్యం సొమ్ము అందకపోవడంతో అన్నదాతలు ఖరీఫ్‌ సాగుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో వరి సాగుచేసే వారిలో 80 శాతానికిపైగా కౌలు రైతులే ఉన్నారు. వీరు ఏటా ఆయా సీజన్లలో అప్పులు చేసి సాగు పనులు చేపడుతుంటారు. రబీ ధాన్యానికి సంబంధించి సొమ్ము అందని రైతులు ఖరీఫ్‌ సాగుకు అవసరమైన విత్తనాల కొనుగోలుకు ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు. రబీ పంటకు చేసిన అప్పులు తీర్చకపోవడంతో ప్రస్తుతం ఖరీఫ్‌కు ఎవరూ అప్పు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నారుమళ్లు పోసేందుకు విత్తనాలు కొనుగోలు చేయలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. మరోవైపు కాలువలకు నీరు వదలడంతో తోటి రైతులు ఖరీఫ్‌ పనులు ముమ్మరంగా చేస్తుంటే ధాన్యం సొమ్ము అందనివారు పడుతున్న వేదన వర్ణనాతీతం.

చేతులెత్తేసిన జగన్‌ సర్కారు..

ఈ సంవత్సరం సార్వత్రిక ఎన్నికల నియమావళి అమల్లో ఉందనుకున్నా.. గడిచిన నాలుగున్నరేళ్ల్లలో 9 సీజన్లకు సంబంధించి కూడా రైతులకు సమయానికి ధాన్యం సొమ్ము విడుదల చేసిన సందర్భం లేదు. ప్రతి సీజన్‌లోనూ రైతులు తాము కష్టపడి పండించిన పంటకు డబ్బులు చెల్లించాలని ధర్నాలు, నిరసనలు చేస్తేకానీ వైకాపా ప్రభుత్వం నుంచి స్పందన వచ్చేది కాదు. చివరి సంవత్సరం రబీ సీజన్‌లో రైతులకు రూ.271.31 కోట్లు చెల్లించకుండా తాత్సారం చేశారు. నిధుల కొరతతో ఇబ్బందిపడే ఇలాంటి పరిస్థితులు కొత్త ప్రభుత్వంపై మరింత ఆర్థిక భారం మోపనున్నాయి. నూతన ప్రభుత్వం తమ సొమ్మును సర్దుబాటు చేసి తక్షణం చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు కోరుకుంటున్నారు.

వారం రోజుల్లో జమవుతాయి

జిల్లాలో రైతులకు రూ.272 కోట్ల మేర ధాన్యం సొమ్ము రావాల్సిఉంది. సమస్యను ఉన్నతాధికారులకు నివేదించాం. ఇటీవలే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినందున వారం రోజుల్లోగా ప్రతి రైతుకు నిధులు విడుదల చేసేవిధంగా చర్యలు చేపడతాం. ఖరీఫ్‌ సాగుకు రైతులు ఇబ్బందిపడకుండా చూస్తాం.

- ఎల్లారావు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని