logo

అన్న క్యాంటీన్లకు వీడిన గ్రహణం

అయిదేళ్లపాటు అన్న క్యాంటీన్లకు పట్టిన గ్రహణం వీడింది. ఇవి మళ్లీ తెరుచుకోనున్నాయి. రోజువారీ కూలి పనులు చేసుకుని పొట్ట నింపుకొనే వారు, చిరు వ్యాపారులు, వివిధ పనులపై పట్టణాలకు వచ్చే ప్రజలు, బాటసారులు ఆకలితో పస్తులు ఉండాల్సిన అవసరం లేకుండా తెదేపా హయాంలో వీటికి శ్రీకారం చుట్టారు.

Updated : 20 Jun 2024 04:49 IST

మండపేటలో సిద్ధమవుతున్న అన్న క్యాంటీన్‌ భవనం

న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్‌ : అయిదేళ్లపాటు అన్న క్యాంటీన్లకు పట్టిన గ్రహణం వీడింది. ఇవి మళ్లీ తెరుచుకోనున్నాయి. రోజువారీ కూలి పనులు చేసుకుని పొట్ట నింపుకొనే వారు, చిరు వ్యాపారులు, వివిధ పనులపై పట్టణాలకు వచ్చే ప్రజలు, బాటసారులు ఆకలితో పస్తులు ఉండాల్సిన అవసరం లేకుండా తెదేపా హయాంలో వీటికి శ్రీకారం చుట్టారు. రూ.5లకే ఉదయం అయితే అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందించే వారు. వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే వాటికి మంగళం పాడి పేదల కడుపుపై కొట్టింది. 

పునరుద్దరణకు ఆదేశాలు..

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తామని చెప్పిన విధంగానే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజునే నాలుగో సంతకంగా అన్న క్యాంటీన్ల పునఃప్రారంభ దస్త్రంపై చేశారు. దీంతో మూతపడిన క్యాంటీన్లను పునరుద్ధరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

జిల్లాలో నాలుగు చోట్ల..

డా.బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో అమలాపురం, మండపేట, రామచంద్రపురం పురపాలికలు కాగా, ముమ్మిడివరం నగర పంచాయతీగా కొనసాగుతోంది. 2014లో తెదేపా అధికారంలో ఉండగా ఈ నాలుగు పట్టణాల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. 2019లో వైకాపా అధికారం చేపట్టిన తరువాత వీటిని మూసి వేశారు. రామచంద్రపురం, ముమ్మిడివరంలోని అన్న క్యాంటీన్‌ భవనాల్లో సచివాలయాలు నిర్వహించే వారు. మండపేటలో అన్న క్యాంటీన్‌ నిర్వహించిన భవనాన్ని వైకాపా సర్కారు నిరుపయోగంగా మార్చివేసింది. అమలాపురంలోని భవనంలో సర్క్యులర్‌ బజార్‌లో ఏర్పాటు చేద్దామని గతంలో అధికారులు ప్రయత్నించగా కొందరు స్థానికులు అభ్యంతరం తెలిపారు. ప్రస్తుతం వీటన్నింటినీ పునః ప్రారంభించే పనిలో అధికారులు ఉన్నారు. ఇందులో భాగంగా రామచంద్రపురం భవనంలోని సచివాలయాన్ని వేరే చోటకు మార్పు చేశారు. 

అప్పట్లో అవసరమైన ప్రాంతాల్లోనే ఏర్పాటు..

నిత్యం పేదలు, సామాన్యులు వివిధ పనులపై పట్టణాలు, నగరాలకు వెళ్తుంటారు. ఇక్కడ భోజనం చేయాలంటే వారికి తలకు మించిన భారమయ్యేది. దీంతో అనేక మంది మంచినీళ్లు తాగి కడుపు నింపుకొనేవారు ఈ అవస్థలను గమనించి 2018లో అప్పటి సీఎం చంద్రబాబు  అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. సామాన్యులు, కూలీలు భవన నిర్మాణ కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి అక్కడే వీటిని నిర్మించారు. 

ఆగమేఘాలపై సిద్ధం..

వైకాపా ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసి వేయడంతో పలు చోట్ల భవనాలు శిథిల స్థితికి చేరుకున్నాయి. అయిదేళ్ల పాటు వీటిని పట్టించుకోక పోవడంతో సామగ్రి ధ్వంసమమైంది. మరికొన్ని చోట్ల సచివాలయాలను ఏర్పాటు చేయడంతో సామగ్రి ఏమైందో తెలియని పరిస్థితి. తాజాగా రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, నూతనంగా అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం వీటని పునఃప్రారంభించాలని నిర్ణయించడంతో పాత భవనాలను శుభ్రం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని