logo

నీరు రాదు.. నారు పడదు!

ప్రకృతి విపత్తులు.. వరదల నుంచి పంట కాలాన్ని ముందుకు తీసుకురావాలని కొన్నేళ్లుగా యంత్రాంగం చెబుతున్నా ఆ దిశగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు కనిపించడం లేదు. వైకాపా అయిదేళ్ల పాలనలో కాలువల నిర్వహణ ఊసేలేదు.

Published : 18 Jun 2024 05:00 IST

అయిదేళ్లూ కాలువల నిర్వహణ వదిలేసిన వైకాపా సర్కారు
రైతులకు ఏటా తప్పని అవస్థ

ఐ.పోలవరం మండలం కేశనకుర్రులో నీరు అందక పూర్తిగా దుక్కి దున్నకుండా ఉన్న నారుమడి 

ప్రకృతి విపత్తులు.. వరదల నుంచి పంట కాలాన్ని ముందుకు తీసుకురావాలని కొన్నేళ్లుగా యంత్రాంగం చెబుతున్నా ఆ దిశగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు కనిపించడం లేదు. వైకాపా అయిదేళ్ల పాలనలో కాలువల నిర్వహణ ఊసేలేదు. ఏటా జూన్‌ 1న నీరు వదిలేసి చేతులు దులుపుకొంటున్నారే తప్ప.. రైతులకు ఎంతమేరకు మేలు చేకూరుతుందనే అంశంపై దృష్టి సారించలేదు. గోదావరి జలాలు విడిచిపెట్టి సుమారు 17 రోజులు అవుతున్నా నేటికీ శివారుకు నీటి తడులు అందని దుస్థితి. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇప్పటికీ నారుమళ్లు పూర్తిస్థాయిలో వేసే పరిస్థితి లేదు. 

ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే, ముమ్మిడివరం : వైకాపా అయిదేళ్ల పాలనలో క్లోజర్‌ పనులను పట్టించుకోలేదు. దీంతో ప్రధాన పంట కాలువల నుంచి బ్రాంచి కాలువల వరకు నీరు సక్రమంగా పారక.. శివారుకు సకాలంలో జలాలు చేరడం లేదు. పూర్తిస్థాయి నీరు అందక రైతులు నారుమళ్లు వేయడం లేదు. ధవళేశ్వరం బ్యారేజీ పరిధిలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 2.22 లక్షల హెక్టార్ల ఆయకట్టు ఉంది. వీటిలో కాలువల శివారు ఆయకట్టు, ఎగువ భూములు సుమారు 49,600 హెక్టార్లున్నాయి. పూర్తిస్థాయిలో నీరు చేరితేనే ఇక్కడ సాగు జరుగుతుంది. జూన్‌ 1న కాలువలకు నీరు వదిలినా.. నారుమళ్లు వేసుకోవడానికి భూములకు నీరు అందడం లేదు. కాలువల్లో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోవడంతో రైతులు ఇంజిన్లు, చేతిగుళ్లల సాయంతో జలాలు తోడుకుని నారుమళ్లు వేసుకుంటున్నారు. 

పట్టించుకుంటేగా..

ఉమ్మడి జిల్లాలో ప్రధాన, చిన్న, పిల్లల కాలువలు 2,455 కిలో మీటర్లు విస్తరించి ఉన్నాయి. ప్రధాన పంట కాలువల నుంచి పిల్ల కాలువల వరకు తూడు, మట్టితో పూడుకుపోవడంతో సాగునీరు ముందుకు సాగకపోవడంతో శివారు ఆయకట్టుకు నీరు చేరడం లేదు. 

పిఠాపురం మండలం నరసింగిపురం మార్గంలో నీటి జాడ లేని ఏలేరు కాలువ

ఈ ప్రాంతాల్లో ఇబ్బందులు

కాకినాడ జిల్లాలో తాళ్లరేవు కరప, కాజులూరు నుంచి తొండంగి వరకు, కోనసీమ జిల్లాలో ఐ.పోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, మామిడికుదురు తదితర మండలాల్లో నీటి ఎద్దడి కారణంగా ఖరీఫ్‌ సాగుకు రైతులు ఇక్కట్లు పడుతున్నారు. 

వారంగా ఎదురుచూస్తున్నా..

కాలువలకు నీరు వదిలిన వారం రోజుల నుంచి నారుమడి వేయాలని.. చేనుకు నీరు పెట్టాలని ప్రతిరోజూ పొలానికి వెళ్తున్నా. ఇప్పటికీ చేలోకి నీరు రాలేదు. ఉపాధి హామీ పథకంలో పంట బోదెలను కొంత బాగుచేసినా.. కాలువలో పూర్తిగా నీరు వస్తేనే బోదెల్లోకి చేరుతుంది. కాలువ నీటిమట్టం పూర్తిగా తగ్గించేశారు. నీటి మట్టం పెంచితేనే నారుమళ్లు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

- సీహెచ్‌ సత్యనారాయణ, రైతు, ఐ.పోలవరం 

జలాలు విడిచిపెట్టినా..

పంట కాలువలకు నీటిని విడుదల చేసినా.. ముందస్తు సాగు ముందుకు సాగడంలేదు. ఉమ్మడి జిల్లాలో 6,01,443 ఎకరాల్లో ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం ఉంది. నాట్లు వేయడానికి 28,460 
ఎకరాల్లో  నారుమళ్లు వేయాల్సి ఉంది.

  • డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 1,200 ఎకరాల్లో మాత్రమే (15 శాతం) నారుమళ్లు పడ్డాయి.
  • కాకినాడ జిల్లాలో సుమారు 93 వేల హెక్టార్ల సాధారణ విస్తీర్ణం కాగా ఇప్పటి వరకు ఎక్కడా నారు వేసిన పరిస్థితి లేదు. 
  • తూర్పుగోదావరి జిల్లాలో 77,187 హెక్టార్ల సాగు విస్తీర్ణం కాగా 3,891 హెక్టార్లలో నారు వేయాల్సి ఉంది. ఇప్పటికి 1,089 హెక్టార్లలో వేయగా.. 45 హెక్టార్లలో వెదజల్లు విధానంలో సాగు చేపట్టారు. 

ఏలేరు తడారి... 

ఏలేరు ప్రాజెక్టు పరిధిలో 67 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. జలాశయంలో నీరు కనీన నిల్వ స్థాయిలో ఉండడంతో కాలువలకు విడిచిపెట్టే పరిస్థితి లేదు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ఇప్పుడు 3.55 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. మోటార్లతో ఎత్తిపోసి వైఎల్‌ఎంసీ ద్వారా 80 క్యూసెక్కులు విశాఖకు, విద్యుత్తు ఉత్పత్తికి 100 క్యూసెక్కులు మాత్రమే జలాలు విడిచి పెడుతున్నారు.

వారం రోజుల్లో పూర్తిస్థాయిలో...

జిల్లాలో 3,891 హెక్టార్లలో నారుమళ్లు వేయాల్సి ఉండగా 33 శాతం పూర్తయింది. మరో వారంలో 90 శాతానికి మించి అవుతుందని భావిస్తున్నాం. నిడదవోలు, ఉండ్రాజవరం, కోరుకొండ, గోకవరం, అనపర్తి, బిక్కవోలు పరిధిలో నీటి లభ్యత కొంత పెరిగితే అక్కడా వేగవంతం అవుతాయి. మిగతా ప్రాంతాల్లో బోర్లు ఉండడంతో ఇబ్బంది లేదు. రైతులు త్వరితగతిన నారు వేసేలా క్షేత్రస్థాయిలో చైతన్యం చేస్తున్నాం.

-రామారావు, జిల్లా వ్యవసాయ అధికారి, తూర్పుగోదావరి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని