logo

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు మంచి రోజులు

ఇంటర్మీడియట్‌లోనూ బైజూస్‌ కంటెంట్‌ ప్రవేశ పెట్టేలా చర్యలు తీసుకోవాలి. టోఫెల్‌ పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహించాలి. మండలానికి రెండు జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు చేయాలి.’ 

Published : 20 Jun 2024 03:44 IST

విద్యార్థులకు పాఠ్య, రాతపుస్తకాల పంపిణీకి చర్యలు

ముమ్మిడివరం డా.ఎంజీఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుంచి బయటకు వస్తున్న విద్యార్థులు

ఇంటర్మీడియట్‌లోనూ బైజూస్‌ కంటెంట్‌ ప్రవేశ పెట్టేలా చర్యలు తీసుకోవాలి. టోఫెల్‌ పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహించాలి. మండలానికి రెండు జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు చేయాలి.’ 

.. ఇవి గడిచిన ఐదేళ్ల పాలనలో జగన్‌మోహన్‌రెడ్డి తరచూ అధికారులకు ఇచ్చిన ఆదేశాలు. ఏదో చేసేస్తున్నామని ప్రజల్లో భ్రమ కల్పించడం మినహా.. ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు కనీసం పాఠ్యపుస్తకాలు కూడా అందించలేకపోయారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు బాధ్యతలు స్వీకరించిన తరుణంలో ఈ ఏడాది నుంచి జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు పాఠ్య, రాత పుస్తకాలు,  బ్యాగులు సైతం అందించాలని కొత్త ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

న్యూస్‌టుడే, ముమ్మిడివరం : డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 13 ప్రభుత్వ, 6 సాంఘిక సంక్షేమ గురుకుల, ఒక ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. అలాగే హైస్కూల్‌ ఫ్లస్‌లో భాగంగా జడ్పీ ఉన్నత పాఠశాలల్లో జూనియర్‌ కళాశాలల ఏర్పాటుకు సంబంధించి జిల్లాలోని అమలాపురం మినహా 21 చోట్ల బాలికల జూనియర్‌ కళాశాలలు, ఈ ఏడాది నుంచి కో-ఎడ్యుకేషన్‌ కళాశాలలుగా అల్లవరం, అమలాపురం, అంబాజీపేట, ఆత్రేయపురం, ఐ.పోలవరం, కపిలేశ్వరపురం, కాట్రేనికోన, కె.గంగవరం, సఖినేటిపల్లి, ఉప్పలగుప్తం మండలాల్లో ఏర్పాటు చేయనున్నారు. వీటిలో 2500 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉండగా.. ఏటా మొదటి సంవత్సరంలో 2000 నుంచి 2400 మంది వరకు విద్యార్థులు చేరుతున్నారు. వీరంతా పేద కుటుంబాలకు చెందిన వారే. వీరికి ఈ ఏడాది నుంచి పాఠ్యపుస్తకాలతోపాటు 12 రాత పుస్తకాలు, బ్యాగు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చేనెల 15 నాటికి వీరికి పుస్తకాలు అందించాలనే లక్ష్యంతో కార్యాచరణ ప్రారంభించారు.

అయిదేళ్లుగా విద్యార్థులపై రూ.5 కోట్ల భారం 

గతంలో తెదేపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జూనియర్‌ కళాశాల విద్యార్థులకు పుస్తకాల పంపిణీ జరిగేది. 2001 నుంచి 2018 వరకు వారికి మధ్యాహ్న భోజన పథకం కూడా అమలు చేసేవారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా సర్కారు పాఠ్య పుస్తకాల పంపిణీకి మంగళం పాడడంతోపాటు మధ్యాహ్న భోజన పథకం అమలు నిలిపివేసింది. ఈ అయిదేళ్లు విద్యార్థులు సొంతంగా పుస్తకాలు కొనుగోలు చేసుకోవడంతో ఆర్థిక భారం పడింది. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ వంటి సైన్సు గ్రూపులకు పాఠ్య పుస్తకాలు, పఠన సామగ్రి, ప్రాక్టికల్, రాత పుస్తకాలకు ఒక్కో విద్యార్థికి రూ.3 వేలు వరకు ఖర్చయ్యేది. సీఈసీ, హెచ్‌ఈసీ వంటి ఆర్ట్స్‌ గ్రూపు విద్యార్థులు రూ.2 వేల వరకు  పుస్తకాలకు ఖర్చు చేసేవారు. ఇలా ఏటా.. జిల్లాలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులపై రూ.1.05 కోట్లు భారం పడేది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు పుస్తకాల పంపిణీకి ఉత్తర్వులు ఇవ్వడంతో విద్యార్థులపై ఆ భారం తొలగనుంది.

నూతన ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం..

జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసేందుకు కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఆనందం కలిగిస్తోంది. గత ఏడాది ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం పాఠ్య పుస్తకాలు సొంతంగా కొనుగోలు చేసుకున్నాం. అయిదేళ్లుగా పుస్తకాలు పంపిణీ నిలిపివేయడంతో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదివే విద్యార్థులమంతా చాలా ఇబ్బందులు పడ్డాం. మళ్లీ పుస్తకాల పంపిణీకి చర్యలు చేపట్టడం.. పేద విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గుతుంది. 

- కె.రమేష్‌బాబు, ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థి, ముమ్మిడివరం 

కార్యాచరణ ప్రారంభిస్తున్నాం..

జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు పాఠ్య, రాత పుస్తకాలు, బ్యాగులు అందజేయడానికి ఉత్తర్వులు వచ్చాయి. జిల్లాలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఎన్ని పుస్తకాలు కావాలనే అంశంపై వివరాలు సేకరిస్తున్నాం. జూనియర్‌ ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు ఇంకా సమయం ఉంది.. అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఇవి పూర్తయ్యాక వారి సంఖ్య లెక్క తేలుతుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీకి చర్యలు చేపడతాం. 

- వి.సోమశేఖరరావు, డీఐఈవో, డా. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని