logo

పేదోడి పేరు చెప్పి.. పెద్దలు దోచేశారు

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం పేరుతో పేదోడి పేరు చెప్పి వైకాపా పెద్దలు భారీగా అవినీతికి పాల్పడ్డారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అరోపించారు.

Published : 18 Jun 2024 04:24 IST

న్యాయ విచారణ జరిపి సొమ్ము కక్కిస్తాం
కాకినాడ నగర ఎమ్మెల్యే కొండబాబు

కొమరగిరిలో జగనన్న లేఅవుట్‌ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే 

కొత్తపల్లి, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం పేరుతో పేదోడి పేరు చెప్పి వైకాపా పెద్దలు భారీగా అవినీతికి పాల్పడ్డారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అరోపించారు. సోమవారం యు.కొత్తపల్లి మండలంలోని కొమరగిరి జగనన్న లేఅవుట్‌ను ఆయన పరిశీలించారు. లబ్ధిదారులు తమ సమస్యలను ఆయనకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే వనమాడి మాట్లాడుతూ.. కాకినాడ అర్బన్‌కు చెందిన లబ్ధిదారుల కోసం యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో భూసేకరణ చేసినట్లు చెప్పారు. 350 ఎకరాల భూమిని సేకరించి 16 వేల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చారన్నారు. ఈ నాలుగేళ్లలో కేవలం 250 మంది మాత్రమే గృహాలు నిర్మించుకున్నారని.. సముద్ర తీరాన్ని ఇళ్లస్థలాలకు ఇచ్చి లబ్ధిదారులతో బలవంతపు నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. లేఅవుట్‌ అభివృద్ధికి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో గృహనిర్మాణ శాఖ పీడీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

ద్వారంపూడి రూ. వందల కోట్లు తినేశారు

ద్వారంపూడిపై వనమాడి తీవ్ర ఆరోపణలు చేశారు. పేదోడి ఇళ్లస్థలాల కోసం కాకినాడకు 16 కిలోమీటర్ల దూరంలో సముద్రం ఒడ్డున భూమిని సేకరించి.. మెరక చేయడం కోసమని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి రూ.66 కోట్ల సొమ్ము కాజేశారన్నారు. పక్కనే సాగరమాల ప్రాజెక్టులో భాగంగా రహదారి విస్తరణ కోసం ఎకరాకు రూ.20 లక్షలు రైతులకు చెల్లించి భూమిని కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఇక్కడ అదే భూమిని ఇళ్లస్థలాల పేరుతో ఎకరాకు రూ.45 లక్షల పైబడి వెచ్చించి ఎందుకు కొనుగోలు చేశారని ప్రశ్నించారు. కొమరగిరి లేఅవుట్‌ పేరుతో భూముల కొనుగోలు, మెరక పనులు చూపిస్తూ ద్వారంపూడి వందల కోట్ల ప్రభుత్వ సొమ్మును కాజేశారన్నారు. ఆ దోపిడీకి సంబంధించిన సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని.. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. న్యాయపరమైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు.. సొమ్మును కట్టించి లేఅవుట్‌ అభివృద్ధికి వినియోగిస్తామన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని