logo

అయిదేళ్లూ.. దోచేశారు

వైకాపా అయిదేళ్లపాలనలో అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఇసుక, మట్టి తవ్వకాల్లో చేసిన అవినీతిదందా అంతా ఇంతాకాదు... ‘ఈనాడు’ పలు కథనాల ద్వారా అక్రమ వ్యవహారాలను వెలుగులోకి తెచ్చినా కిందిస్థాయి నుంచి ఉన్నతస్థాయి అధికారి వరకు స్పందించిన పాపాన పోలేదు.

Published : 18 Jun 2024 04:21 IST

మొండెపులంక వద్ద అక్రమ తవ్వకాలు (పాత చిత్రం)

న్యూస్‌టుడే, పి.గన్నవరం, అంబాజీపేట: వైకాపా అయిదేళ్లపాలనలో అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఇసుక, మట్టి తవ్వకాల్లో చేసిన అవినీతిదందా అంతా ఇంతాకాదు... ‘ఈనాడు’ పలు కథనాల ద్వారా అక్రమ వ్యవహారాలను వెలుగులోకి తెచ్చినా కిందిస్థాయి నుంచి ఉన్నతస్థాయి అధికారి వరకు స్పందించిన పాపాన పోలేదు. గ్రామస్థాయి వైకాపా నాయకుడి నుంచి ప్రజాప్రతినిధుల మాటకు విలువ ఇచ్చి అక్రమ తవ్వకాలను ప్రోత్సహించిన తీరు అంతాఇంతా కాదు. జిల్లాలో ఆత్రేయపురం, రావులపాలెం, పి.గన్నవరం, కొత్తపేట, మలికిపురం, సఖినేటిపల్లి, అయినవిల్లి తదితర మండలాల్లో గోదావరి, సముద్రతీరాల్లో అక్రమ తవ్వకాలపేరిట రూ.కోట్లలో ప్రజాధనాన్ని వైకాపా నాయకులు కొల్లగొట్టారు. పి.గన్నవరం మండలం ఊడిమూడిలంక, వై.వి.పాలెం ఏటిగట్టుదిగువ, లంకలగన్నవరం, మొండెపులంక, కందాలపాలెం, శివాయిలంక, మానేపల్లి గ్రామాల పరిధిలో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఇసుక, లంక మట్టిని నిత్యం వందలాది టిప్పర్లలో తరలించేసి విక్రయించారు. ఇదేం అన్యాయమంటూ ఎవరైనా అడ్డుపడితే జాతీయరహదారి పనులు లేకపోతే పలానా ప్రాంతాల్లో జగనన్న లేఅవుట్‌ల మెరక పనులకోసం తరలిస్తున్నామంటూ పాలకులు, కొంతమంది అధికారులు చెప్పుకొచ్చేవారు. అడ్డుపడితే పోలీసు కేసులు పెడతామంటూ బెదిరించారు. మొండెపులంక, కందాలపాలెం, శివాయిలంక, మానేపల్లి ప్రాంతాల్లో దళితులకు తెలియకుండా వారి భూముల్లో అక్రమార్కులు ప్రవేశించి వందలాది టిప్పర్లలో ఇసుక, లంకమట్టిని కాజేశారు. ఈ ప్రాంతాల్లో దళితులు అడ్డుపడినా వారి మొర కనీసం ఆలకించలేదు. అడ్డుతప్పుకోకపోతే కేసులు తప్పవంటూ బెదిరించారు. 

ఎన్నికల కోడ్‌ వచ్చిన తరువాత కూడా అక్రమ తవ్వకాలను అధికార యంత్రాంగం ప్రోత్సహించింది. ఒక అధికారి పైనుంచి చక్రం తిప్పుతూ కిందిస్థాయి అధికారులు కదలకుండా వారి చేతులు, కాళ్లు కట్టేశారు.  జిల్లాలో ఎక్కువగా ఇసుక ర్యాంపులు ఉన్నాయి. ఆయా ఇసుక ర్యాంపుల్లో అడ్డగోలుగా తవ్వేసిన అక్రమార్కులు స్థానికులకు దానిని దక్కకుండా చేశారు. ఒక వేళ కావాలంటే అధిక ధరకు కొనుక్కోవాల్సిన దుస్థితి గడిచిన అయిదేళ్లకాలంలో ఏర్పడిందని ప్రజలు వాపోతున్నారు.

జాతీయ రహదారి పనులకు వెళ్లింది..

మండలంలో తవ్విన లంక మట్టి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జాతీయ రహదారి పనులకు వెళ్లింది. ఎన్నికల కోడ్‌ వచ్చిన కొద్ది రోజులకు ఈ తవ్వకాలు అపేశాం. ప్రస్తుతం తవ్వకాలు జరగడం లేదు.

- షేక్‌ హుస్సేన్, తహసీల్దారు, పి.గన్నవరం 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని