logo

టమాఠా...!

టమాటా ముట్టుకుంటే భయపెడుతోంది. బయట మార్కెట్లో కొద్దామంటే ధరల బేజారు.. రైతు బజార్లల్లో నాణ్యమైన సరకు దొరకని పరిస్థితి వినియోగదారులకు ఎదురవుతోంది.

Published : 19 Jun 2024 06:15 IST

టమాటా ముట్టుకుంటే భయపెడుతోంది. బయట మార్కెట్లో కొద్దామంటే ధరల బేజారు.. రైతు బజార్లల్లో నాణ్యమైన సరకు దొరకని పరిస్థితి వినియోగదారులకు ఎదురవుతోంది.

న్యూస్‌టుడే, దేవీచౌక్‌ (రాజమహేంద్రవరం): వాతావరణ పరిస్థితుల కారణంగా దిగుబడి తగ్గి కొద్ది రోజులుగా టమాటా ధర జిల్లాలో క్రమంగా పెరుగుతున్నాయి. స్థానిక పంట అందుబాటులో లేకపోవడం, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు మదనపల్లి మార్కెట్‌పై ఆధారపడటంతో డిమాండ్‌కు సరిపడా సరఫరా ఉండటం లేదు.

రైతుబజార్లలో..

రైతుబజార్లలో నెలరోజుల క్రితం కేజీ రూ.25 ఉండగా రూ.15 పెరిగి మంగళవారం కేజీ రూ.40కి చేరుకుంది. ఈ నెల 6న రూ.44 వరకు వెళ్లి మళ్లీ కొంతమేర తగ్గింది. రైతుబజార్లలో విక్రయిస్తున్న టమాటాలు ఏ మాత్రం నాణ్యంగా ఉండటం లేదు. 

బహిరంగ మార్కెట్లో..

ప్రస్తుతం టోకు మార్కెట్‌లో నాణ్యత తక్కువగా ఉన్న టమాటా 25 కేజీలు రూ.900 ఉండగా.. నాణ్యమైనవి రూ.1,500-రూ.1,800 వరకు ఉన్నాయి. బహిరంగ మార్కెట్లో రూ.70 నుంచి రూ.80 వరకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. 

సరఫరా తగ్గిందిలా..

ఉమ్మడి జిల్లాలో రాజమహేంద్రవరంలో పరిశీలిస్తే.. నగరంతోపాటు పరిసర ప్రాంతాలకు రోజుకు సుమారు 17 టన్నులు టమాటా అవసరం. ప్రస్తుతం పది టన్నులు మాత్రమే వస్తున్నాయి. అవి కూడా గోళీల సైజులో ఉండే మూడో రకం సరకు. సోమవారం రెండు లారీలు రాగా మంగళవారం మధ్యాహ్నం వరకు మళ్లీ సరకు జాడేలేదు.  

అధికారి ఏమంటారంటే..

జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి సునీల్‌ వినయ్‌ మాట్లాడుతూ కొద్దిరోజులుగా మదనపల్లి మార్కెట్‌ నుంచి దిగుమతులు తగ్గాయన్నారు. దిగుమతి చేసుకుందామన్నా అక్కడా సరకు అందుబాటులో లేదన్నారు. సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారులు రెండు రోజులుగా దృష్టి సారించారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని