logo

పోలవరం గట్లకు అక్రమార్కుల తూట్లు

పోలవరం కాలువ గట్లను కొల్లగొడుతూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. సెలవుదినాలు, రాత్రివేళల్లో యథేచ్ఛగా గ్రావెల్‌ను తరలిస్తున్నారు. కళ్లెదుటే కాలువగట్లు మాయమవుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు.

Published : 18 Jun 2024 04:27 IST

అనుమతులు లేకుండా యథేచ్ఛగా మట్టి తరలింపు
ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి: రాత్రివేళల్లోనే తంతు

చెందుర్తి శివారు పోలవరం కాలువ గట్టు మట్టిని తవ్వుతున్న పొక్లెయిన్‌

పోలవరం కాలువ గట్లను కొల్లగొడుతూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. సెలవుదినాలు, రాత్రివేళల్లో యథేచ్ఛగా గ్రావెల్‌ను తరలిస్తున్నారు. కళ్లెదుటే కాలువగట్లు మాయమవుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామ శివారున పోలవరం కాలువ మట్టిని పొక్లెయిన్‌తో తవ్వి ట్రాక్టర్లపై తరలిస్తున్నారు. 

న్యూస్‌టుడే - గొల్లప్రోలు: పోలవరం, పుష్కర కాలువలను తవ్వినప్పుడు వచ్చిన గ్రావెల్, మట్టిని ఎత్తుగా గట్లుగా వేశారు. రైతుల పొలాలకు రక్షణగా ఉండేందుకు వీటిని ఏర్పాటుచేసి కాలువల్లోకి అధిక నీరు వచ్చిన సమయంలో పొలాలు ముంపునకు గురికాకుండా చర్యలు చేపట్టారు. కాలువ పనులు పూర్తయిన తరువాత గట్లను పూర్తిస్థాయిలో పటిష్ఠ పరిచే పనులు చేపట్టాలని భావించారు. ఈలోపే అక్రమార్కులు వాటిని తవ్వేస్తూ మట్టిని తరలించుకుపోతున్నారు. వైకాపా ప్రభుత్వంలో ఈ అక్రమ మట్టి తరలింపు పనులు యధేచ్ఛగా సాగాయి. కిలోమీటర్ల పొడవునా పుష్కర కాలువ గట్టు తవ్వి మట్టిని తరలించుకుపోగా.. ప్రస్తుతం పోలవరం కాలువపై వారి కన్ను పడింది.

జాతీయ రహదారే వరం

జాతీయ రహదారి పక్కనే ఉండటంతో పొక్లెయిన్‌తో కాలువగట్టును తవ్వి ట్రాక్టర్లపై అవసరమైన ప్రాంతాలకు మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఈ పనులు నిలిచిపోయాయి. ప్రభుత్వం మారిన నేపథ్యంలో అక్రమ మట్టి తవ్వకాలు, తరలింపు పనులు నిలిచిపోతాయని భావించినా గత వారం రోజులుగా ఇష్టారాజ్యంగా తోడేస్తుండటం కనిపిస్తోంది. ప్రైవేటు లేఅవుట్లలో ఈ మట్టికి మంచి డిమాండ్‌ ఉండటంతో దోపిడీదారులు ఆడిందే ఆటగా తయారైంది. రాత్రిపూట తవ్వకాలు, తరలింపు పనులు చేపట్టి తెల్లారేసరికి నిలిపివేస్తున్నారు. ముందురోజు ఉన్న గట్టులో కొంతభాగం మరునాడు చూసేసరికి మాయమవుతోంది. నిర్ణీత రుసుము చెల్లించి జలవనరులశాఖ, గనులశాఖ అధికారుల నుంచి అనుమతులు పొందాల్సి ఉన్నా ఆ దిశగా అడుగులు లేవు. 

కఠిన చర్యలు  చేపడతాం...

చెందుర్తి గ్రామ శివారులో పోలవరం కాలువగట్ల్ల మట్టిని తవ్వి తరలించే వారిపై కఠిన చర్యలు చేపడతాం. గత నాలుగునెలల కాలంలో మట్టి తవ్వి ట్రాక్టర్లపై తరలిస్తున్నట్లు అందిన సమాచారంతో 5 దఫాల్లో ట్రాక్టర్లను స్వాధీనపరుచుకుని పోలీసులకు అప్పగించాం. జిల్లా గనులశాఖ నిబంధనల మేరకు జరిమానాలు విధించాం. సోమవారం తెల్లవారుజామున రెండు ట్రాక్టర్లను మట్టిలోడుతో స్వాధీనపరుచుకున్నాం. అనుమతులు పొందకుండా మట్టి, గ్రావెల్‌ తవ్వకాలు నిర్వహిస్తే కఠిన చర్యలు చేపడతాం. చెందుర్తి శివారు పోలవరం కాలువ గట్ల మట్టిని తవ్వి తరలించకుండా రెవెన్యూ సిబ్బందితో పర్యవేక్షిస్తున్నాం. 

- ఉదయభాస్కరరావు, తహసీల్దారు, గొల్లప్రోలు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని