logo

మాజీ మంత్రి వేణు ఆధ్వర్యంలో..భీమేశ్వరాలయంలో భారీగా అవినీతి

రాష్ట్ర మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో ద్రాక్షారామ భీమేశ్వరాయంలో భారీగా అవినీతి చోటుచేసుకుందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ ఆరోపించారు. ఇందుకు సహకరించిన ఏ ఒక్కరూ ఆలయంలో ఉండరని ఆయన హెచ్చరించారు.

Published : 18 Jun 2024 04:19 IST

రాష్ట్ర కార్మికశాఖ మంత్రి సుభాష్‌ ఆరోపణ
సహకరించిన ఏ ఒక్కరూ గుడిలో ఉండరని హెచ్చరిక

మాట్లాడుతున్న మంత్రి వాసంశెట్టి సుభాష్‌ 

ద్రాక్షారామ: రాష్ట్ర మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో ద్రాక్షారామ భీమేశ్వరాయంలో భారీగా అవినీతి చోటుచేసుకుందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ ఆరోపించారు. ఇందుకు సహకరించిన ఏ ఒక్కరూ ఆలయంలో ఉండరని ఆయన హెచ్చరించారు. ద్రాక్షారామలోని మాధవానంద కల్యాణ మండపంలో సోమవారం సుభాష్‌ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనకు దండలు వేయడానికి వైకాపా వాళ్లు ముందుంటున్నారని, వారు ఎన్ని దండలు వేసినా దగ్గరకు చేరనిచ్చేది లేదన్నారు. కొందరు స్వార్థ్ధ రాజకీయ నాయకులు ద్రాక్షారామను పాలించారని, ఆ సమయంలో ఆలయ భూములను 39, 99 ఏళ్లకు లీజుకు రాయించుకొని కాంప్లెక్సులు కట్టుకున్నారని, వారేమైనా కూటికి లేనివారా అని ప్రశ్నించారు. గతంలో తెదేపా, జనసేన కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు ఉన్నచోట ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వలేదన్నారు. పక్కా భవనాలు ఉన్నవారే కొందరు ఇళ్లపట్టాలు పొందారని అనర్హులను గుర్తించి రద్దు చేయిస్తామన్నారు. ఈ అయిదేళ్లలో అవినీతికి పాల్పడిన ఏ ఒక్క వైకాపా నాయకుడికి నిద్రపట్టకుండా చేస్తామన్నారు. వైకాపా కార్యకర్తలకు క్రమశిక్షణ ఉందని ఇటీవల ఎంపీ బోస్‌ పేర్కొన్నారని.. వాస్తవానికి ఆయనకు క్రమశిక్షణ ఉన్నా, కార్యకర్తలకు మాత్రం లేదన్నారు. అంబేడ్కర్‌ విగ్రహానికి అవమానం జరిగిన ఘటనే అందుకు నిదర్శనమన్నారు. దేశంలోనే పేరెన్నికగన్న పుణ్యక్షేత్రం ద్రాక్షారామ అని, ఇక్కడి నుంచి ఆవుల రవాణా జరుగుతోందన్నారు. ఇందుకు కారకులు ఎవరైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నియోజకవర్గంలో గంజాయి అమ్ముతున్న 120 మంది పేర్లు తన దగ్గర ఉన్నాయని.. వారంతా వెంటనే దుకాణం సర్దేయకపోతే తగిన చర్యలు తప్పవన్నారు. అనంతరం కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ కేకు కోసి నాయకులకు తినిపించారు. కార్యక్రమంలో గంధం పల్లంరాజు, రాయపురెడ్డి రాజా, రేవు శ్రీను, పోలిశెట్టి చంద్రశేఖర్, దొంగల శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని