logo

ఖరీఫ్‌ సాగు లక్ష్యం 1,65,900 ఎకరాలు..

పంట కాలువలకు జూన్‌ ఒకటో తేదీన సాగునీరు విడుదల చేశారు. కాగా పలుచోట్ల కాలువల్లోకి చేరింది.

Published : 19 Jun 2024 05:46 IST

జిల్లా వ్యవసాయాధికారి వి.బోసుబాబు ముఖాముఖి 
ముమ్మిడివరం, న్యూస్‌టుడే: పంట కాలువలకు జూన్‌ ఒకటో తేదీన సాగునీరు విడుదల చేశారు. కాగా పలుచోట్ల కాలువల్లోకి చేరింది. మరికొన్నిచోట్ల ఇంకా రాలేదు. సాగునీరు విడుదల చేసి 12 రోజులవుతున్నా.. ఖరీఫ్‌ సాగుకు రైతులు పూర్తి స్థాయిలో సన్నద్ధం కాని పరిస్థితి నెలకొంది. మరోవైపు వ్యవసాయశాఖ అధికారులు రైతులను ఖరీఫ్‌ సాగుకు సమాయత్తం చేయడానికి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి నారుమళ్లు పూర్తి చేసేలా రైతులను సన్నద్ధం చేస్తున్నామని అధికారులంటున్నారు. 2024-25 వ్యవసాయ సీజన్‌లో ఖరీఫ్‌ సాగు సమాయత్తంపై జిల్లా వ్యవసాయాధికారి వి.బోసుబాబు ‘న్యూస్‌టుడే’తో ముఖాముఖి మాట్లాడారు.
ప్రశ్న: జిల్లాలో ఖరీఫ్‌ సాగు విస్తీర్ణ లక్ష్యం ఎంత..?

వ్యవసాయాధికారి: కోనసీమ జిల్లాలో అమలాపురం, రాజోలు, కొత్తపేట, రామచంద్రపురం డివిజన్‌లలో 1,65,900 ఎకరాల్లో ఖరీఫ్‌ సాగు లక్ష్యంగా నిర్ధారించాం. సమాయత్తంపై జిల్లా అంతటా ఆర్‌బీకేల స్థాయిలో రైతులతో సమావేశాలు నిర్వహిస్తున్నాం.

ప్రతి సంవత్సరం ముందస్తు సాగు యత్నాలు ఫలించడం లేదు.?
ఖరీఫ్‌లో పంట చేతికొచ్చాక ప్రకృతి విపత్తుల బారినపడకుండా ఉండేందుకు ముందస్తు సాగు విధానం తీసుకువచ్చాం. జూన్‌ ఒకటో తేదీన పంట కాలువలకు నీరు వదులుతున్నారు. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని, తద్వారా సాగుకాలాన్ని ముందుకు తీసుకురావాలని సమావేశాల్లో వివరిస్తున్నాం. కొంతమంది ముందుకు వస్తున్నారు. నెమ్మదిగా అందరిలోనూ మార్పువస్తుంది. 
ఇప్పటివరకు చాలా తక్కువ విస్తీర్ణంలోనే నారుమళ్లు వేశారు..?
డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని మండపేట, కొత్తపేట, ఆలమూరు ప్రాంతాల్లో సుమారు 1200 ఎకరాల్లో రైతులు ఖరీఫ్‌ నారుమళ్లు వేశారు. 150కిపైగా ఎకరాల్లో వెదజల్లే పద్ధతిలో సాగు ప్రారంభించారు. అమలాపురం, రాజోలు డివిజన్‌లలో నారుమళ్లు అంతగా ప్రారంభించలేదు.
విత్తనాలకు ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఉందా..?
ఖరీఫ్‌ సీజన్‌కు జిల్లా రైతులకు 35 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరం. చాలా వరకు రైతులు స్థానికంగానే వీటిని సేకరించుకుంటారు. ప్రైవేటు డీలర్ల వద్దకూడా విత్తనాలు అందుబాటులోఉన్నాయి. జిల్లాలోని ఆర్‌బీకేల్లో 3000 క్వింటాళ్లు సిద్ధంగా ఉంచాం.
ఏటా ఖరీఫ్‌లో జిల్లాలో సీసీఆర్‌ కార్డులు అందరికీ అందడం లేదు.?
 జిల్లాలో గతేడాది 63 వేల మంది కౌలు రైతులకు సీసీఆర్‌ కార్డులు అందించాం. 2024-25 పంట కాలానికి 77 వేల సీసీఆర్‌ కార్డులు మంజూరు చేయాలనేది లక్ష్యంగా నిర్ణయించాం. ఆ మేరకు రెవెన్యూశాఖ ద్వారా వారికి అందిస్తాం.
పూర్తి స్థాయిలో సీజన్‌కు సరిపడా ఎరువులు సిద్ధంగా ఉంచారా..?
జిల్లాలో ప్రస్తుతానికి ఎరువుల కొరత లేదు. ఖరీఫ్‌ సీజన్‌లో యూరియా, డీఏపీ, పొటాష్,. ఎస్‌ఎస్‌పీ, ఇతర సమ్మేళన ఎరువులు 42 వేల మెట్రిక్‌ టన్నులు అవసరం కాగా.. 42,900 మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు డీలర్లు, సహకార సంఘాల్లోనూ లభిస్తాయి. ఆర్‌బీకేల్లో అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేశాం.
కొన్నిచోట్ల మురుగు కాలువలు సక్రమంగా లేక రైతులు ఖరీఫ్‌ సాగు చేపట్టడం లేదు..?
జిల్లాలోని తీర ప్రాంత  మండలాలైన కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, ఆత్రేయపురంలలో ఈ సమస్య ఎక్కువగా ఎదురవుతుంటుంది. ఖరీఫ్‌ సీజన్‌లో ముంపు సమస్య ఉన్నచోట్ల సాగు చేపట్టని ప్రాంతాలున్నాయి. మురుగు కాలువల ఆధునికీకరణ అవసరాన్ని సంబంధితశాఖ సమన్వయంతో జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్తాం. 
యాంత్రీకరణ పథకం ద్వారా రైతులకు ఏమేం ఇస్తారు.?
రైతులకు వ్యక్తిగతంగా పవర్‌ స్ప్రేయర్లు తదితర యంత్ర పరికరాలు, రాయితీపై బరకాలు అందించేందుకు ప్రతిపాదనలు పంపించాం. రాగానే అందిస్తాం.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని