logo

అసంపూర్తి పనులతో పిట్‌ అప్పగింత

రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్‌లోని రెండవ నంబరు ప్లాట్‌ఫామ్‌ ఆధునికీకరణ పనులు పూర్తికాకుండానే సంబంధిత రైల్వే ఇంజినీరింగ్‌ అధికారులు పిట్‌ అప్పగించేశారు. రెండోసారి గడువు కూడా ముగిసినప్పటికీ ఇక్కడ పనులు అసంపూర్తిగానే మిగిలాయి.

Published : 18 Jun 2024 04:53 IST

రైల్వేస్టేషన్‌ అధికారుల అభ్యంతరంతో తర్జనభర్జన 

ప్రధాన రైల్వేస్టేషన్‌లోని రెండో ప్లాట్‌ఫామ్‌పై ఆగిన గూడ్స్‌ రైలు   

న్యూస్‌టుడే, వి.ఎల్‌.పురం (రాజమహేంద్రవరం) : రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్‌లోని రెండవ నంబరు ప్లాట్‌ఫామ్‌ ఆధునికీకరణ పనులు పూర్తికాకుండానే సంబంధిత రైల్వే ఇంజినీరింగ్‌ అధికారులు పిట్‌ అప్పగించేశారు. రెండోసారి గడువు కూడా ముగిసినప్పటికీ ఇక్కడ పనులు అసంపూర్తిగానే మిగిలాయి. ప్లాట్‌ఫామ్‌పై తవ్వేసి తొలగించిన టైల్స్‌ స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయకుండా ప్ల్లాట్‌ఫామ్‌ వెంబడి కొత్త రైలుట్రాక్‌ వరకు పూర్తిచేసి పిట్‌ అప్పగించడంపై ఇక్కడి స్టేషన్‌ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేవరకు దీనిపై ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నిలపలేమని స్పష్టం చేశారు. టైల్స్‌ పనులు జరగకుండా ఇసుక, కంకర గుట్టలతో ఉన్న ప్లాట్‌ఫామ్‌పై ఎక్స్‌ప్రెస్‌లను నిలిపితే ఇబ్బందులు ఎదురవుతాయని, ప్రయాణికులకు ఏమైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రసుత్తం రెండవ ప్లాట్‌ఫామ్‌లోకి గూడ్స్‌రైళ్ల వరకే అనుమతిస్తున్నారు. 

గడువు పొడిగించినా..

రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్‌లోని రెండవ నంబరు ప్లాట్‌ఫామ్‌ వెంబడి ఉన్న పట్టాలు(ట్రాక్‌) ఎప్పుడో ఏళ్లకిందట ఏర్పాటు చేసినవి కావడం.. కింద ఉండే సిమెంట్‌ దిమ్మలు దిగబడిపోయి పట్టాలు కదిలి సమస్యలు తలెత్తుతుండటం... తరచూ మరమ్మతులు చేయాల్సి వస్తుండటం.. తదితర కారణాల వల్ల వాటిని పూర్తిగా తొలగించి ఆధునికీకరించే పనులు రైల్వే ఇంజినీరింగ్‌ విభాగం పర్యవేక్షణలో చేపడుతున్న సంగతి తెలిసిందే. దీనివల్ల గత నెల 20 నుంచి రెండవ ప్లాట్‌ఫామ్‌ను పూర్తిగా మూసివేసి ఇక్కడ ఆగాల్సిన రైళ్లను మళ్లించి 1, 3, 4 ప్లాట్‌ఫామ్‌లపై నిలుపుతూ వస్తున్నారు. ఈ నెల 10వ తేదీతోనే పనులు పూర్తి కావాల్సి ఉండగా పాతట్రాక్‌ తొలగించి కొత్తవి ఏర్పాటు పనులు మాత్రమే పూర్తి చేయగలిగారు. ఇంకా 600 మీటర్ల మేర ప్లాట్‌ఫామ్‌పై తొలగించిన పాతటైల్స్‌ స్థానంలో కొత్తవి ఏర్పాటు పనులు మిగిలి ఉండటంతో ఈ నెల 16 వరకు గడువు పొడిగించారు. అయినప్పటికీ ఇంకా టైల్స్‌ పనులు పూర్తికాలేదు. 

ఇలాగైతే ఇబ్బందే...

రెండోసారి గడువు ముగుస్తుందనే కారణంతో ఇక్కడి రైల్వే ఇంజినీరింగ్‌ అధికారులు ట్రాక్‌ పిట్‌తో పాటు ప్లాట్‌ఫామ్‌ను కూడా ఆదివారం మధ్యాహ్నం నుంచే అప్పగించేసి చేతులు దులుపుకొన్నారు. ట్రాక్‌ ఆధునికీకరణ పనులు పూర్తయినందున రైళ్లను నిలుపుకునేందుకు ఇబ్బందేమీ ఉండదని రైల్వే ఇంజినీరింగ్‌ అధికారులు చెబుతుండగా రైల్వేస్టేషన్‌ మేనేజర్, ట్రాఫిక్‌ ఇతర అధికారులు విభేదించారు. ట్రాక్‌ పిట్‌ వరకు సరే.. ప్లాట్‌ఫామ్‌పై టైల్స్‌ పనులు పూర్తికాకుండా ఎక్స్‌ప్రెస్‌లు నిలిపితే ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని అనడంతో దీనిపై తర్జనభర్జన జరుగుతోంది. పనులు పూర్తి కాకుండా ప్లాట్‌ఫామ్‌ పిట్‌ అప్పగించిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారి ఆదేశాల మేరకు ప్రస్తుతానికి గూడ్స్‌రైళ్ల వరకే రెండో ప్లాట్‌ఫామ్‌పై నిలుపుతున్నారు. ఈ స్టేషన్‌ మీదుగా రోజూ 70 వరకు గూడ్స్‌ రైళ్లు నడుస్తుండగా ట్రాఫిక్‌ దృష్ట్యా ప్రస్తుతం వీటిలో రోజుకు 16 వరకు రెండవ ప్లాట్‌ఫామ్‌లోకి తీస్తున్నారు. టైల్స్, ఇతర పనులు పూర్తికాకుండా ఎక్స్‌ప్రెస్‌లను నిలిపితే ఇబ్బందేనని స్టేషన్‌ మేనేజర్‌ అంటున్నారు. ఇదే విషయాన్ని సంబంధిత ఇంజినీరింగ్‌ విభాగం అధికారులకు కూడా చెప్పామన్నారు. టైల్స్‌ పనులు పూర్తికావడానికి ఇంకా వారం రోజులు పడుతుందని రైల్వే ఇంజినీరింగ్‌ అధికారులు అంటున్నారు. అప్పటివరకు రెండో ప్లాట్‌ప్లామ్‌లో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు అనుమతించే పరిస్థితి లేదు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని