logo

వామ్మో.. వంద దాటేశాయ్‌!

చుట్టూ జలాలున్నా.. తాగడానికి గుక్కెడు స్వచ్ఛమైన నీళ్లు అందడంలేదు. పారిశుద్ధ్య నిర్వహణ పేరుతో రూ.కోట్లు కరిగిపోతున్నా.. జనావాసాల్లో, ఊరి శివార్లలో పారిశుద్ధ్యం మెరుగుపడడంలేదు

Updated : 19 Jun 2024 06:31 IST

పెరుగుతున్న అతిసార కేసులు
నిన్న కొమ్మనాపల్లి.. నేడు బెండపూడిలో భయం భయం

తుని ప్రాంతీయ ఆసుపత్రిలో బెండపూడి అతిసార రోగులు

చుట్టూ జలాలున్నా.. తాగడానికి గుక్కెడు స్వచ్ఛమైన నీళ్లు అందడంలేదు. పారిశుద్ధ్య నిర్వహణ పేరుతో రూ.కోట్లు కరిగిపోతున్నా.. జనావాసాల్లో, ఊరి శివార్లలో పారిశుద్ధ్యం మెరుగుపడడంలేదు. గతితప్పిన పారిశుద్ధ్యం.. వ్యర్థాలతో నిండిన మురుగు కాలువలు.. వాటి పక్కనుంచే వెళ్తున్న పైపు లైన్లు.. ఇవే ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. వైకాపా అయిదేళ్ల పాలనలో గతితప్పిన పరిస్థితికి సాక్ష్యమే తాజాగా వెలుగుచూస్తున్న అతిసార కేసులు. గతంలోనూ ఈ జాడలున్నా.. తాజా పరిస్థితులు కలవరపెడుతున్నాయి.

  • కొమ్మనాపల్లిలో అతిసార ప్రబలింది. ఈనెల 14 నుంచి పీడిత కేసులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటివరకు సుమారు 90 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఒకరు మృత్యువాత పడ్డారు. 
  • బెండపూడిలో కలుషిత జలాలు తాగి సోమవారం 18 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. తుని  ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్సలు అందిస్తున్నారు. వీరిలో ఇద్దరు గర్భిణులు, ఇద్దరు బాలింతలు, ఓ బాలుడికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మరికొందరు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉన్నారు.

ఈనాడు, కాకినాడ, - న్యూస్‌టుడే, తొండంగి, తుని: కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనాపల్లి, బెండపూడి గ్రామాల్లో కలుషిత కల్లోలంతో ఆసుపత్రుల్లో చేరుతున్న డయేరియా పీడితుల సంఖ్య పెరుగుతోంది. ఇక్కడే కాదు. ఉమ్మడి జిల్లాలో చాలాచోట్ల గతితప్పిన పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. వ్యర్థాల నిర్వహణ సవ్యంగా లేక గ్రామాల ముఖ ద్వారాల పక్కనే చెత్తకుప్పలుగా పోసి తగలబెట్టే పరిస్థితులున్నాయి. నివాసాలు, వాణిజ్య సముదాయాలు, ఇతరత్రా వ్యర్థ జలాలు శుద్ధిచేయకుండా గోదావరి కాలువల్లోకి వదిలేసే పరిస్థితులూ పలుచోట్ల కనిపిస్తున్నాయి. పైపులైన్ల లీకేజీలతో అడపాదడపా సమస్యలు వెలుగుచూస్తున్నాయి. పెను ముప్పు ఆవహించకముందే మేల్కొనడం మేలన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. గత పాలకుల నిర్లక్ష్యాన్ని గుర్తించిన కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియ సమర్థంగా సాగితే పరిస్థితులు కుదుటపడే అవకాశం ఉంది.

కేసులతో ఉక్కిరిబిక్కిరి

బెండపూడిలో 9,570 మంది జనాభా ఉన్నారు. మంగళవారం ఓ తాగునీటి బావిలో జలాలు కలుషితం అవ్వడంతో 18 మందికి పైగా అతిసారం బారిన పడ్డారు. పీడితులంతా విరేచనాలతో నీరసించి ఆస్పత్రుల పాలయ్యారు. కొమ్మనాపల్లిలో పాత రక్షిత మంచినీటి పథకంలో సవ్యంగా క్లోరినేషన్‌ చేయకపోవడం.. 20 ఏళ్ల క్రితం నాటి పైపులైన్లలో లోపాలతో జలాలు కలుషితమయ్యాయి. మండలంలో 22 పంచాయతీలుంటే.. కేవలం అయిదుగురే పంచాయతీ కార్యదర్శులున్నారు. దీంతో పంచాయతీ అధీనంలో పథకాలపై పర్యవేక్షణ లోపంతో పరిస్థితి గతి తప్పిందనే వాదన వినిపిస్తోంది. 

మేల్కోకుంటే ముప్పే

  •  కాకినాడలో 2022లో అయిదు అతిసార కేసులు వెలుగుచూస్తే.. తాజాగా తొండంగి మండలంలో ఆ సంఖ్య వంద దాటింది.
  • పురాతన పైపులైన్లు కొన్నిచోట్ల ఉండడంతో పైపుల్లోకి చెట్ల వేర్లు చొరబడే పరిస్థితులు అమలాపురం మున్సిపాల్టీలో గతంలో దర్శనమిచ్చాయి. కలుషిత జలాలతో ప్రజలు అడపాదడపా ఇబ్బంది పడుతున్నా చక్కదిద్దే చర్యలు లేవు.

గరళం.. శాపం..

  • ఉమ్మడి జిల్లాలో 3,466 ఆవాసాలు ఉంటే.. సమగ్ర రక్షిత మంచినీటి పథకాల ద్వారా 1,719 ఆవాస ప్రాంతాలకు రక్షిత మంచినీరు అందిస్తున్నారు. నీటి పథకాల క్లోరినేషన్‌కు సమయాలు నిర్దేశించినా.. క్లోరినేషన్‌లో ఆధునిక పద్ధతులు వచ్చినా ఈ ప్రక్రియ సవ్యంగా సాగక కొన్నిచోట్ల ఇబ్బందులు తప్పడంలేదు. జల్‌ జీవన్‌ మిషన్, వాటర్‌ గ్రిడ్‌ పథకాలు ముందుకు కదలడం లేదు.

    జాగ్రత్తలు తప్పనిసరి..

వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, దాహం, నోరు ఎండిపోవడం, చర్మం సాగే గుణం కోల్పోవడం, మూత్ర విసర్జన తగ్గిపోవడం లాంటివి అతిసార వ్యాధి లక్షణాలు. వేడిచేసి చల్లార్చిన నీరు, క్లోరినేషన్‌ చేసిన మంచి నీరు తాగడం ఉత్తమం. వేడిగా వండినవి తినాలి.  
- జె.నరసింహ నాయక్, డీఎంహెచ్‌వో, కాకినాడ జిల్లా 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని