logo

యువకుడి బలవన్మరణం

మండపేట 20వ వార్డు గొల్లపుంత కాలనీకి చెందిన యువకుడు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Published : 19 Jun 2024 05:50 IST

ఫ్రీ ఫైర్‌ గేమ్‌ కారణమై ఉండొచ్చని పోలీసుల అనుమానం

దుర్గాకుమార్‌ (పాతచిత్రం)
మండపేట: మండపేట 20వ వార్డు గొల్లపుంత కాలనీకి చెందిన యువకుడు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇందుకు పబ్జీని పొలిన ఫ్రీ ఫైర్‌ గేమ్‌ కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాల్లోకి వెళితే గొల్లపుంతకు చెందిన సోము నాగ దుర్గాకుమార్‌ (19) తాపీ పని చేస్తుంటాడు. మంగళవారం ఉదయం పనికి వెళ్లిన ఆయన సాయంత్రం 6.30 గంటలకు తిరిగి ఇంటికి వచ్చాడు. తర్వాత కాసేపటికి డాబాపైకి వెళ్లి దూడలకు కట్టే తాడుతో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించి వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నాగ దుర్గాకుమార్‌కు ఎవరితోను గొడవలు, ఆర్థిక ఇబ్బందులు లేవని తల్లిదండ్రులు తెలిపారు. నాగదుర్గాకుమార్‌ చరవాణిలో ఫ్రీ ఫైర్‌ అనే గేమ్‌ ఉందని, ఇది మనుషులను ఒంటరి చేస్తుందని.. ఈ కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సీఐ అఖిల్‌ జామ, ఎస్సై హరికోటి శాస్త్రి తెలిపారు. మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పతివాడ నూక దుర్గారాణి ఆసుపత్రికి వచ్చి యువకుడి తల్లిదండ్రులను ఓదార్చారు.


ఇంటి అద్దె చెల్లించాలని వేధింపులు 
ఉరేసుకుని కిరాయిదారు బలవన్మరణం 

నిజాంపేట, న్యూస్‌టుడే: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఓ వ్యక్తిని అద్దె డబ్బుల కోసం ఇంటి యజమానురాలు వేధించడంతో తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. తెలంగాణ రాష్ట్రం మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండల కేంద్రానికి చెందిన దాసరి వరప్రసాద్‌ (45), శైలజ దంపతులు కొన్నాళ్ల క్రితం నగరానికి వలస వచ్చారు. బాచుపల్లి సాయినగర్‌ పరిధిలోని ఆదిత్య గార్డెన్స్‌లో నివాసం ఉంటున్నారు. వరప్రసాద్‌ స్థిరాస్తి వ్యాపారం చేస్తుండగా.. భార్య గృహిణి. వారికి కళాశాల విద్య అభ్యసిస్తున్న కుమారుడు ఉన్నాడు. వరప్రసాద్‌కు ఇటీవల ఆర్థిక ఇబ్బందులు అధికమయ్యాయి. దీంతో తాను ఉంటున్న ఇంటికి అద్దె డబ్బులు మూడు నెలలుగా కట్టడం లేదు. ఈ నెల 15న భార్య కుమారుడు పోచారంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. దీంతో అతను ఒంటరిగా ఉన్నాడు. అద్దె డబ్బుల కోసం యజమానురాలైన లక్ష్మీనర్సమ్మ శనివారం సాయంత్రం వరప్రసాద్‌కు ఫోన్‌ చేసి పరుషంగా దూషించారు. దాంతో మానసికంగా కుంగిపోయిన అతను దూషించిన ‘కాల్‌ రికార్డింగ్‌’ సంభాషణను సోమవారం సాయంత్రం భార్యకు పంపించి బాధపడ్డాడు. మంగళవారం పలుమార్లు భార్య ఫోన్‌ చేసినా తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆమె కుమారుడితో సహా ఇంటికి వచ్చి చూడగా భర్త గదిలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెంది ఉన్నాడు. మృతుడి భార్య శైలజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇంటి యజమానురాలిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై జి.రమేష్‌ తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని